‘మా అమ్మాయికి చదువు అక్కర్లేదని గొడవలకు దిగేవారు’

9 Jun, 2021 14:50 IST|Sakshi

బెంగళూరులో ఇంటీరియర్‌ డిజైనర్‌గా మంచి పేరున్న హర్‌సంజమ్‌కౌర్‌ వృత్తి నుంచి కాస్త విరామం కోసం మౌంట్‌కైలాష్‌లో నిర్వహించిన మెడిటేషన్‌ క్లాస్‌లకు హాజరయ్యారు. అయితే అక్కడ ఆమె జీవితం కొత్త మలుపు తీసుకుంది. ‘అంగన్‌’ అనే స్వచ్ఛందసంస్థతో  పిల్లల చదువు నుంచి పేదల ఆకలి తీర్చడం వరకు ఎన్నోరకాల సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కౌర్‌.... నిత్యజీవిత పరుగులో పరుగుకే సమయం సరిపోతుంది. కొందరు మాత్రం ఆ పరుగుకు బైబై చెప్పి నిదానంగా కూర్చొని ‘ఆత్మసమీక్ష’ చేసుకుంటారు. కొత్త వెలుగుతో కొత్త దారిలో ప్రయాణిస్తుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తి హర్‌సంజమ్‌కౌర్‌.

‘కోల్‌కత్తాలో ఒక సంపన్న కుటుంబం లో పుట్టాను’.. ‘యూకేలో ఏంబీఏ చేశాను’ ‘ఇంటిరీయర్‌ డిజైనర్‌గా నాకు మంచిపేరుంది’... ఇలా చెప్పుకోవడంలో కౌర్‌కు ఎక్కడా తృప్తి కనిపించలేదు. ‘ఆకలితో నకనకలాడుతున్న నలుగురు అభాగ్యులను ఇంటికి తీసుకెళ్లి కడుపునిండా భోజనం పెట్టాను’ అని చెప్పుకోవడంలో మాత్రం ఆమెకు గొప్ప తృప్తి లభించింది. రొటీన్‌ లైఫ్‌స్టైల్‌కు కాస్త విరామం ఇవ్వడానికి అన్నట్లుగా కౌర్‌ ‘అమ్ముకేర్‌’ అనే స్వచ్ఛందసంస్థ మౌంట్‌కైలాష్‌లో నిర్వహించిన మెడిటేషన్‌ ట్రిప్‌ కు వెళ్లారు. మన దేశంలోని అనేక ప్రాంతాలు, విదేశాల నుంచి అక్కడికి ఎంతోమంది వచ్చారు. ‘మీరు ఎంత సంపాదిస్తున్నారు?’ ‘ఎన్ని ఆస్తులు ఉన్నాయి?’... ఇలాంటి మాటలు అక్కడ మచ్చుకు కూడా వినిపించలేదు. క్షణభంగురమైన జీవితాన్ని వేదాంతకోణంలో దర్శించే మాటలు, పరులకు సేవ చేయడంలో లభించే ‘తృప్తి’ విలువను, ఆ శక్తి ముందుకు నడిపించే చైతన్యాన్ని విశ్లేషించే మాటలు వినిపించాయి.

‘మరి నా సంగతి ఏమిటీ?’ అని తనను తాను ప్రశ్నించుకున్నారు కౌర్‌. దానికి  సమాధానమే ‘అంగన్‌’ అనే స్టడీసెంటర్‌. ‘అమ్ముకేర్‌’తో కలిసి పేదవిద్యార్థులకు ఈ స్టడీసెంటర్‌ ద్వారా వివిధరకాలుగా సహాయం చేయడం మొదలుపెట్టారు కౌర్‌. కూలీపనులకు వెళ్లే శ్రామికులు పిల్లలను ఇంట్లోనే వదిలేసి వెళుతుంటారు. అక్కడ కూలిపని చేస్తున్న మాటే గానీ వారి మనసంతా పిల్లలపైనే ఉంటుంది. పిల్లలు ఏ ప్రమాదం కొని తెచ్చుకుంటారో అని వారి భయం. ఇది గ్రహించిన కౌర్‌ అలాంటి పిల్లలను చేరదీసి వారికి చదువు చెప్పించడం, శుభ్రత, ఆరోగ్యాలను పట్టించుకోవడం ప్రారంభించారు. దీనివల్ల ఇటు పిల్లలకు, అటు తల్లిదండ్రులకు ఇద్దరికీ మేలు జరిగింది. ‘నా బిడ్డ స్కూల్లో భద్రంగా ఉన్నాడు’ అని వారిలో భరోసా వచ్చింది.

‘అంగన్‌’ స్టడీ సెంటర్‌ ద్వారా పిల్లలకు చిత్రకళ, సంగీతం లాంటివి నేర్పించారు. వారిలోని సృజనను వెలికి తీయడానికి రకరకాల పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చి భుజం తట్టారు. ఇదంతా ఒక ఎత్తయితే కొందరు తల్లిదండ్రులు... ‘మా వాడికి చదువు ఎందుకమ్మా... ఇంకో రెండు సంవత్సరాలైతే పనిలోకెళతాడు’ ‘మా అమ్మాయికి చదువుకు అక్కర్లేదు. ఇంట్లో బోలెడు పని ఉంది’ అంటూ కౌర్‌తో గొడవకు దిగేవారు. అయితే ఆమె వారికి ఓపికతో సమాధానం చెప్పేవారు. కొందరు మనసు మార్చుకొని పిల్లలను స్కూలుకు పంపించేవారు. కొందరు ససేమిరా అనేవారు. అయితే ఈ రెండోకోవకు చెందిన వారు కూడా కొన్ని నెలల తరువాత చదువు విలువ గ్రహించి కౌర్‌ చెప్పిన మాటలు విన్నారు.

రెండోసారి కరోనా విలయం మొదలైంది.
బెంగళూరులోని చాలా ప్రాంతాల్లో కూలీలు, శ్రామికులు పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. వారి ఆకలి ని తీర్చడానికి ప్రతిరోజూ ‘ఫుడ్‌సేవ’ కార్యక్రమంతో ముందుకు వచ్చి ఎంతోమంది ఆకలి తీర్చారు. మాస్క్‌లు, శానిటైజర్‌లను ఉచితంగా పంపిణీ చేశారు. ‘మంత్లీఫుడ్‌ కిట్‌’లు సరఫరా చేశారు. ‘డబ్బు విషయంలోనైనా ఇక చాలు అనే మాట వస్తుందేమోగానీ సేవ విషయంలో అది ఎప్పటికీ రాదు’ అంటున్న కౌర్‌ తన సేవాదృక్పథాన్ని మరింత విస్తరించడానికి భవిష్యత్‌ ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు.

చదవండి: కుకింగ్‌ క్వీన్‌ .. 50 ఏళ్ల వయసులో ఫుడ్‌ బ్లాగ్‌..

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు