హార్డ్‌వేర్‌ ఇంజనీర్‌.. ఇప్పుడు 18 ఎకరాలలో చిరుధాన్యాలు సాగుచేస్తూ..

14 Sep, 2021 05:45 IST|Sakshi
బ్లాక్‌ రైస్‌ కాలాబట్టి పొలంలో హరీష్‌

చిరుధాన్యాలతోపాటు దేశీ వరి రకాల సాగు

ప్రాసెసింగ్‌ సదుపాయాలతో ఇరుగు పొరుగు

రైతులకూ తోడ్పాటు

అనంతపురం జిల్లా గోరంట్ల మండలం మందలపల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మందలపల్లి హరీష్‌కు వ్యవసాయం పట్ల ఎనలేని మక్కువ. చదువు, ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ ఆలోచనలు మాత్రం నిరంతరం సొంత ఊరు, వ్యవసాయం చుట్టూ తిరిగేవి. ఎమ్మెస్సీ చదివి బెంగళూరులో ఒక కార్పొరేట్‌ కంపెనీలో హార్డ్‌వేర్‌ ఇంజనీర్‌గా చిప్‌ డిజైనింగ్‌ విభాగంలో ఉద్యోగం చేస్తూ వారాంతాల్లో స్వగ్రామానికి వచ్చి సొంత భూమిలో వ్యవసాయ పనులు చక్కబెట్టుకునే వారు. ప్రస్తుతం కరోనా వల్ల ఇంటి నుంచి పనిచేసే అవకాశం లభించడంతో.. పని గంటలు ముగిసిన తర్వాత.. పూర్తిస్థాయిలో వ్యవసాయం చేస్తున్నారు.

ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు
తనకు ఎదురైన ఆరోగ్య సమస్యలకు నగర కాలుష్యం, జీవనశైలి కారణాలని డాక్టర్లు చెప్పటంతో.. హరీష్‌ ఆహారపు అలవాట్లు మార్చుకొని చిరుధాన్యాలు తినడం ప్రారంభించారు. ఆరోగ్యం నెమ్మదిగా కుదుట పడడం మొదలైంది. దీంతో సొంత ఊర్లోనే అవసరమైన పంటలు పండించుకొని కాలుష్యానికి దూరంగా ఉంటూ ఆరోగ్యంగా జీవించవచ్చని నిర్ణయించుకున్నారు. దాదాపుగా 10 సంవత్సరాల పాటు ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేశారు. పాలేకర్‌ చెప్పిన ప్రకృతి వ్యవసాయంలో ఆవు ప్రాముఖ్యత, గోమూత్రం, గోమయం వల్ల కలిగే వ్యవసాయ, ఆరోగ్య ప్రయోజనాలను అవగతం చేసుకున్నారు. అంతటితో ఆగలేదు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని పంచగవ్య విద్యాపీఠంలో సంవత్సరం పాటు శిక్షణ పొందారు. విద్యార్థి దశలో నేర్చుకున్న వేదం, పంచగవ్య శిక్షణకు ఎంతగానో దోహదపడిందని చెప్పారు.

చిరుధాన్యాలతో తొలి ప్రయత్నం
చిరుధాన్యాల వినియోగం పెరుగుతుండటంతో 18 ఎకరాలలో అరికలు, సామలు, ఊదలు, వరిగలు, కొర్రలు, అండు కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నల సాగును హరీష్‌ చేపట్టారు. తాను పండించడంతో పాటు చుట్టుపక్కల ఉన్న రైతులను కూడా చిరుధాన్యాలు పండించేలా ప్రోత్సహిస్తుండటం విశేషం. పంటల చీడపీడలు, యాజమాన్య సమస్యలు అధిగమించేందుకు ఉమ్మడిగా పరిష్కారాలు వెతుక్కుంటూ పరస్పర సహకారంతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు.

కేవలం పంటలు పండించడం వరకే పరిమితం కాకుండా వాటికి విలువ జోడించడం ద్వారా ఆర్థికంగా లబ్ధి ఉంటుందని ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేశారు. తద్వారా తన పంటతో పాటు రైతుల పంటను కూడా ప్రాసెస్‌ చేశారు. తనకు తెలిసిన వినియోగదారులను నేరుగా సంప్రదించి వారికి చిరుధాన్యాలు సరఫరా చేశారు. రైతులు పండించిన పంటకు మాత్రం ప్రాసెసింగ్‌ చార్జీలు మాత్రమే తీసుకుని విలువ జోడింపు ద్వారా వచ్చిన మొత్తాన్ని వారికే అందేలా సహాయపడ్డారు. ప్రాసెసింగ్‌ చేసిన చిరుధాన్యాలకు మంచి ధర లభించడంతో రైతులంతా ఆర్థికంగా లబ్ధిపొందుతున్నారు.

దేశీ వరి రకాల సాగు
చిరుధాన్యాల ధరలు తగ్గడంతో ప్రస్తుతం 8 ఎకరాల్లో విస్తృతంగా అమ్ముడవుతున్న వరి సాగు మొదలు పెట్టారు హరీష్‌. నల్లబియ్యం, ఎర్రబియ్యపు దేశీయ వరి విత్తనాలను సాగు చేస్తున్నారు. నవారా, రాజముడి, రాక్తశాలి, చెన్నంగి,  చిట్టిముత్యాలు, కాలాబట్టి, మణిపూర్‌ బ్లాక్‌ చఖావో, కర్పు కవునీ, సేలం సన్నాలు రకాలను పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే రసాయనాలు లేకుండా పండిస్తున్నారు.

మిల్లెట్స్, మిల్లెట్స్‌ను యంత్రంతో శుద్ధిచేస్తున్న హరీష్‌


రసాయనాల అవశేషాలు లేని మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యంగా జీవించాలనే ఆకాంక్షతో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన హరీష్‌ ఇప్పుడు పలువురి జీవితాలను ప్రభావితం చేస్తున్నారు. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన్న, సన్న కారు రైతులకు ప్రకృతి వ్యవసాయం చేయడం, లాభసాటిగా గోశాల నిర్వహించడం పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని హరీష్‌ (76010 80665) అంటున్నారు.
– ప్రసన్న కుమార్, బెంగళూరు

ఇంటి వద్ద నుంచే హార్డ్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూనే పూర్తిస్థాయి రైతుగా మారి స్వయంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు హరీష్‌.
చిరుధాన్యాలు, దేశీ వరి రకాల సాగుపై దృష్టి సారించారు. చుట్టుపక్కల రైతుల ప్రయోజనం కోసం కూడా కృషి చేస్తూ ఈ హార్డ్‌వేర్‌ ఇంజనీర్‌ శభాష్‌ అనిపించుకుంటున్నారు.  
బ్లాక్‌ రైస్‌ కాలాబట్టి పొలంలో హరీష్‌

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌   //   మీ అభిప్రాయాలు, సూచనలను prambabu.35@gmail.com కు పంపవచ్చు.

మరిన్ని వార్తలు