శతక నీతికలిసుంటే కలదు సుఖం

17 Jan, 2022 01:15 IST|Sakshi

దూరకుమీ బంధుజనుల.. అంటే బంధువులను దూషిస్తూ వారిని దూరం చేసుకోవద్దంటున్నారు బద్దెన. రామాయణంలో వాలిసుగ్రీవులు అన్నదమ్ములు. ఇద్దరూ బతికున్నంతకాలం దెబ్బలాడుకున్నారు. ఆఖరికి వాలి చచ్చిపోయాడు. సుగ్రీవుడు ఏడ్చాడు. ఏం ఉపయోగం? రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అన్నదమ్ములు. విభీషణుడు చెప్పాడు, కుంభకర్ణుడూ చెప్పాడు... అయినా రావణాసురుడు వినలేదు. రావణుడు, కుంభకర్ణుడూ ఇద్దరూ మరణించారు. విభీషణుడు ఒక్కడే మిగిలిపోయాడు. ఎంత ఏడిస్తే మాత్రం ఆ అన్నదమ్ములు తిరిగొస్తారా !!!
ఎందరో చెప్పారు... స్వయంగా ధర్మరాజు చెప్పాడు, చిట్టచివరకు శ్రీ కృష్ణరాయబారం సమయంలో భీముడు కూడా చెప్పాడు. ‘‘మనం ఐదుగురం. ఆ దుర్యోధనాదులు నూరుగురు. అందరం అన్నదమ్ములం. పెదతండ్రి, పినతండ్రి పిల్లలం. మేం దెబ్బలాడుకోవడమేమిటి? మా మధ్య యుద్ధాలేమిటి? మాకు సాయం చేయడానికి దేశంలో రాజులందరూ రెండు పక్షాలుగా విడిపోవడమేమిటి? 18 అక్షౌ హిణులతో మారణ హోమం ఏమిటి ? ఎందుకీ అన్నదమ్ముల కలహాలు...వద్దు... అందరం కలిసుందాం’’ అన్నాడు.. ధర్మరాజు,అర్జునుడు, నకులుడు, సహదేవుడు, గాంధారి, ధృతరాష్ట్రుడు, విదురుడు, అప్పుడక్కడికి వచ్చిన వ్యాసుడు, మైత్రేయుడు చెప్పారు. ఇంతమంది రుషులు, పెద్దలు, మంత్రులు, తండ్రి... ఎందరు చెప్పినా దుర్యోధనుడు వినలేదు. తమ్ముళ్ళమీద, అన్నగారు ధర్మరాజు మీద యుద్ధమే చేస్తానన్నాడు.

చిట్టచివరకు తొడలు విరిగి యుద్ధభూమిలో పడిపోతే చనిపోబోయేముందు రాబందులు, గద్దలు పైన ఎగురుతుంటే... అప్పుడు ఏడ్చాడు. మహానుభావుడు, మా పినతండ్రి విదురుడు చెప్పిన మాట వినలేదు. అలా విని ఆ ఐదుగురితో సఖ్యంగా ఉంటే ఈవేళ అఖండ సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఎంత గొప్పగా ఉండేవాళ్ళమో... మేం 105 మందిమి కలిసి ఉంటే...  మాకు కీడు తలపెట్టడానికి మా వైపు కన్నెత్తి చూడగల వారెవరయినా ఉండేవారా? అది లేకపోగా నా తమ్ముళ్ళను నేనే చంపుకున్నా...పెద్దలు భీష్ముడు, ద్రోణుడు వంటి వారి మరణానికి నేనే కారణమయ్యా. ఆఖరుకు బంధువులతో గొడవలు పెట్టుకుని ఏం సాధించాను ?...అంటూ చిట్టచివరన ఏడ్చాడు... ఏం లాభం.. ఆఖరికి మరణించాడు. అయినవారు అందరూ మరణించారని మిగిలిన ఐదుగురు కూడా ఏడ్చారు.

పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు. నా కూతురుగా రమ్మని కోరుతూ దక్షప్రజాపతి తపస్సు చేస్తే ఆయనకు కూతురయి దాక్షాయణి అని పేరు పెట్టుకుంది. మామా అల్లుళ్ళు కలిసి ఉండాల్సిన వాళ్లు. అక్కర్లేని గొడవలకు వెడితే... నిండు సభలో శివుడిని అవమానించాడు. అల్లుడిని ఇంత అమర్యాద చేసిన వాడివి ఇంక నీకు గౌరవం ఉండమంటే ఎక్కడుంటుంది.. ఇక నీ కూతురుగా ఉండలేను అంటూ దాక్షాయణి యోగాగ్నిలో దూకేసింది. శంకరుడికి కోపమొచ్చింది. దక్ష ప్రజాపతికి తలకాయ పోయింది. గొర్రె తలకాయతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. శివపార్వతుల శక్తేమిటో తెలుసుకోలేక కేవలం అల్లుడన్న చిన్నచూపుతో అంతటి ఉపద్రవాన్ని కొనితెచ్చుకున్నాడు.

కాబట్టి బంధువులు దెబ్బలాడుకోకూడదు. ఎప్పుడూ ప్రేమానురాగాలతో ఉండాలి. ఒకరిమీద ఒకరు అదేపనిగా దోషాలు, లోపాలు ఎంచే ప్రయత్నం చేయడం, చాడీలు చెప్పుకోవడం, ఫిర్యాదులు చేసుకోవడం, కేసులు పెట్టుకోవడం ఎన్నటికీ మంచి పద్ధతి కాదు. రామాయణం చదవండి, భాగవతం చదవండి, భారతం చదవండి.. అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నోసార్లు నిరూపితమయిన సత్యం ఇది.    
         
 మేం 105 మందిమి కలిసి ఉంటే...  మాకు కీడు తలపెట్టడానికి మా వైపు కన్నెత్తి చూడగల వారెవరయినా ఉండేవారా? అది లేకపోగా నా తమ్ముళ్ళను నేనే చంపుకున్నా.. పెద్దలు భీష్ముడు, ద్రోణుడు వంటి వారి మరణానికి నేనే కారణమయ్యా. ఆఖరుకు బంధువులతో గొడవలు పెట్టుకున ఏం సాధించాను?

మరిన్ని వార్తలు