Anti Aging Foods: ప్రతిరోజూ బొప్పాయి పండు, దానిమ్మ తింటున్నారా? అయితే..

9 Jan, 2023 09:55 IST|Sakshi

వయసు పెరిగే కొద్ది రకరకాల మార్పులు రావడం సహజం. ముఖ్యంగా ముఖంపై ముడతలు, ముఖం మెరుపు కోల్పోయి కళావిహీనం కావటం, కళ్లకింద ఉబ్బెత్తుగా ఉండటం, మంగు మచ్చలు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.

వీటినుంచి ఉపశమనానికి చాలా మంది మార్కెట్‌లో లభించే అనేకమైన కాస్మెటిక్‌ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు.  అయితే వీటి వినియోగం వల్ల పరిష్కారం లభించకపోగా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వీటికి బదులుగా కొన్ని రకాల ఆహారాన్ని తీసుకుంటూ సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌లను వాడటం వల్ల శరీరం యవ్వనంగా తయారవుతుంది. అంతేకాకుండా చాలా రకాల చర్మసమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాం...

బొప్పాయి 
దీనిలో చర్మానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి బొప్పాయి పండ్లను ప్రతి రోజూ తినడం మంచిది. బొప్పాయిలో యాంటీ ఏజింగ్‌ గుణాలు అధిక పరిమాణంలో ఉంటాయి కాబట్టి దీనిని తినడం వల్ల శరీరానికి అధిక పరిమాణం లో యాంటీ ఆక్సిడెంట్లు లభించి చర్మం ఆరోగ్యంగా మిలమిలలాడుతుంది.

అంతేకాదు, అనేకరకాల చర్మ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. బొప్పాయి గుజ్జును ఫేస్‌ప్యాక్‌లా వాడటం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. 

ఆకు కూరలు
ఆకు కూరల్లో క్లోరోఫిల్‌ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. చర్మం ఆరోగ్యంగా, కళ్లు మెరుపులీనుతూ ఉండాలంటే ఆకుకూరలను ఆహారంలో తీసుకోవడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి.

ఆకుకూరల వాడకం వల్ల ఏ లోపం లేకుండా శరీరానికి సమృద్ధిగా విటమిన్లు అందుతాయి. అంతేగాక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడేవారికి మంచి ఫలితాలు లభిస్తాయి.

పాలు, బాదం
పాలలో ఉండే పోషకాల గురించి చిన్నప్పటినుంచి వింటున్నదే కాబటిట ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇక బాదం పప్పును ఏ విధంగా తీసుకున్నా అందులో చర్మాన్ని యవ్వనంగా ఉంచే లక్షణాలున్నాయి కాబట్టి రోజూ గుప్పెడు బాదం పప్పు తీసుకోవడం చాలా మంచిది. 

దానిమ్మ
దానిమ్మను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని ఆపడానికి సహాయపడుతుంది. చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలంటే రోజూ ఆహారంలో దానిమ్మను వినియోగించాలి.

దానిమ్మ రసాన్ని తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. షుగర్‌ ఉన్న వారు కూడా దానిమ్మను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. 

పెరుగు
శరీరానికి కావాల్సిన ప్రోబయోటిక్స్‌ అధిక పరిమాణంలో లభించాలంటే ఆహారంలో పెరుగు తప్పనిసరిగా ఉండాల్సిందే. పెరుగును ఫేస్‌ ప్యాక్‌గా కూడా వాడచ్చు. ప్రతి రోజూ పెరుగును ఆహారంలో తీసుకుంటే ముడతలు తొలగిపోవడంతోపాటు చర్మంపై రంధ్రాలు, మచ్చలు లేకుండా ముఖచర్మం మృదువుగా తయారవుతుంది. పిల్లలకు చిన్నప్పటినుంచి పెరుగు తినే అలవాటు చేయడం మంచిది. 

పైన చెప్పుకున్న వాటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మందులు, సౌందర్య సాధనాలతో పనిలేకుండా యవ్వనంగా ఉండచ్చని నిపుణుల మాట. 

చదవండి: Carrot Juice: క్యారట్‌ జ్యూస్‌ తాగే అలవాటుందా?... ఈ విషయాలు తెలిస్తే..

మరిన్ని వార్తలు