హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌: అమరవీరులకు వందనం!

5 Jul, 2021 20:33 IST|Sakshi

హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌... ఇది మనకు పెద్దగా పరిచయం లేని మ్యూజియం. ఇండో– పాక్, ఇండో–చైనా యుద్ధాల్లో మనదేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమర వీరుల జ్ఞాపకార్థం సహ సైనికులు నిర్మించిన మ్యూజియం. 

ఈ ప్రదేశం మొత్తం మనకు కశ్మీర్‌గానే పరిచయం. కానీ తాజా విభజన ప్రకారం ఇది లధాక్‌ కేంద్రపాలిత ప్రాంతం. లధాక్‌ రాజధాని నగరం లేహ్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో లేహ్‌– కార్గిల్‌ రోడ్‌లో ఉంది. 

కెప్టెన్‌ రాసిన ఉత్తరం
హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ మ్యూజియం రెండంతస్థుల భవనం. ఒక అంతస్థులో ఓపీ విజయ్‌ గ్యాలరీ ఉంది. ఇందులో సియాచిన్‌ గ్లేసియర్‌లో డ్యూటీ చేసే భారత సైనికులు ధరించి దుస్తులు, ఇతర వస్తువులు, కార్గిల్‌ యుద్ధంలో మనం ఉపయోగించిన ఆయుధాలతోపాటు ప్రత్యర్థి సైనికుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను కూడా చూడవచ్చు. లెస్ట్‌ ఉయ్‌ ఫర్‌గెట్‌ పేరుతో ఒక గోడ ఉంది. ఆ గోడకు కార్గిల్‌ యుద్ధ చిత్రాలున్నాయి. ‘ఆపరేషన్‌ విజయ్‌’ డాక్యుమెంటరీ చూడవచ్చు. ‘ద లాస్ట్‌ పోస్ట్‌’ పేరుతో మరో గోడ ఉంది. ఇది కదిలే చిత్రాల గోడ. యుద్ధఘట్టాల ఫొటోలు డిస్‌ప్లేలో ఆటో ప్లే అవుతుంటాయి. కెప్టెన్‌ వైజయంత్‌ థాపర్‌ అమరుడు కావడానికి కొద్దిరోజుల ముందు తన తల్లిదండ్రులకు రాసిన ఉత్తరం మనసును కదిలిస్తుంది. మైనస్‌ యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలో, ఎముకలు కొరికే చల్లదనంతో ఉండే సియాచిన్‌ గ్లేసియర్‌లో సైనికులు నివసించే బంకర్లు, గుడారాలు, వెచ్చని దుస్తుల నమూనాలను కూడా ఇక్కడ చూడవచ్చు. 

లధాక్‌ చారిత్రక ప్రదర్శన
మరో అంతస్థు లధాక్‌ చరిత్ర, సంస్కృతిని తెలిపే చిత్రాలు, వస్తువుల సుమహారం. ఇక్కడ ఉన్న సావనీర్‌ దుకాణంలో టీ షర్టులు, కప్పులు, కాఫీ మగ్గులు, పశుమినా శాలువాలుంటాయి. 

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ అదుపులోకి వచ్చిన నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ తిరిగి పర్యాటకద్వారాలు తెరిచింది. డిస్కవర్‌ లధాక్‌ ఎక్స్‌ ఢిల్లీ (ఎన్‌డీఏ 12) ప్యాకేజ్‌లో లేహ్‌కు సమీపంలో ఉన్న హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ మ్యూజియం కూడా ఉంది.

మరిన్ని వార్తలు