Gynecology: అధిక బరువుంటే పిల్లలు కలగడం కష్టవుతుందా?

17 Oct, 2021 12:30 IST|Sakshi

నా వయసు 23 ఏళ్లు. ఎత్తు 5.4, బరువు 87 కిలోలు. నాకు త్వరలోనే పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లు భావిస్తున్నారు. డైటింగ్‌ చేసినా ఫలితం కనిపించట్లేదు. అధిక బరువు కారణంగా పెళ్లి తర్వాత ఇబ్బందులు తప్పవని, పిల్లలు కలగడం కూడా కష్టమవుతుందని, త్వరగా బరువు తగ్గాలంటే సర్జరీ ఒక్కటే మార్గమని ఫ్రెండ్స్‌ చెబుతున్నారు. సర్జరీలో రిస్క్‌ ఏమైనా ఉంటుందా? 
– నీరజ, మిర్యాలగూడ

5.4 అడుగుల ఎత్తుకి గరిష్ఠంగా 60 కేజీల బరువు ఉండవచ్చు. మీరు 87 కేజీల బరువు ఉన్నారు. అంటే, 27 కేజీలు అధిక బరువు. 23 సంవత్సరాల వయసులోనే ఇంత అధిక బరువు వల్ల పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం, పీసీఓడీ సమస్య, థైరాయిడ్‌ సమస్యలు, మోకాళ్ల నొప్పులు, ఆయాసం, చిన్న వయసులోనే బీపీ పెరగడం, సుగర్‌ పెరగడం, కొలెస్ట్రాల్‌ పెరగడం వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అధిక బరువు వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి అండం విడుదల సరిగా లేకపోవడం, దాని వల్ల పెళ్లయిన తర్వాత కలయికలో ఇబ్బంది, గర్భం నిలబడటానికి ఇబ్బంది ఏర్పడవచ్చు.

కొన్నిసార్లు గర్భం వచ్చినా అబార్షన్లు అయ్యే అవకాశాలు, గర్భంతో ఉన్నప్పుడు బీపీ పెరగడం, సుగర్‌ పెరగడం, కాన్పులో ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి డైటింగ్‌ ఒక్కటే సరిపోదు. ఆహార నియమాలతో పాటు వాకింగ్, యోగా, జిమ్, ఏరోబిక్స్, డాన్స్, జుంబా వంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. అలాంటప్పుడే మెల్లగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. అయినా తగ్గనప్పుడు మాత్రమే బేరియాట్రిక్‌ సర్జరీకి వెళ్లవలసి ఉంటుంది. బేరియాట్రిక్‌ సర్జరీలో ఆహారం ఎక్కువగా తినకుండా ఉండటానికి, కొంచెం తినగానే కడుపు నిండిపోయినట్లు ఉండటానికి, తిన్న ఆహారంలో కొలెస్ట్రాల్‌ రక్తంలో కలవకుండా మలంలో వెళ్లిపోవడానికి దోహదపడేట్లు చేయడం జరుగుతుంది.

ఈ ఆపరేషన్‌ వల్ల బరువు బాగానే తగ్గుతారు కానీ, పోషక పదార్థ లోపాలు ఉంటాయి. దీనికోసం ఆపరేషన్‌ తర్వాత విటమిన్‌ మాత్రలు వాడవలసి ఉంటుంది. ఎటువంటి సర్జరీ అయినా వందలో ఒకరికి, మత్తు ఇవ్వడంలో ఇంకా సర్జరీలో, సర్జరీ తర్వాత కాంప్లికేషన్స్‌ ఉండవచ్చు. కాబట్టి మీరు మొదట డైటీషియన్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు ఆహార నియమాలను పాటించడం, అలాగే వ్యాయామాలు క్రమంగా చేయడం వల్ల మెల్లగా కొన్ని నెలలలో కొద్దిగా బరువు తగ్గే అవకాశాలు బాగానే ఉంటాయి.
 

మరిన్ని వార్తలు