జుట్టుకు ఊపిరి ఇవ్వండి..

3 Mar, 2021 06:42 IST|Sakshi

ముఖారవిందానికి కళ తెచ్చేవి ఒత్తైన కేశాలే. వాటిని ఎలా కాపాడుకోవాలి? పోషణ ఎలా? ఎలా దువ్వితే మంచిది? ఏ షాంపూ వాడాలి? ... ఇలా ప్రతీది సందేహమే. పొట్టిదైనా, పొడుగుదైనా జుట్టు విషయంలో చాలా మంది పొరపాట్లు చేస్తూనే ఉంటారు. జుట్టు ఊడిపోతోందని బాధపడుతూనే ఉంటారు. అలా కాకుండా.. కురుల సిరులు కాపాడుకోవాలంటే రోజువారీగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. 

అతిగా దువ్వకండి
చాలా మంది చేసే రోజువారీ పొరపాట్లలో ఇది ప్రధానమైంది. మాడుకు రక్తప్రసరణ బాగా అందుతుంది, జుట్టు మృదువుగా, మెరుపుగా అవుతుందని మరీ ఎక్కువగా దువ్వుతారు. దీనివల్ల సహజసిద్ధ తైలంలో మాడు భాగంలో అన్ని వెంట్రుకలకు అందుతాయి. కానీ, ఎనిమిది తొమ్మిది సార్ల కంటే ఎక్కువ దువ్వక్కరలేదు. ఎక్కువ సార్లు దువ్వడం వల్ల జుట్టు లాగినట్లుగా అవుతుంది, జుట్టు కుదుళ్లు పాడవుతాయి. జుట్టు కొసలు చిట్లుతాయి. అలాగే, ఎలాంటి జుట్టుకి ఎలాంటి దువ్వెన వాడాలో తెలియకపోతే కష్టమే. ఒత్తుగా, కర్లీగా ఉన్న జుట్టుకి పళ్ళు వెడల్పుగా ఉన్న దువ్వెన కావాలి. స్టైలింగ్‌ కి రౌండ్‌ బ్రీజిల్స్‌ ఉన్న దువ్వెన వాడాలి. బాగా చిక్కు పడే జుట్టుకి బ్రష్‌ను ఎంచుకోవాలి. మీ హెయిర్‌ టైప్‌ని బట్టి దువ్వెన ఎంచుకోవడం మంచిది.

చిట్లిన వెంట్రుకల కోసం...
హెయిర్‌ కట్‌ని కొంతకాలం పాటు వాయిదా వేస్తుంటే జుట్టు బాగా డ్రై గా తయారవుతుంది. జుట్టు కొసలు చిట్లుతాయి. పొట్టి జుట్టు ఉన్న వాళ్ళకి జుట్టు ఎంత పెరుగుతోందో గమనించడం తేలికే. కానీ పొడుగు జుట్టు ఉన్న వాళ్ళు ఎప్పుడు హెయిర్‌ కట్‌ చేయించుకోవాలో చూసుకోవడం కొద్దిగా కష్టం. అలాగే, పొడుగు జుట్టు ఉన్న వారికి జుట్టు కొసలు చిట్లడం కూడా ఎక్కువే. రెండు నెలలకి ఒకసారైనా హెయిర్‌ ట్రిమ్‌ చేయించుకోవాలి. ఒకసారి వెంట్రుకలు చిట్లాక ఏ షాంపూ, నూనె కూడా దాన్ని సరి చేయలేదు.

ఆయిల్‌ పెట్టడం మంచిదే
జుట్టుకు నూనె పెట్టుకోవడం చాదస్తం అనుకుంటారు చాలామంది. నిజానికి జుట్టుకు తగినంత పోషణ ఇచ్చేది నూనెలే. చాలా రకాల హెయిర్‌ ప్రాబ్లమ్స్‌కి ఆయిల్‌ పెట్టడమే పరిష్కారం. తలస్నానానికి ముందు నూనె పెట్టడం వలన మీ జుట్టు చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇందుకు కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆలివ్‌ ఆయిల్‌ బాగా ఉపకరిస్తాయి. అయితే, రోజంతా అలా జిడ్డు తలతో ఉండటం బాగుండదు, జుట్టుకు కూడా మంచిది కాదు. ఇది గమనించకపోతే ఇబ్బందే!

మరిన్ని వార్తలు