టీనేజ్‌లో కాకుండా... యుక్తవయసు దాటాకా మొటిమలు వస్తున్నాయా? అయితే

29 May, 2022 10:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కొత్తగా యుక్తవయసులోకి ప్రవేశించేటప్పుడు యువతీయువకుల్లో మొటిమలు రావడం చాలా సహజం. కానీ కొద్దిమంది మహిళల్లో ఇవి 25 నుంచి 35 ఏళ్ల వయసులోనూ కనిపిస్తుంటాయి. టీనేజీలోకి వచ్చే యువతుల్లో అప్పుడే స్రవిస్తున్న కొత్త హార్మోన్లు మొటిమలకు కారణం కాగా... యుక్తవయసు దాటినవారిలో కొంతమేర హార్మోన్‌ల ప్రభావంతోపాటు ప్రీ–మెనుస్ట్రువల్‌ సిండ్రోమ్‌ సమస్యల కారణంగా కూడా మొటిమలు రావచ్చు.

అంతేగాక... లుక్స్‌ గురించి టీనేజీలో పట్టించుకున్నట్లుగా కాకుండా... కొంత స్వేచ్ఛ తీసుకుని ఎక్కువగా ఆయిల్‌ ఫుడ్స్, ఫ్యాట్‌ ఫుడ్స్‌ వంటివి తినే ఆహారపు అలవాట్లు కూడా ఈ సమస్యకు ఒక కారణం కావచ్చు. మొటిమల వల్ల పెద్దవయసులో ఏర్పడే మచ్చలు టీనేజీ సమయంలో కంటే కాస్త ఎక్కువకాలం ముఖంపై ఉండిపోవచ్చు. అది కొద్దివారాలు మొదలుకొని... కొన్ని నెలల వరకూ ఉండిపోవచ్చు.

వీటి బాధ నుంచి విముక్తం కావడం కోసం తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. చాలా తక్కువ తీవ్రతతో (మైల్డ్‌గా) ఉన్న మొటిమలకు పైపూతగా వాడే మందులు, శాల్సిలిక్‌ యాసిడ్, గ్లైకోలిక్‌ యాసిడ్‌ వంటి క్లెన్సర్స్‌ వాడాల్సి ఉంటుంది. మొటిమలు ఇంకాస్త తీవ్రంగా వస్తున్నవారు రెటినాయిడ్స్‌ వంటి పూత మందులు వాడాలి. స్వేద రంధ్రాలు పూడుకుపోయి మొటిమలు వస్తునప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి.

మరింత  తీవ్రమైన మొటిమలకు రెటినాయిడ్స్‌తో పాటు కొన్నిసార్లు యాంటీబయాటిక్స్‌ వాడాల్సి ఉంటుంది. ఈ మందులతో ప్రయోజనం లేనప్పుడు నోటిద్వారా తీసుకునే ఓరల్‌ మెడిసిన్స్‌ డాక్టర్‌ సలహా మేరకు వాడాల్సిన అవసరం పడవచ్చు.

మొటిమలతో పాటు హార్మోన్‌ అసమతౌల్యతలు ఉన్నప్పుడు కొన్ని హార్మోన్‌ సంబంధిత మందులు వాడాల్సి వస్తుంది. ఈ చికిత్సల తర్వాత మొటిమల తాలూకు మచ్చలు, గాట్లు పోవడానికి కెమికల్‌ పీల్స్, డర్మారోలర్, లేజర్‌ చికిత్సలు, మైక్రో నీడిలింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్‌ఎఫ్‌) వంటి చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉంటాయి.  

చదవండి: Vitamin A Deficiency: విటమిన్‌ ‘ఏ’ లోపిస్తే అంతే సంగతులు.. ఇవి తిన్నారంటే!

మరిన్ని వార్తలు