మూత్రానికి వెళ్లేటప్పుడు రక్తస్రావం.. ప్రమాదకర లక్షణమా?

12 Dec, 2021 09:31 IST|Sakshi

నా వయసు 20 ఏళ్లు. ఎత్తు 5.4, బరువు 77 కిలోలు. పీసీఓడీ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. టాబ్లెట్లు వేసుకుంటే తప్ప పీరియడ్స్‌ రావడం లేదు. గడ్డంపై, పైపెదవి మీద వెంట్రుకలు వస్తున్నాయి. నా సమస్యకు తగిన చికిత్స సూచించగలరు.
– మౌనిక, పిడుగురాళ్ల

మీ ఎత్తు 5.4 అడుగులు. ఈ ఎత్తుకు గరిష్ఠంగా 60 కిలోల వరకు బరువు ఉండవచ్చు. కానీ మీరు 77 కిలోలు ఉన్నారు. అంటే, 17 కిలోలు అధిక బరువుతో ఉన్నారు. అధిక బరువుతో పాటు పీసీఓడీ సమస్య కూడా ఉందంటున్నారు. పీసీఓడీ సమస్యలో గర్భాశయానికి ఇరువైపులా ఉండే అండాశయాలలో నీటిబుడగలు ఏర్పడటం, మగవారిలో ఎక్కువగా ఉండే ఆండ్రోజన్‌ హార్మోన్లు వీరిలో ఎక్కువగా విడుదలవడం, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఏర్పడటం, వాటి ప్రభావం వల్ల పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం, ముఖంపై అవాంఛిత రోమాలు, జుట్టు అధికంగా ఊడిపోవడం, మొటిమలు రావడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

మీ సమస్యకు చికిత్సలో ముఖ్యమైన భాగం బరువు తగ్గడమే! రోజూ కనీసం అరగంటైనా వాకింగ్, యోగా, ఏరోబిక్స్‌ వంటి వ్యాయామాలు చేస్తూ, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ, మితంగా పోషకాహారం తీసుకుంటూ బరువు తగ్గడం వల్ల ఇన్సులిన్‌ రెసిస్టెన్స్, ఆండ్రోజెన్‌ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి, హార్మోన్లు సక్రమంగా పనిచేసి, పీరియడ్స్‌ సక్రమంగా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మరీ మందులు వాడితేనే పీరియడ్స్‌ వచ్చే పరిస్థితి కాకుండా, కనీసం రెండు నెలలకైనా వచ్చే అవకాశాలు ఉంటాయి.

బరువు తగ్గడంతో పాటు డాక్టర్‌ను సంప్రదిస్తే, హార్మోన్ల అసమతుల్యతను బట్టి ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ తగ్గించడం ద్వారా ఆండ్రోజన్‌ హార్మోన్ల ఉత్పత్తి తగ్గించడానికి అవసరమైన మందులతో పాటు అవసరమైతే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్లు కలిసి ఉండే కొన్ని రకాల కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌ కూడా ఇవ్వడం జరుగుతుంది. బరువు తగ్గుతూ, మందులు వాడుతూ ఇప్పటికే ఉన్న అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి డెర్మటాలజిస్టును సంప్రదించి లేజర్‌ వంటి చికిత్సలు తీసుకోవచ్చు. కొందరిలో కేవలం బరువు తగ్గడం వల్ల కూడా పీరియడ్స్‌ సక్రమంగా వచ్చి, అవాంఛిత రోమాలు ఇంకా ఎక్కువగా పెరగకుండా ఉంటాయి. 

నా వయసు 60 ఏళ్లు. రుతుక్రమం ఆగిపోయి దాదాపు పదేళ్లవుతోంది. ఆరునెలలుగా మూత్రానికి వెళ్లేటప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా రక్తస్రావం కనిపిస్తోంది. ఇదేమైనా ప్రమాదకర లక్షణమా? నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు.
– ప్రభావతి, ఒంగోలు

మూత్రానికి వెళ్లేటప్పుడు రక్తస్రావం మూత్రంలో పడుతోందా లేక యోనిభాగం నుంచి వస్తోందా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. మూత్రంలో ఇన్ఫెక్షన్లు, మూత్రాశయంలో కంతులు, రాళ్లు, కిడ్నీ సమస్యలు వంటి ఇతర కారణాల వల్ల మూత్రంలో రక్తం పడవచ్చు. పీరియడ్స్‌ ఆగిపోయిన తర్వాత మళ్లీ రక్తస్రావం అవడాన్ని పోస్ట్‌ మెనోపాజల్‌ బ్లీడింగ్‌ అంటారు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. కొందరిలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ పూర్తిగా తగ్గిపోయి, యోనిభాగం పూర్తిగా పొడిబారిపోయి, ఇన్ఫెక్షన్స్‌ ఏర్పడి కొద్దిగా బ్లీడింగ్‌ కనిపించవచ్చు. కొందరిలో గర్భాశయంలో కంతులు, గర్భాశయ పొర మందంగా ఏర్పడటం, గర్భాశయ క్యాన్సర్లు, గర్భాశయ ముఖద్వారం దగ్గర పుండ్లు, కండ పెరగడం (సర్వైకల్‌ పాలిప్స్‌), సర్వైకల్‌ క్యాన్సర్, అండాశయాలలో కంతులు వంటి అనేక కారణాల వల్ల పోస్ట్‌మెనోపాజల్‌ బ్లీడింగ్‌ రావచ్చు.

మీకు రక్తస్రావం ఎందుకు వస్తుందో తెలుసుకోవడానికి, చికిత్సలు తీసుకోవడానికి ఒకసారి గైనకాలజిస్టును సంప్రదిస్తే, వారు అల్ట్రాసౌండ్, ట్రాన్స్‌వజైనల్‌ స్కానింగ్, ప్యాప్‌స్మియర్‌ వంటి పరీక్షలు చేయించి, సమస్యను బట్టి గర్భాశయ పొర మందంగా ఉండటం లేదా పాలిప్‌ వంటివి ఉండటం గుర్తిస్తే, దానికి డీ అండ్‌ సీ చేసి, గర్భాశయాన్ని శుభ్రపరచి తీసిన ముక్కలను బయాప్సీకి పంపించి, ఆ రిపోర్టును బట్టి క్యాన్సరా కాదా అనేది నిర్ణయించి, గర్భాశయం తొలగించడం అవసరమా లేదా అనేది నిర్ణయించి, తగిన చికిత్స అందిస్తారు. కొందరిలో గర్భాశయ ముఖద్వారం దగ్గర కండపెరగడం వల్ల బ్లీడింగ్‌ జరుగుతుంది.

అలాంటప్పుడు అదనంగా పెరిగిన కండను తొలగిస్తే సరిపోతుంది. కొందరిలో ఇన్ఫెక్షన్ల వల్ల, గర్భాశయంలో నీరు చేరడం వల్ల బ్లీడింగ్‌ కావచ్చు. వాటికి యాంటీబయోటిక్స్‌ ఇస్తే సరిపోతుంది. కొందరికి ఎండోమెట్రియమ్‌ పొరలో కండ పెరగడం వల్ల ఏర్పడే పాలిప్స్‌ను హిస్టరోస్కోపీ అనే పద్ధతి ద్వారా గర్భాశయం లోపలికి చూస్తూ, పాలిప్‌ను తొలగించి, బయాప్సీకి పంపడం జరుగుతుంది. అది సాధారణ పాలిప్‌ అని బయాప్సీలో తేలితే వేరే చికిత్స అవసరం ఉండదు. ఒకవేళ క్యాన్సర్‌కు సంబంధించినదని తేలితే, గర్భాశయాన్ని తొలగించడం జరుగుతుంది.

-డా.వేనాటి శోభ
గైనకాలజిస్ట్‌
హైదరాబాద్‌

 

మరిన్ని వార్తలు