ఒక కొమ్మకు పూచిన అనుబంధం

21 Aug, 2021 23:55 IST|Sakshi

పుట్టినింటి ప్రేమ బంధం ఎన్నేళ్లయినా దారం పోగులతో మరింత పదిలంగా అల్లుకుంటూనే ఉంటుంది. అన్నా.. చెల్లి.. అక్కా.. తమ్ముడు.. ఆండగా ఉండే ఆప్యాయతలను  మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ మది నిండా సంతోషాలను నింపుతూనే ఉంటుంది. రక్షగా నేనున్నానంటూ జీవితమంతా భరోసాను చూపుతూనే ఉంటుంది. ఒక కొమ్మకు పూచిన పూలను కలిపే దారమైన రాఖీ తోబుట్టువుల ప్రేమను లోకాన చల్లని పున్నమి వెలుగులుగా పంచుతూనే ఉంటుంది. 

‘‘బాగున్నావా అన్నా!’’ అంటూ ఆప్యాయతల మధ్య పుట్టినింటి గడపకు వచ్చి యోగక్షేమాలను కనుక్కునేలా చేసే రాఖీ పండగ అంటే అన్నకు అమితమైన ఆనందం. ‘అంతా సంతోషమేనా చెల్లీ’ అనే అన్న పలకరింపుతో గుండె బరువును దింపేసే రాఖీ అంటే తోబుట్టువుకు సంబరమే.  హంగూ ఆర్బాటాలకు చోటు లేని, ధనిక–పేద తేడా చూపని రాఖీ తమ జీవితాల్లో నింపే ఆనందం గురించి కొందరు తోబుట్టువులు పండగపూట పంచుకున్న అనుభవాలు ఇవి. 

కేరింగ్‌.. షేరింగ్‌
హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాం. పీజీ వరకు చదువుకున్న. గవర్నమెంట్‌ టీచర్‌ అవ్వాలని పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నాను. నాకు తోడబుట్టిన అన్నదమ్ములు లేరు. మా చిన్నమ్మ కొడుకు గోపాల్‌ నాకు తోడబుట్టినవాడికంటే ఎక్కువ. ఏ చిన్న అవసరమైనా ‘అక్కా’ అంటూ ముందుంటాడు. తోడబుట్టిన  అన్నదమ్ములు లేరనే లోటు ఎప్పుడూ అనిపించలేదు. చిన్ననాటి నుంచి ఇద్దరం కలిసే పెరిగాం. స్కూల్, కాలేజీ ప్రతి చిన్న విషయం తమ్ముడితో షేర్‌ చేసుకోకుండా ఏ రోజూ లేదు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా రాఖీ కట్టడం మిస్‌ అవలేదు. 
– విజయలక్ష్మి

జీవితానికి మంచి దారి
ఇప్పుడు నేను బీటెక్‌ చేస్తున్నానంటే అక్క ఇచ్చిన సజెషన్సే. చదువులో ఎప్పుడూ సాయంగా ఉంటుంది. టెన్త్, ఇంటర్, ఆ తర్వాత బీటెక్‌ చేసే విషయంలోనూ అక్క గైడెన్స్‌ ఉంది. నాకు అవసరమైనది అమ్మనాన్నలకు చెప్పి మరీ ఒప్పిస్తుంది. నేనే విషయంలోనైనా నిర్ణయం తీసుకోవడంలో ఆందోళన పడుతున్నట్టుగా అనిపిస్తే చాలు వెంటనే పసిగట్టేస్తుంది. ట్యూషన్స్‌ చెప్పి, పార్ట్‌ టైమ్‌ వర్క్స్‌ చేస్తుంటుంది. చదువే జీవితాలను మార్చుతుంది అని ఎప్పుడూ చెబుతుంది. ఏదైనా అవసరం ఉంటుందని, నాకే డబ్బులు ఇస్తుంటుంది. 
– గోపాల్‌

నా బాధ్యత
మా  అమ్మ, నాయినలు కూలీనాలీ చేసుకుని బతుకుతుండిరి. నేను ఏడో తరగతి దాగా చదివిన. నలుగురు అక్కచెల్లెళ్ల తోడ నేను ఒక్కణ్ణే. ముగ్గురు చెల్లెళ్ల పెళ్లిళ్లు ముందుగల్లనే అయిపోయినయి. అమ్మ, నాయిన చనిపోతే చెల్లెలి బాధ్యత∙నాదే అనుకున్న. మంచిగ చదువుకుని మా ఇంటికి వెలుగైంది. ఇప్పుడు నా ఇద్దరు పిల్లల చదువుల సంగతి మా చెల్లెనే చూసుకుంటోంది. నా చెల్లెలిని చూస్తే గర్వంగా, సంతోషంగా ఉంటుంది. 
– సాయిలు

మా అన్న త్యాగం గొప్పది
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలో ఉంటున్నాం. మా అమ్మనాన్నలు చనిపోతే అన్నీ తానై చూసుకున్నాడు మా అన్న. కూలి పనులకు వెళుతూ నన్ను చదివించాడు. ఇవ్వాళ నేను ఉన్నత చదువు చదవడానికి కారణం మా అన్నయ్యే. ఎం.ఎ. బీఈడీ చేశాను. ఇప్పుడు విద్యాశాఖలో క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌ (సీఆర్‌పీ)గా పనిచేస్తున్నాను. అన్నయ్య చేతుల మీదుగానే పెళ్లి జరిగింది. ఈ రోజు నేను ఆనందంగా ఉన్నానంటే మా అన్ననే కారణం. నా కోసం అన్న చేసిన త్యాగం చాలా గొప్పది.
– సరోజ

కలిస్తే పండగే!
రాఖీ పండగ నాడు మా అన్న మా ఇంటికైనా రావాలి. లేదంటే నేనే మా అన్న ఇంటికి వెళ్లాలి. అన్న ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తాడు. నేను ఇండ్లళ్ల పనులు చేస్త. నా పెళ్లయి పదిహేనేళ్లయినా ఏ ఒక్కసంవత్సరమూ రాఖీ కట్టుకోకుండా ఉన్నది లేదు. ఒకసారి అన్నకు ఆరోగ్యం బాగోలేకుండే. ఎంత తల్లడిల్లిననో. ఎంత మంది దేవుళ్లకు మొక్కుకున్ననో. అన్న ఉంటే ఎంతో ధైర్యంగా అనిపిస్తది. మేం, మా అన్నపిల్లలు, మా పిల్లలు కలిస్తే చాలు ఆ రోజు మా ఇంట్ల పండగే. ఇక రాఖీ పండగ అయితే చాలు, ఆరోజు అందరం కలిసి సినిమాకు కూడా పోయేవాళ్లం. రాఖీ పండగ నాడు మాత్రం మా అన్న నాకు చీర తేకుండా రాడు.
– సుమలత

ఒకరికొకరం రక్ష
మా సుమలత మనసు మంచిది. తన చేత్తో ఏది తీసుకున్నా నాకు మంచి జరుగుతుందని చిన్నప్పటి నుంచి నాకు నమ్మకం. మేం సదువుకున్నది లేదు. కానీ, ఒకరి కష్టంలో ఒకరం తోడుంటం. మాది రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్‌ల పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నం. ఊరి నుంచి దూరంగా వచ్చి బతుకుతున్నవాళ్లం, మాకు మేమే రక్షగా ఉండాలనుకుంటాం.
– సురేష్‌

మా మామయ్యకు మా అమ్మ రాఖీ కడుతుంది. నేను మా తమ్ముడు అజయ్‌కి రాఖీ కడతాను. పొద్దున్నే నేనూ, తమ్ముడు కొత్తబట్టలు వేసుకుంటాం. అమ్మ స్వీట్‌ చేస్తుంది. నాకు చాక్లెట్స్‌ ఇష్టం. అమ్మనడిగితే తిడుతుంది. కానీ, రాఖీ పండగ రోజు మాత్రం పెద్ద చాక్లెట్‌ కొని తమ్ముడితో నాకు ఇప్పిస్తుంది. ఒకటే చాక్లెట్‌ కదా అందుకని సగం చాక్లెట్‌ను తమ్ముడికి ఇస్తాను. ఈ పండగ చాలా బాగుంటుంది.
– లాస్య

ఎంత పని ఉన్నా ముందుంటాడు
మాది తెలంగాణలోని చేవెళ్ల. ఆశావర్కర్‌గా పనిచేస్తున్నాను. రాఖీ పండగ వచ్చిందంటే చాలు మా తమ్ముడు ఇంటికి రాకుండా ఉండడు. ముగ్గురు అక్కచెల్లెళ్లం, ముగ్గురు అన్నదమ్ములం. మా శేఖర్‌ చిన్నవాడు. అందుకే మా కందరికీ వాడంటే కొడుకులెక్క. నాకు ముగ్గురు బిడ్డలు. అందరి బాగోగులు తెలుసుకుంటూ, ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ఎంత పని ఉన్నా ‘అక్కా’ అని వచ్చేస్తడు. 
– అమృత

రాఖీ కడితేనే ఆ ఏడాది అంతా మంచి
అమ్మనాన్నలు పనికిపోతే అక్కనే నన్ను ఎక్కువ చూసుకుంది. అమ్మలెక్కనే నా బాగోగులు చూసుకుంది. హైదరాబాద్‌ బాలానగర్‌లోని ఓ హాస్పిటల్‌లో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తా. మా అందరి పెళ్ళిళ్లు అయి ఎవరి కుటుంబాలు వారివి అయినా వారానికి ఒకసారైనా కలుసుకుంటం. రాఖీ పండగ వస్తే మాత్రం ఎక్కడున్నా అక్కల దగ్గరవాలిపోతా. వారి చేత రాఖీ కట్టించుకుంటేనే ఆ సంవత్సరం అంతా నాకు మంచిగ ఉంటుందని నమ్మకం. 
– శేఖర్‌ 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు