Gynecology:పీరియడ్స్‌ సరిగా రావడం లేదు.. రిష్కారం చెప్పగలరు..

17 Oct, 2021 08:22 IST|Sakshi

సందేహం

నా వయసు 19 ఏళ్లు. నేను స్టూడెంట్‌ని. ఎత్తు 5.2, బరువు 40 కిలోలు. నాకు పీరియడ్స్‌ సరిగా రావడం లేదు. గత జూన్‌లో పీరియడ్స్‌ వచ్చాక, మళ్లీ ఇంతవరకు రాలేదు. పీరియడ్స్‌ వచ్చినప్పుడు కూడా బ్లీడింగ్‌ చాలా కొద్దిగా మాత్రమే ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు.
–వందన, మేడ్చల్‌

మీ ఎత్తు 5.2 అడుగులకు కనీసం 50 కేజీల బరువు ఉండాలి. మీరు కేవలం 40 కిలోల బరువే ఉన్నారు. తక్కువ బరువు ఉన్నారు కాబట్టి, మీలో పోషకాహార లోపం ఉండే అవకాశాలు ఎక్కువ. అలాగే రక్తహీనత, థైరాయిడ్‌ వంటి హార్మోన్ల అసమతుల్యత వంటి ఇతర సమస్యలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటి వల్ల పీరియడ్స్‌ సక్రమంగా రాకుండా ఉండవచ్చు. కొందరిలో సన్నగా ఉన్నా, జన్యుపరమైన కారణాల వల్ల, పీసీఓడీ సమస్య కూడా కొద్దిగా ఉండవచ్చు.

దీనివల్ల కూడా పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవచ్చు. ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి సీబీపీ, థైరాయిడ్‌ ప్రొఫైల్‌ వంటి రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్‌ పెల్విస్‌ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకుని, కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. అలానే ఆహారంలో పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, డ్రైఫ్రూట్స్‌తో కూడిన పోషకాహారం తీసుకోవడం మంచిది.

నాకు పెళ్లయి ఎనిమిది నెలలైంది. పెళ్లికి ముందు నాకు ఎలాంటి సమస్యలూ లేవు గాని, పెళ్లి తర్వాత నుంచి తరచుగా ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాను. మందులు వాడితే తగ్గినా, కొద్దిరోజుల్లోనే సమస్య మళ్లీ మొదలవుతోంది. నా సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా?
– రాగిణి, మెంటాడ
ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ కాండిడా వంటి ఫంగస్‌ రోగక్రిముల వల్ల వస్తుంది. ఇది సాధారణంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నా, రక్తహీనత వల్ల, సుగర్‌ వ్యాధి ఉన్నా తరచుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే భర్త నుంచి భార్యకు, భార్య నుంచి భర్తకు కలయిక ద్వారా సంక్రమించవచ్చు. అలాంటప్పుడు మందులు ఒక్కరే కాకుండా, దంపతులు ఇద్దరూ సరైన కోర్సు యాంటీఫంగల్‌ మందులు ఒకేసారి వాడుతూ, ఆ సమయంలో దూరంగా ఉండటం మంచిది. చికిత్సలో భాగంగా నోటి ద్వారా మాత్రలతో పాటు దురద, తెల్లబట్ట వంటి లక్షణాలను బట్టి యాంటీ ఫంగల్‌ క్రీములు, పౌడర్, సోపు, యోనిలో పెట్టుకునే సపోసిటరీస్‌ ఇవ్వడం జరుగుతుంది.

లక్షణాల తీవ్రతను బట్టి మందులు ఎంతకాలం వాడాలనేది డాక్టర్‌ సూచించడం జరుగుతుంది. సీబీపీ, ఆర్‌బీఎస్‌ వంటి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకుని, రక్తహీనత ఉంటే దానికి తగ్గ ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ, ఐరన్‌ మాత్రలు వాడుకోవాలి. అలాగే సుగర్‌ ఏమైనా పెరిగే అవకాశాలు ఉంటే, దానిని అదుపులో ఉంచుకోవాలి. శారీరక, వ్యక్తిగత శుభ్రత పాటించడం ముఖ్యం. మీ వారికి సుగర్‌ ఉన్నా, లక్షణాలు ఏవీ లేకపోయినా కూడా తన నుంచి మీకు ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీవారికి కూడా రక్తపరీక్షలు చేయించడం మంచిది.

డా.వేనాటి శోభ
గైనకాలజిస్ట్‌
హైదరాబాద్‌

మరిన్ని వార్తలు