Ugadi 2023: ఉగాది పండుగ.. ఈ విశేషాలు తెలుసా?

22 Mar, 2023 16:10 IST|Sakshi

ఈ విషయాలు తెలుసా?

మత్స్యావతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు.

అంటే కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతేకాదు, వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకొంటారు.

ఇతర విశేషాలు
ఈ రోజు కొత్తగా పనులు మొదలు పెట్టడం, కొత్తగా కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది  కృతయుగంలో కార్తీకశుద్ధ అష్టమి రోజున ఉగాది జరుపుకునేవారు.
త్రేతా యుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజున ఉగాది జరుపుకునేవారు.
ద్వాపరయుగంలో మాఘశుద్ధ అమావాస్య రోజున ఉగాది జరుపుకునే వారు.
శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులయినది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే.
వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే.

ఇంటికి ఉగాది కళ..
ఏడాది మొత్తం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని గుర్తు చేసే పండగ ఉగాది. కుటుంబసభ్యుల కలయికలో ఆనందం, షడ్రుచుల పచ్చడితో ఆరోగ్యం తెలియజేసే ఈ పండగ వసంతరుతువు ్ర΄ారంభానికి సూచికగానూ జరుపుకుంటారు. శోభకృత్‌నామ సంవత్సరాన్ని శోభాయమానంగా అలంకరించడానికి.. 

స్వాగతించే రంగోలి 
అందమైన ముగ్గుల అలంకరణకు ఎంత శ్రద్ధ పెడతామో మనందరికీ తెలిసిందే. మరింత అందంగా తక్కువ సమయంలో అందరినీ ఆకట్టుకునే రంగోలిని తీర్చలేమనుకునేవారు  రెడీమేడ్‌ డిజైనర్‌ రంగోలీలను కూడా ఎంపిక చేసుకోవచ్చు.  

డోర్‌ హ్యాంగింగ్స్‌ 
మెయిన్‌ డోర్‌ ఇంటికి శక్తిని, శుభాన్ని ఆహ్వానిస్తుంది. మనవైన హస్తకళలు లేదా ఛాయా చిత్రాలని ఉపయోగించవచ్చు. సంప్రదాయ వేడుక కాబట్టి ఇత్తడి డోర్‌బెల్స్‌ను అలంకరిస్తే ప్రత్యేక కళతో పాటు ఆ మువ్వల సవ్వడి ఆనందాన్ని ఇస్తుంది. 

మామిడి, వేప
శుభసూచికగా గుమ్మానికి మామిడి, వేప ఆకులతో తోరణం కడతారు. అలాగే, గుమ్మానికి ఒక వైపు చిన్న అరటి చెట్టును జోడించడం ఈ రోజును మరింత శుభ ప్రదంగా మార్చేస్తుంది. లేదంటే ఆర్టిఫిషియల్‌ అరటి చెట్టును కూడా వాడచ్చు.  

లైటింగ్‌
పండగ అలంకరణలో ప్రత్యేక స్థానాలు వంటగది, పూజ గది. ఈ రెండు ప్లేసుల్లో లైటింగ్‌ డల్‌గా ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకని, ఈ ప్రత్యేకమైన రోజున లైటింగ్‌ విషయంలో శ్రద్ధ తీసుకుంటే కాంతిమంతంగా ఉంటాయి. 

హ్యాంగింగ్స్‌
వాల్‌ పేపర్లు, సంప్రదాయ వాల్‌ హ్యాంగింగ్స్, పూల దండలను వేలాడదీయడం వంటి మరిన్ని అందుబాటులో ఉండే అలంకరణ వస్తువులను ఎంచుకోవచ్చు. సువాసన గల ఇండోర్‌ ΄్లాంట్‌ డెకొరేషన్‌ కూడా పండగ కళను పెంచుతుంది. 

పండగ చేసుకుంటారిలా...
సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టాలి. తలకు నువ్వుల నూనె పట్టించి నలుగు పెట్టుకుని స్నానం చేసి,  కొత్త బట్టలు లేదా శుభ్రమైన ఉతికిన దుస్తులు ధరించాలి.
తెలుపు రంగు లేదా ఈ సంవత్సరం ఉగాది బుధవారం వచ్చింది కాబట్టి వీలయితే బుధుడికి ఇష్టమైన ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం మంచిది. పాలు పొంగించి, పిండి వంటలు సిద్ధం చేసి. ఇష్టదైవాన్ని పూజించాలి. తయారు చేసుకున్న వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి.

అల్పాహారం కంటే ముందుగా తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తినాలి. సంవత్సరం ΄÷డుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది.

ఉగాది రోజున పంచాంగ శ్రవణం వింటే మంచిదని పెద్దలు చెబుతారు. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే 
పంచాంగం వినటం ఆనవాయితీ. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. ఉగాది రోజున కవి సమ్మేళనాలు జరగడం పరిపాటి. 

పచ్చడి ఇలా
పచ్చి మామిడికాయ – ఒకటి (మీడియం సైజు)
వేప పువ్వు – టేబుల్‌ స్పూన్‌ (తొడిమలు ఒలిచినది)
కొత్త చింతపండు – నిమ్మకాయంత (రసం చిక్కగా తీసుకోవాలి)
బెల్లం తురుము – 2 టేబుల్‌ స్పూన్‌లు
ఉప్పు – పావు టీ స్పూన్‌
మిరియాలు లేదా మిరియాల పొడి – అర టీ స్పూన్‌.
 
తయారీ:
పచ్చి మామిడి కాయను శుభ్రంగా కడిగి చెక్కు తీయకుండా సన్నగా ముక్కలు తరగాలి.
ఇందులో వేప పువ్వు, చింతపండు రసం, బెల్లం తురుము, ఉప్పు, పచ్చిమిర్చి వేసి కలపాలి.
షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ. రుచి కోసం టేబుల్‌ స్పూన్‌ కొబ్బరి కోరు, ఒక అరటి పండు గుజ్జు కూడా కలుపుకోవచ్చు.
ఇది ఆంధ్రప్రదేశ్‌ ఉగాది పచ్చడి.
స్పూన్‌తో అరచేతిలో వేసుకుని తినేటట్లు చిక్కగా ఉంటుంది.
తెలంగాణలో ఇదే మోతాదులో తీసుకున్న దినుసులను ఒక పెద్ద పాత్రలో వేసి ముప్పావు వంతు నీటిని పోసి కలపాలి. గ్లాసులో పోసి తాగేటట్లు జారుడుగా ఉంటుంది.  

మరిన్ని వార్తలు