TTD Brahmotsvam 2022: అప్పట్లో కొండ ఎక్కాలన్నా పన్ను కట్టాల్సిందే!

25 Sep, 2022 13:54 IST|Sakshi

శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు సౌకర్యార్థం టీటీడీ ఎన్నో వసతులు కల్పిస్తోంది. ఉచిత దర్శనం మొదలుకొని ఉచిత అన్నప్రసాదం, ఉచిత రవాణా, ఉచితంగా బస, ఇలా సామాన్య భక్తులకు అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. ఇదివరకు పరిస్థితులు ఇంత సౌకర్యవంతంగా ఉండేవి కాదు. ఒకానొక కాలంలో కొండ ఎక్కాలన్నా పన్ను కట్టాలన్న నిబంధన ఉండేది. ఎవరెవరి హయాంలో శ్రీవారి ఆలయంలో ఎలాంటి నిబంధనలు ఉండేవో, ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకుందాం.

18వ శతాబ్దంలో శ్రీవారి ఆలయం ఆర్కాట్‌ నవాబులు అధీనంలో ఉండేది. తిరుమల ఆలయం నుంచి నిధులు వసూలు చేసుకోవడానికి ఆర్కాట్‌ నవాబులు రెంటర్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం కింద అందరికంటే ఎక్కువ ఆదాయం ఇచ్చేవారికి ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించేవారు. అలా ఆలయ నిర్వహణ బాధ్యతలను పొందిన వారినే రెంటర్‌ అని పిలిచేవారు. రెంటర్‌గా బాధ్యతలు చేపట్టినవారు ఆలయం నుంచి ఎంత ఆదాయమైనా యథేచ్ఛగా సంపాదించు కోవచ్చు,

అయితే, నవాబులకు ఏటా నిర్ణీత మొత్తం చెల్లించాల్పిందే! ఈ పద్ధతి వల్ల రెంటర్‌లు ఆదాయాన్ని పెంచుకోవడానికి అన్ని మార్గాల్లోనూ ప్రయత్నించేవారు. దేశదేశాలకు బైరాగులను పంపి ఆలయం తరఫున నిధులు వసూలు చేసేవారు. ఇతర ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చే భక్తుల నుంచి భారీగా పన్నులు వసూలు చేసేవారు. అప్పట్లోనే శ్రీవారి ఆలయ దర్శనం కోసం కాశీ, గయ, కశ్మీర్, ఉజ్జయిని, అయోధ్య, మధురై, రామేశ్వరం, తిరువనంతపురం, మద్రాసు, ఉడిపి, గోకర్ణం, బళ్లారి వంటి దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చేవారు. వారందరికీ రెంటర్ల ‘పన్ను’పోటు తప్పేది కాదు. రెంటర్లు మరిన్ని మార్గాల్లోనూ భక్తుల నుంచి సొమ్ము గుంజేవారు.

ఆర్జిత సేవలకు రుసుము పెంచడం, కొండ ఎక్కే ప్రతి భక్తుని నుంచి యాత్రిక పన్ను పేరిట ఐదు కాసులు వసూలు చేయడం, పుష్కరిణిలో స్నానం చేసేవారి నుంచి రుసుము వసూలు చేయడం, కపిల తీర్థంలో పితృకర్మలు, తర్పణాలు నిర్వహించడానికి పురోహితులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించడం, తలనీలాలు ఇచ్చే ప్రక్రియనూ కాంట్రాక్ట్‌ పద్ధతిలో నిర్వహించడం, ఎక్కువ కానుకలు చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించడం.

వర్తన పేరిట స్వామివారి అలంకరణకు ఉపయోగించే ఆభరణాలు, వాహనాలు, గుర్రాలు వంటి వాటి విలువను నగదు రూపంలో వసూలు చేయడం, నైవేద్యాలు చేయించడానికి ప్రత్యేక రుసుము వసూలు చేయడం, ఆమంత్రణ ఉత్సవాలు, ప్రత్యేక వాహన సేవలకు రుసుము వసూలు చేయడం, నైవేద్యాలను భక్తులకు విక్రయించడం, స్వామివారికి అలంకరించిన వస్త్రాలను విక్రయించడం, ఆలయ ప్రాంగణంలోని దుకాణాలు పెట్టుకునే దుకాణదారుల నుంచి డబ్బు వసూలు చేయడం– ఇలా ఎన్నిరకాలుగా వీలైతే అన్నిరకాలుగానూ రెంటర్‌లు ఆలయ నిర్వహణను సొమ్ము చేసుకునేవారు. తర్వాత ఆలయ ఆజమాయిషీ చేపట్టిన ఈస్టిండియా కంపెనీ, 1820లో ఈ పద్ధతి సబబు కాదంటూ, దీనికి స్వస్తి చెప్పింది.
  

మరిన్ని వార్తలు