Gynecology: నొప్పి... దుర్వాసనతో కూడిన వైట్‌ డిశ్చార్జ్‌.. ఇదేమైనా ప్రమాదమా?

30 May, 2022 12:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గైనకాలజీ

నాకు 28 ఏళ్లు. ఓ వారం రోజులు (ఈ ఉత్తరం రాస్తున్నప్పటికి)గా పొత్తి కడుపులో విపరీతంగా నొప్పి.. దుర్వాసనతో కూడిన వైట్‌ డిశ్చార్జ్‌ అవుతోంది. డాక్టర్‌కు చూపించుకుంటే మందులు రాసిచ్చారు. అవి వాడుతున్నా ప్రయోజనమేమీ లేదు. జ్వరం కూడా వస్తోంది. ఇదేమైనా ప్రమాదమా?
– సీహెచ్‌. అనిత, బద్దెనపల్లి

మీరు వెంటనే ఆసుపత్రికి వెళ్లి కన్సల్టెంట్‌ను కలిసి చెకప్‌ చేయించుకోవాలి. మందులు వేసుకున్నా తగ్గలేదంటే, చాలా జాగ్రత్తగా ట్రీట్‌మెంట్‌ చేయాలి. అవసరమైతే ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది కూడా. మీకున్న ఈ సమస్యను పీఐడీ అంటారు. చాలామందికి ఇది బాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల వస్తుంది. యోని నుంచి గర్భసంచి, అండాశయాలు, ఫాలోపియన్‌ ట్యూబ్స్‌కి ఇన్‌ఫెక్షన్‌ వ్యాపిస్తుంది.

సరైన చికిత్స తీసుకోకపోతే జ్వరం, ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువై ప్రమాదకరంగా మారుతుంది. డాక్టర్‌ను సంప్రదిస్తే, కాటన్‌ స్వాబ్స్‌తో యోని నుంచి వైట్‌ డిశ్చార్జ్‌ని తీసి పరీక్షకు పంపిస్తారు. ఈ పరీక్షలో ఏ ఇన్‌ఫెక్షన్‌ ఉంది? ఏ స్థాయిలో ఉంది? ఎలాంటి యాంటీబయాటిక్స్‌ ఇవ్వాలి అనేది అర్థమవుతుంది. మూత్రనాళంలో కూడా ఇన్‌ఫెక్షన్‌ వచ్చే చాన్సెస్‌ ఉంటాయి. కొన్ని రక్తపరీక్షలు చేయాల్సి ఉంటుంది.

ట్రాన్స్‌ వెజైనల్‌ అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేసి లోపల గర్భసంచి, అండాశయాలకేమైనా వాపు ఉందా అని చూస్తారు. జ్వరం వచ్చిందంటే యాంటీబయాటిక్స్‌ ఐవీ ఇస్తారు. తర్వాత రెండు వారాల వరకు యాంటీబయాటిక్స్‌ మాత్రలు వేసుకోవాలి. ఇలా సరైన చికిత్స తీసుకుంటే ఇన్‌ఫెక్షన్‌ పూర్తిగా నయమవుతుంది. లేదంటే భవిష్యత్‌లో ఇన్‌ఫెక్షన్‌ తిరగబడి పిల్లలు కలగడంలో సమస్యలు తలెత్తవచ్చు. మీకు నొప్పి తగ్గడానికి కొన్ని పెయిన్‌ కిల్లర్స్‌ ఇస్తారు. 48 నుంచి 72 గంటల్లో మీ సమస్య సర్దుకోలేదంటే ఆసుపత్రిలో చేరి, తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. 

మేడం.. మా అమ్మకి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అని తేలింది రీసెంట్‌గా. నాకు ఇప్పుడు 35 ఏళ్లు. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే క్యాన్సర్‌ వచ్చే రిస్క్‌ ఎక్కువ అంటారు కదా.. నేను ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి?
– కాంస్యం పద్మజ, ముప్కాల్‌

రొమ్ము క్యాన్సర్‌కు చాలాసార్లు కారాణాలు తెలియవు. పది శాతం రొమ్మ క్యాన్సర్లు కుటుంబంలో రన్‌ అవుతాయి. అంటే ఆ జీన్‌ తల్లిదండ్రుల్లో ఉంటే, అది జన్యుపరమైన మార్పులతో పిల్లలకు క్యాన్సర్‌ వచ్చే రిస్క్‌ ఉంటుంది. అందరిలో బీర్‌సీఏ1, బీఆర్‌సీఏ2 అనే రెండు జీన్స్‌ ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ రాకుండా మన శరీరాన్ని కాపాడుతాయి. కానీ కొంతమందిలో ఈ జీన్స్‌ జన్యు మార్పిడిలో మ్యుటేటెడ్‌ జీన్స్‌ అవుతాయి.

అవి పిల్లలకు వచ్చినప్పుడు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ చాన్సెస్‌ పెరుగుతాయి. ఈ జీన్స్‌లో మ్యుటేషన్‌ ఓవరీ క్యాన్సర్‌కి కూడా కారణం అవుతుంది. ఫస్ట్‌ డిగ్రీ రిలేటివ్స్‌ అంటే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు.. వీళ్లల్లో కనుక ఆ మ్యుటేటెడ్‌ జీన్‌ ఉంటే, అది కుటుంబ పరంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌కి కారణం అవుతుంది. అలా తెలిసినప్పుడు జెనెటిక్‌ కౌన్సెలర్‌తో మాట్లాడాలి. ఒక్కోసారి అలాంటి అసాధారణ జీన్‌ ఉన్నా, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రిస్క్‌ చాలా తక్కువ.

అందుకే జీన్‌ టెస్టింగ్‌ అందరికీ సూచించరు. మీరు చేయించుకోవాలనుకుంటే డాక్టర్‌ను సంప్రదించి, దాని గురించి కూలంకషంగా మాట్లాడాలి. క్లోజ్‌ ఫాలో–అప్‌ కేర్‌లో ఉండడానికి జీన్‌ టెస్టింగ్‌ సహాయపడుతుంది. క్రమం తప్పకుండా అల్ట్రాసౌండ్‌ బ్రెస్ట్‌ స్కాన్‌ లేదా మామోగ్రఫీ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. నలభై ఏళ్ల వయసు దాటాక ప్రతి రెండేళ్లకు ఒకసారి మామోగ్రఫీ స్క్రీనింగ్‌ చేయించుకోవాలి. ప్రతి నెలసరి తరువాత స్వీయ పరీక్ష చేసుకోవాలి. 

డాక్టర్‌గారూ.. మా పాప వయసు ఏడున్నరేళ్లు. అప్పుడే నెలసరి వచ్చేసింది. ఎద కూడా ఎదిగింది. ఇంత చిన్నవయసులో ఈ విపరిణామమేంటో భయంగా ఉందండీ!
– ఎన్‌. ప్రసూన, ఎమ్మిగనూరు
మీరు తప్పకుండా డాక్టర్‌ని కలవాలి. దీనిని ముందస్తు రజస్వల అంటారు. ఎనిమిదేళ్లలోపు ఎద పెరగడం, నెలసరి మొదలవడం మంచిది కాదు. కొంతమందిలో జననేంద్రియాల దగ్గర రోమాలు రావడం కూడా ఉంటుంది. చాలామందిలో దీనికి కారణమేంటో తెలియదు. ఎండోక్రైనాలజిస్ట్, గైనకాలజిస్ట్‌.. ఈ ఇద్దరినీ సంప్రదించాలి. హార్మోన్లకు సంబంధించి కొన్ని పరీక్షలు చేయాలి. పెల్విస్, తలకు సంబంధించిన ఎమ్‌ఆర్‌ఐ చేస్తారు.

ముందుగా కారణం కనుక్కొని చికిత్స చేస్తే మంచి హైట్‌ పెరుగుతారు. మెదడుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉండి ఇలా నెలసరి మొదలైతే వాళ్లకు కంటి చూపులో మార్పులు వస్తాయి. కళ్ల నరాలు ఇన్‌వాల్వ్‌ అయి ఉండొచ్చు.

దీనికి పిట్యూటరీ, తలకు ఎమ్‌ఆర్‌ఐ చేస్తారు. చర్మానికి సంబంధించి ఏవైనా క్రీమ్స్‌ వాడుతున్నారా అనేది కూడా డాక్టర్‌కు స్పష్టం చేయాలి. టాపికల్‌ హార్మోన్‌ క్రీమ్స్‌ మంచివి కావు. తెల్లబట్ట కూడా ఎక్కువగా అవుతుంది. కుటుంబంలో ఇలాంటి హిస్టరీ ఉందా అని కూడా చెక్‌ చేయాలి. థైరాయిడ్‌ పరీక్షలూ చేస్తారు. పిల్లలకు ఈస్ట్రోజెన్, ఆండ్రోజెన్‌  హార్మోన్‌ క్రీమ్స్‌ వాడకూడదు.  

-డా. భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌
చదవండి: Gynecology: పిల్లలు కాకుండా ఆపరేషన్‌.. శారీరకంగా, మానసికంగా కోలుకున్న తర్వాతే..

మరిన్ని వార్తలు