జుట్టు రాలుతోందా...? అరికట్టండిలా..! 

24 Sep, 2020 07:52 IST|Sakshi

మీ జుట్టు రాలిపోతోందా? ఆందోళన పడకండి... ఈ కింద పేర్కొన్న అంశాలను తెలుసుకొని, సూచించిన జాగ్రత్తలను పాటించండి.

మంచి జుట్టు కోసం ముఖ్యంగా మూడు అంశాలు అవసరం. అవి... జింక్, ఐరన్, విటమిన్‌–సి. ఈ మూడూ పుష్కలంగా అందేలా మన ఆహారాన్ని ప్లాన్‌ చేసుకుంటూ ఉంటే జుట్టు రాలిపోవడాన్ని చాలావరకు అరికట్టవచ్చు. 

ఐరన్‌ కోసం 
మనకు ఐరన్‌ సమృద్ధిగా అందాలంటే... గుడ్డు, డ్రైఫ్రూట్స్, జీడిపప్పు లాంటి నట్స్, సీఫుడ్స్‌ వంటి తీసుకోవాలి. మాంసాహారంలోనూ... కాలేయం, కిడ్నీల వల్ల ఐరన్‌ ఎక్కువగా సమకూరుతుంది. శాకాహారులైతే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే పాలకూర వంటి ఆకుకూరల్లో ఐరన్‌ ఎక్కువ. అందుకే ఆహారంలో వాటి పాళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. విటమిన్‌–సి కోసం ఆహార పదార్థాలన్నింటిలోనూ ఉసిరిలో విటమిన్‌–సి పుష్కలంగా దొరుకుతుంది. అలాగే బత్తాయి, నారింజ వంటి నిమ్మజాతి పండ్లన్నింటిలోనూ విటమిన్‌–సి ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. 

జింక్‌ కోసం
గుమ్మడి గింజల్లో జింక్‌ పుష్కలంగా ఉంటుంది. అందుకే వాటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. జుట్టు విపరీతంగా ఊడిపోయేవారి ఆహారంలో జింక్, ఐరన్‌ పుష్కలంగా ఉండాలని బ్రిటిష్‌ న్యూట్రిషన్‌ ఫౌండేషన్‌ గట్టిగా సిఫార్సు చేస్తోంది.జింక్‌కు గుమ్మడి గింజలు మంచి వనరు. దానితో పాటు సీఫుడ్, డార్క్‌చాక్లెట్, వేరుసెనగలు, వేటమాంసంలోనూ జింక్‌ ఎక్కువే. పుచ్చకాయ గింజల్లోనూ జింక్‌ ఎక్కువే. మీరు తినే సమతులాహారంలో ఇవి తీసుకుంటూనే... జుటు ఆరోగ్యం కోసం వారంలో కనీసం రెండు సార్లు తలస్నానం చేయండి. జుట్టు రాలిపోవడం తగ్గుతుంది. 

అప్పటికీ జుట్టు రాలుతుంటే మాత్రం... ఒకసారి థైరాయిడ్‌ పరీక్ష చేయించుకుని డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే థైరాక్సిన్‌ హార్మోన్‌ అసమతౌల్యతతో  జుట్టు రాలే సమస్య ఉంటుంది. ఆహారం ద్వారానే ఈ సమస్యను అధిగమించాలనుకుంటే మీ డైట్‌లో క్రమం తప్పకుండా చేపలు ఉండేలా చేసుకొండి. ఇన్ని జాగ్రత్తల తర్వాత కూడా జుట్టు రాలడం ఆగకపోతే ఓసారి ట్రైకాలజిస్ట్‌ / డర్మటాలజిస్ట్‌ను కలవండి.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా