Prawns: రొయ్యలు తింటే గుండెకు ప్రమాదమా?.. ఇందులో నిజమెంత?

15 Jan, 2023 11:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: రొయ్యల్లో కొవ్వుశాతం ఎక్కువగా ఉంటుందని, తింటే పక్షవాతం వస్తుందని, గుండె జబ్బులొస్తాయని వింటుంటాం. కానీ ఇవేమి నిజం కాదని.. ఇతర మాంసాహారాలతో పోల్చుకుంటే రొయ్యల్లో ఉండే పోషకాలు చాలా ఎక్కువని, తింటే ఆరోగ్యానికి ఎంతోమేలని వైద్యనిపుణులు చెబుతున్నారు. రొయ్యల వినియోగాన్ని పెంచేందుకు కాకినాడ తరహాలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రాన్స్‌ ఫెస్టివల్స్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

దేశీయ సగటు వినియోగం 800 గ్రాములే 
రొయ్యల వినియోగంలో ప్రపంచంలో చైనా నంబర్‌ వన్‌ అని చెప్పాలి. ఇక్కడ సగటున ప్రతి ఒక్కరు 10–12 కిలోల రొయ్యలు తింటారు. అమెరికాలో సగటున 8–10 కిలోలు తింటారు. యూరోపియన్‌ దేశాల్లో సగటున ఎనిమిది కిలోలకు తక్కువ కాకుండా తింటుంటారు. రొయ్యల ఉత్పత్తిలో రారాజుగా ఉన్న మనదేశంలో మాత్రం రొయ్యల వినియోగం తక్కువే. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే సగటున 1.5 కి­లో­లు తింటున్నారు.

దేశవ్యాప్తంగా సగటున రొయ్య­ల వినియోగం 800 గ్రాములకు మించడంలేదు. తలసరి వినియోగం పెంచడమే లక్ష్యంగా రొయ్యరైతు సంఘాలు, హేచరీలు, ప్రాసెసింగ్‌ కంపెనీలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేస్తోంది. దేశంలోనే తొలిసారి ప్రాన్స్‌ ఫెస్టివల్స్‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కాకినాడలో విజయవంతం కావడంతో ఇతర నగరాలపై దృష్టి సారించింది.

రొయ్యలతో దీర్ఘకాలిక జబ్బులకు కళ్లెం 
రొయ్యల్లో అధిక నాణ్యత కలిగిన ప్రొటీన్‌ పుష్కలంగా ఉండటం వల్ల మానవులకు అవసరమైన అన్ని అమైనోయాసిడ్స్‌తో సమతుల్యంగా  ఉంటుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. మనిషికి బరువును బట్టి కిలోకి 0.8 గ్రాముల ప్రొటీన్‌ అవసరం. క్రీడాకారులకైతే కిలోకి 1.4 గ్రాముల ప్రొటీన్‌ కావాలి. రోజూ వందగ్రాముల రొయ్యలు తింటే శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ లభిస్తుంది. రొయ్యల్లోని పిండి పదార్థాలు, కొవ్వుల ద్వారా వచ్చే కేలరీలు తక్కువ. ఇవి బరువు పెరగకుండా ఉండటానికి దోహదపడతాయి.
చదవండి: అమ్మ కడుపు చల్లగా..  ఏపీలో  రెండేళ్లుగా తగ్గిన మాతా, శిశు మరణాలు

ఇతర మాంసాల కంటే టోటల్‌ ఫ్యాట్, సాచురేటెడ్‌ ఫ్యాట్‌తో పాటు గ్లైసమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. ఈ కారణంగా గుండె జబ్బులు, టైప్‌–2 మధుమేహంతోపాటు రక్తపోటును నియంత్రిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారంలో కనీసం 0.54 కంటే ఎక్కువ నిష్పత్తిలో ఉండే పుఫా (పాలీ అన్‌సాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌«), ఎస్‌ఎఫ్‌ఏ (సాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌) ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాల సమృద్ధిని సూచిస్తుంది. ఇవి రొయ్యల్లో 1.5 నిష్పత్తిలో ఉండడం వలన రక్తంలో కొలె్రస్టాల్‌ ఆరోగ్యకరమైన రీతిలో ఉంటుంది.

పిల్లల్లో జ్ఞాపకశక్తి వృద్ధి  
రొయ్యల్లోని లైఫోఫిలిక్‌ కేరోటీనోయిడ్స్‌ (ఎల్‌ఎఫ్‌సీ) అనే యాం­టి ఆక్సిడెంట్‌ మిగిలిన వాటికంటే 10 నుంచి 100 రెట్లు శక్తిమంతంగా ఉంటాయి. ఇది కణాల వాపును తగ్గిస్తుంది. చ­ర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచడం ద్వారా వృద్ధాప్యఛాయలను తగ్గిస్తుంది. ధమనులను బలోపేతం చేస్తుం­ది. రొయ్యల్లోని డీహెచ్‌ఏ (డెకోసా హెక్సానోక్‌ యాసిడ్‌) మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఆస్తాక్సన్‌తిన్‌ యాసిడ్స్‌ వల్ల వృద్ధుల్లో అల్జీమర్స్‌ వ్యాధిని తగ్గించడంతోపాటు పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది.

రొయ్యల్లోని మినరల్స్‌ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, అయోడిన్, జింక్, కాపర్, ఐరన్, సెలీనియం, విటమిన్లు ఏ, బీ, డీ, ఈ.. ఎముకల బలాన్ని, రోగనిరోధకశక్తిని పెంచడమేగాక థైరాయిడ్‌ గ్రంధుల పనితీరును మెరుగుపరుస్తాయి. అంతర్గత అవయవాలవాపు తగ్గించడం, నరాలు, మెదడు పనితీరు మెరు­గుపర్చడంతోపాటు క్యాన్సర్‌ వ్యాధిని తగ్గించడంలో తోడ్పడతాయి. ఇలా అన్ని విధాలుగా రొయ్యల్లో ఉండే పోషకాలు మానవాళికి ఉపయోగపడతాయి.

రొయ్యల్లో పోషక విలువలు అపారం 
మాంసాహారంలో రొయ్య అత్యంత విలువైన పోషకాహారం. వీటిలో ఉండే పోషక విలువలు వేటికి సాటిరావు. వాటి వినియోగంపై నెలకొన్న అపోహలు తొలగించేందుకు ప్రాన్స్‌ ఫెస్టివల్స్‌ ఎంతగానో దోహదపడతాయి. కాకినాడలో నిర్వహించినట్టుగా ప్రధాన నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తే సత్ఫలితాలనిస్తాయి. 
– డాక్టర్‌ రావు నారాయణరావు, ప్రముఖ దంత వైద్యనిపుణులు, కాకినాడ 

దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తినొచ్చు 
రొయ్యలు తినడం వలన మంచి పోషకాహారం లభిస్తుంది. షుగర్, బీపీ ఉన్నా సరే తగినంతగా తీసుకుంటే మంచిఫలితాలు వస్తాయి. దీనివల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. యాంటి ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉండడం వలన రోగనిరోధకశక్తి పెరుగుతుంది. స్కిన్, హెయిర్, నెయిల్స్‌ ఆరోగ్యంగా ఉంటాయి. ఇన్ని ఆక్సిడెంట్స్‌ ఉన్న ఆహారం ప్రకృతిలో చాలా అరుదు. ప్రాన్స్‌ తింటే దద్దుర్లు, ఎలర్జీ వస్తుందనేవారు వాటికి దూరంగా ఉండడం మంచిది. 
– డాక్టర్‌ వాడ్రేవు రవి, అధ్యక్షుడు, రాంకోసా

ప్రాన్స్‌ ఫెస్టివల్స్‌తో అపోహలు దూరం  
కాకినాడలో ప్రాన్స్‌ ఫెస్టివల్‌ విజయవంతమైంది. థాయ్‌లాండ్, మలేషియా వంటి దేశాల నుంచి చెఫ్‌లను తీసుకొచ్చి 27 రకాల రొయ్య వంటకాలను రుచిచూపించాం. రొయ్యల వినియోగం పట్ల నెలకొన్న అపోహలను తొలగించేలా వైద్యులతో అర్ధమయ్యేలా వివరించగలిగాం. ఇదే తరహాలో జాతీయస్థాయిలో న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాలతోపాటు రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో నిర్వహించేందుకు యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేస్తున్నాం. 
– ఐ.పి.ఆర్‌.మోహనరాజు, జాతీయ రొయ్యరైతుల సంఘం అధ్యక్షుడు 

మరిన్ని వార్తలు