నిద్రలేమి సమస్య.. కోవిడ్‌తో పాటు అది కూడా కారణమే!

4 Apr, 2022 15:37 IST|Sakshi

మన దేశ నగర జనాభాలో సగం మంది సరైన నిద్రపోవడం లేదు. నిద్రలేమి తెచ్చే ఆరోగ్య సమస్యలపై నగర వాసుల్లో అవగాహన ఉన్నా... అప్రమత్తత మాత్రం కొరవడింది.  రెస్‌మెడ్‌ సంస్థ తాజా సర్వే కోసం మన నగరంతో పాటు అనేక ప్రాంతాల్లో వేలాది మందిని ప్రశ్నించిన ఈ సర్వేలో ఇలాంటి పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కరోనా నేపధ్యంలో గత రెండేళ్లలో నిద్రలేమి స్థాయిలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. మన దేశంలో నిద్ర నాణ్యత లేమి అనుభవిస్తున్న వ్యక్తులలో 57% పెరుగుదల నమోదైంది. ఈ పరిస్థితికి మహమ్మారితో పాటు వచ్చిపడిన వృత్తిపరమైన ఆందోళన ప్రధాన కారణం.

మన నిద్ర వీక్‌...మాన‘సిక్‌’...
    సర్వేలో పాల్గొన్న వారిలో 81 శాతం మంది నిద్రిందచే శైలి తమ జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుందని అంగీకరించారు.. అలాగే 72 శాతం మంది సరిగా నిద్ర వేళలు పాటించకపోవడమే తమ పేలవమైన మానసిక పరిస్థితికి కారణమని చెప్పారు. నిద్రకు ఉపక్రమించిన తర్వాత నిద్రపోవడానికి సగటున సుమారు 90 నిమిషాలు తీసుకుంటున్నామన్నారు. పడుకునే ముందు ఒత్తిడి, నిద్రపోయే ముందు స్క్రీన్‌ వీక్షించిన సమయం వంటి ఇతర కారణాల బట్టి ఈ వ్యవధి ఆధారపడి ఉంటోంది.  కేవలం 53 శాతం మంది మాత్రమే వారికి సహాయపడే పరికరాలను ఉపయోగించి వారి నిద్ర సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించారు. విశేషం ఏమిటంటే...  గురకను మంచి రాత్రి నిద్రకు చిహ్నంగా భావించారు.

నిద్రలేమి సమస్యలపై అవగాహన లేమి...
సర్వేలో పాల్గొన్న వారిలో 59 శాతం మంది గురకను మంచి నిద్రకు చిహ్నంగా భావించడం అంటే.. నిద్రలేమి సమస్యలపై అవగాహనకు అది అద్దం పడుతుంది.  నిద్రలేమి నుంచి పుట్టే ప్రధాన సమస్య  స్లీప్‌ అప్నియా. గొంతు కండరాలు సడలించడం, ఊపిరి పీల్చుకున్నప్పుడు వాయుమార్గం ఇరుకైన లేదా మూసుకుపోయే స్థితిని అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా అంటారు. దీని సాధారణ లక్షణాలు బిగ్గరగా గురక, నిద్రలో గాలి పీల్చడం, ఉదయం తలనొప్పి, ఇది  సాధారణ శ్వాసను తాత్కాలికంగా నిరోధిస్తుంది.  నిస్సారమైన శ్వాస, బిగ్గరగా గురకను పుట్టిస్తుంది. అంతేకాక ఆకస్మిక పగటి నిద్రపోవడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఈ నిద్ర లేమితో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల టైప్‌2 డయాబెటిస్‌కు దారి తీస్తుంది... అయితే ఈ అన్ని సమస్యలపైనా నగరవాసుల్లో అవగాహన కొరవడిందని సర్వే తేల్చింది. ఈ నేపధ్యంలో నిద్రలేమి తద్వారా తలెత్తే సమస్యలపై అవగాహన పెంచుకోవడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.

చదవండి: పిల్లలు ఫోన్‌కు అడిక్ట్‌ అయ్యారా? టైమ్‌ లేదని తప్పించుకోకుండా ఇలా చేయండి!

మరిన్ని వార్తలు