@ హెయిర్‌ బై సీమ

14 Apr, 2022 00:20 IST|Sakshi
సెలబ్రెటీ హెయిర్‌ స్టైలిస్ట్‌ సీమా మనే

కట్టుబాట్లు, హద్దులు ఎన్ని ఉన్నా.. అన్నింటిని చెరిపేసి అనేక రంగాల్లో తమదైన ముద్రవేస్తున్న మహిళలెందరినో చూస్తున్నాం. చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ తమలోని ప్రతిభతో వెలుగులోకి వచ్చి ప్రపంచానికి తామేంటో నిరూపిస్తూ ఎంత మందికి ఉదాహరణగా నిలుస్తున్నారు మరికొందరు. ఈ కోవకు చెందిన వారే సెలబ్రెటీ హెయిర్‌ స్టైలిస్ట్‌ సీమా మనే.

షోలాపూర్‌లోని బర్షీలో పుట్టింది సీమా మనే. చిన్నతనంలో అనేక కష్టాలను చూస్తూ ఆశ్రమంలో పెరిగిన సీమ.. తొమ్మిదో తరగతి అయిన తరువాత చదువు మానేసింది. ఆశ్రమంలోనే హెల్త్‌ సెంటర్‌లో పనికి చేరింది. తర్వాత కొన్నేళ్లకు పెళ్లి కుదిరింది సీమకు. వివాహం తరువాత భర్త అండతో తన కష్టాలు కాస్త కుదుటపడ్డాయి. దీంతో ఐదేళ్ల తరువాత భర్త ప్రోత్సాహంతో తనకెంతో ఇష్టమైన హెయిర్‌ కటింగ్‌ కోర్సు చేయాలనుకుంది. భర్త సహకారం అందించడంతో పదోతరగతి చదువుతూనే హెయిర్‌ కటింగ్‌లో డిప్లొమా చేసింది.

కోర్సు పూర్తయ్యాక ఇంట్లోనే ఒక సెలూన్‌ ఏర్పాటు చేసుకుంది. అలా రెండేళ్లపాటు సెలూన్‌ నిర్వహించిన తరువాత సీమకు ఓ ఫ్యాషన్‌ షోలో హెయిర్‌ స్టైలిస్ట్‌గా అవకాశం వచ్చింది. తక్కువ సమయంలో వెరైటీ, మోడ్రన్‌ హెయిర్‌ స్టైల్స్‌తో మోడల్స్‌ను తీర్చిదిద్దడంతో ఈ ఫ్యాషన్‌ ప్రాజెక్ట్‌ విజయవంతమైంది. దీంతో సీమకు మంచి హెయిర్‌ స్టైలిస్ట్‌గా గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపుతో ‘ఎట్‌ ది రేట్‌ హెయిర్‌బై సీమ’ పేరుతో సోషల్‌ మీడియాలో అకౌంట్‌ ను ప్రారంభించింది.

ఈ అకౌంట్‌లో సరికొత్త హెయిర్‌ స్టైల్స్‌ను పోస్టు చేస్తుండేది. ఈ హెయిర్‌ స్టైల్స్‌ నచ్చడంలో గ్లామర్‌ ప్రపంచంలో సీమ బాగా పాపులర్‌ అయ్యింది. దీంతో సినిమాలు, ఫ్యాషన్‌ షోలు, ఫోటోషూట్స్‌లో పనిచేయడానికి అవకాశాలు వచ్చేవి. వచ్చిన ప్రతి అవకాశాన్ని తన ప్రతిభతో సరికొత్త హెయిర్‌స్టైల్స్‌ను రూపొందించి తానేంటో నిరూపించింది. దీంతో సెలబ్రిటీల దృష్టిలో పడింది సీమ.  

ఒక్కోమెట్టు ఎక్కుతూ... అంతర్జాతీయంగానూ
సీమ హెయిర్‌స్టైలిస్ట్‌గా పనిచేసిన సెలబ్రెటీలలో మాధురీ దీక్షిత్, అలియా భట్, తాప్సీ పన్ను, కియరా అడ్వాణి, బిపాషా బసు, కత్రినా కైఫ్, అంబాని కుటుంబానికి చెందిన విభూతి ఉన్నారు. అంతర్జాతీయ వెబ్‌ సిరీస్‌ ‘ఏ సూటబుల్‌బాయ్‌’ లో టబుకు హెయిర్‌ స్టైలిస్ట్‌గా పనిచేసింది. ‘ఘాజీ’ సినిమాలో తాప్సీకి, నామ్‌ షబాన, లక్ష్మీబాంబ్, సూర్మ, మన్‌ మర్జియా, జుడ్వా–2 సినిమాలకు పనిచేసింది.

కళంక్, గుడ్‌న్యూస్, ఎంఎస్‌ ధోణి, కబీర్‌ సింగ్‌ సినిమాల్లో కియరా అడ్వాణికి హెయిర్‌ స్టైల్స్‌ చేసింది. తెలుగు సినిమా బాద్‌షాలో కాజల్‌ అగర్వాల్‌కు మోడ్రన్‌ హెయిర్‌ స్టైల్స్‌ను అందించింది. ఒక్క ఇండియాలోనేగాక అంతర్జాతీయ స్థాయిలోనూ సీమకు మంచి గుర్తింపు లభించింది. 2016లో ఓ పెళ్లిలో హెయిర్‌స్టైల్స్‌ చేయడానికి ఇటలీ వెళ్లగా, ఆ ఏడాది విడుదలైన ‘ద వోగ్‌ వెడ్డింగ్‌ బుక్‌’లో సీమ పేరు ప్రస్తావించారు.  

చేసే పనిలో నిజాయితీ ఉండాలి
‘‘నిజాయితీగా పనిచేస్తే ఫలితం మనకు వందశాతం అనుకూలంగా వస్తుందని అమ్మ చెప్పేవారు. ఎన్ని సమస్యలు ఉన్నా నిబద్ధతతో పని చేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను. తాప్సీ, కియరా లాంటి సెలబ్రెటీల సాయంతో బాలీవుడ్‌లో నాకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకోగలిగాను. ప్రస్తుతం ప్రారంభించబోయే హెయిర్‌ అకాడమీ, స్టూడియోల ద్వారా నాలా మరికొంతమందిని ఇండస్ట్రీకి అందించడమే నా లక్ష్యం’’ అని చెబుతోంది సీమ.

మనలో కష్టపడే తత్వం, ప్రతిభ ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగవచ్చనడానికి సీమ జీవితమే నిదర్శనం.
 

మరిన్ని వార్తలు