టీ గారూ.. తమరు సూపరు!

19 Dec, 2021 10:06 IST|Sakshi

చలి వేయి కత్తులతో వస్తుంది. ఒక్క కప్పు టీ అడ్డు నిలుస్తుంది. చలి మంచు వల విసురుతుంది. తేయాకు గుడగుడ ఉడికి దానిని తెంపుతుంది. చలి పళ్లు టకటకలాడించాలని చూస్తుంది. టీ గ్లాసులు టింగుటంగుమని మోగి న్యూట్రల్‌ గేర్‌ వేస్తాయి. జనులు చలికాలంలో అవస్థ పడతారని ప్రకృతి టీ కాచింది. టీ అంటే ఉత్త తేయాకు, పాలు, చక్కెర కాదు. దానితో కలగలిసిన మనుషులు కూడా. ‘టీ పోసిన మనుషులను’ తలుచుకునే కాలం ఇది. 

కిరోసిన్‌ స్టవ్‌ నీలిమంట చాలా అందంగా ఉంటుందా మలి చీకటిలో. ‘బజ్జ్‌’మని దాని సౌండ్‌. మీద పాల దబర. పూర్తిగా మూసి ఉన్న మూతను కొంచెం నెడితే మెలి తిరుగుతూ పైకి లేస్తున్న పొగలు కనిపిస్తాయి ఆ చలి చీకటిలో. జంటగా ఉన్న స్టౌ మీద సత్తు జగ్గులో తేయాకు నీళ్లు కుతకుతలాడుతుంటాయి చలి మీద కాలు దువ్వుతూ. తెల్లవారుజాము ఐదు గంటలంటే చలి తన ఆఖరు దళాన్ని ఆయుధాలతో మొహరించి ఉంటుంది. ఆరున్నర ఏడు దాకా ఆ దళాల కవాతు సాగుతుంది.

మఫ్లర్లు? వాటికి లోకువ. ఉన్ని టోపీలను? లెక్క చేయవు. స్వెటర్‌లను అగోచరంగా చీల్చి పారేస్తాయి. అర చేతులను నిస్సహాయంగా రుద్దుకోక తప్పదు. అప్పుడొక హీరో కావాలి. ‘రక్షించండి’ అని పొలికేక వేయకముందే నిలువు గీతల గాజు గ్లాసులో పొగలు గక్కుతూ ప్రత్యక్షం కావాలి. ఎస్‌. స్ట్రాంగ్‌ టీ. చలి విలన్‌ భరతం పట్టే హీరో. ముఖానికి దగ్గరగా పెట్టుకుంటే వెచ్చదనం. గొంతులోకి దిగితే ఇంధనం. చలికాలంలో సంజీవని. జేగురు రంగు దివ్య రక్షణ. టీ. చలిపులి పై చర్నాకోల. ఈ టీ గారు లేకుంటే ఈ కాలం ఎలా గడవను?
ఐకమత్యం టీ
టీలు రెండు రకాలు. ‘విడి టీలు’. ‘ఐకమత్యం టీలు’. విడి టీ అంటే టీపొడి విడిగా, పాలు విడిగా, చక్కెర విడిగా... ఇలా విడివిడిగా ఉంటూ ఆఖరు నిమిషంలో కలుస్తాయి. ఐకమత్యం టీ అంటే హంస ముక్కు ఉన్న సత్తు కెటిల్‌లో టీ పొడి, పాలు, చక్కెర కలగలిసి ఒకేసారి ఉడుకుతాయి. విడి టీలో చాయిస్‌ ఉంటుంది. లైట్, స్ట్రాంగ్, మీడియం... కాని హంసముక్కు ఐకమత్యం టీలో లోపల ఏది తయారైతే అది. ఎలా తయారైతే అది. కెటిల్‌ హ్యాండిల్‌కు దళసరిగా కట్టిన గుడ్డ టీ మాస్టర్‌ పట్టగా పట్టగా నలుపెక్కి చేయి కాలనంతగా రాటు దేలి ఉంటుంది. లోపల టీ బాగా ఉడికిన మరు నిమిషం మాస్టర్‌ వరుసగా గ్లాసులు పేర్చి హ్యాండిల్‌ పట్టుకుని హంస ముక్కును వొంచుతాడు. దుముకుతూ టీ. ధారగా టీ. రుచి రంగులో టీ. అందరికీ ఒకేలాంటి టీ. అందరికీ ఒకే లాంటి శుభోదయమూ.
టీ కోసమే నిదుర లేవాలి
చలికాలంలో నిదుర లేవాలంటే తాయిలం ఏమిటి? టీయే. చలికాలంలో పనులు మొదలవ్వాలంటే ఒంటికి ఏం పడాలి? టీయే. ఇంట్లో పిల్లలు నిదుర పోతుంటారు. పెద్దవారు ముసుగుతన్ని ఉంటారు. ఇంటామె, ఇంటాయన మార్నింగ్‌ వాక్‌కు బయలుదేరే ముందు ఆ వెలుతురు రాని చీకటిలో కిచెన్‌లో లైటు వేసి చిన్న చిన్న కబుర్లు చెప్పుకుంటూ టీ కాచుకుంటూ ఫిల్టర్‌తో కప్పుల్లో ఒంచుకుంటూ ఒకరికి ఒకరు ఇచ్చుకుంటూ ఉంటే... తక్కిన కాలాల్లో ఏమో కాని చలికాలంలో ఆ దృశ్యం సుందరంగా ఉంటుంది. స్త్రీకి పురుషుడు... పురుషుడికి స్త్రీ తోడుగా ఉండాల్సింది ఇందుకే అనిపిస్తుంది. మీ చేతుల్లో టీ కప్పులు పట్టుకోండి... మీరు సంపూర్ణం అవుతారు అంటుంది టీ.
అల్లం బంధువు... యాలకులు స్నేహితులు
పాలకూ టీ పొడికి జోడి కుదిరింది. బంధువులు లేకపోతే ఎట్లా? నన్ను రెండు చిన్ని తుంటలు చేసి మీతో కలుపుకోండి.. బాగుంటాను అని అల్లం వచ్చిందట. నా నెత్తిన నాలుగు మొత్తి మీ తోడు చేసుకోండి ఆహ్లాదం పెంచుతాను అని యాలకులు అన్నాయట. అదిగో ఆనాటి నుంచి అల్లం బంధువు.. యాలకులు స్నేహితులు అయ్యాయి. చలికాలంలో మామూలు టీ. గొప్ప. అల్లం టీ. ఓకే. యాలకుల టీ. సరే. కాని ఈ కాలంలో తెల్లవారు జామున లెమన్‌ టీ తాగాలనుకునేవారికి టీ శాస్త్రంలో మన్నన లేదు. లెమన్‌ టీ మరే కాలంలో అయినా సరే. చలికాలంలో మాత్రం కాదు. అరె.. పాల ప్యాకెట్‌ కట్‌ చేసి గిన్నెలో పోసే సన్నివేశం ఆ ఒణికే చలిలో ఎంత బాగుంటుంది.
టీ మనుషులు
టీతో పాటు మనుషులు గుర్తుంటాయి. సందర్భాలు కూడా. చలిలో కారు ప్రయాణం. తెల్లవారుజామున రోడ్డెక్కితే ఎక్కడో ఒకచోట వేడి వేడి టీ దుకాణం. ‘సార్‌ టీ’ అంటూ అద్భుతంగా టీ చేసి ఇచ్చిన ఆ మనిషి గుర్తుంటాడు. వీధి చివర రోజూ టీ అమ్మే మాస్టర్‌. మనం ఇంత దూరం ఉండగానే చక్కెర తక్కువ అడగకనే అలవాటును గుర్తు పెట్టుకుని రెడీ చేస్తాడు. గుర్తుంటాడు. బంధువులు ఎందరో ఉంటారు. కాని ఒక్కరే టీ భలే పెడతారు. గుర్తుంటారు. కేరళ టూరుకు వెళ్లి తేయాకు కానుకగా తెస్తారు ఒకరు. గుర్తుంటారు. అస్సాం టీ పౌడర్‌ వాడుతున్నాం అంటారు. గుర్తుంటారు.

లంసా టీ రుచే వేరే. అది ఇచ్చిన ఇల్లు గుర్తుంటుంంది. పాలు విరిగాయి. అయినా మేనేజ్‌ చేశా అని ఒక అక్క అంటుంది. గుర్తుంటుంది. చక్కెర లేదు బెల్లం ముక్క వేశా అని పిన్ని అంటుంది. గుర్తుంటుంది. కొంచెం టీ పౌడర్‌ అంటూ తప్పక అప్పు చేసే ఇరుగామె ఉంటుంది. గుర్తుంటుంది. భుజాల మీద చేతులు వేసుకుని పంచెలు పైకి కట్టి నవ్వుకుంటూ వెళ్లి టీ తాగిన సందర్భాలు?... ఆ స్నేహితులందరికీ గుర్తుంటాయి. వేసవిలో మల్లెల్ని శ్లాఘించాలి. నిజమే. చలికాలంలో టీ కాకుండా ఎవరికి కిరీటం పెడతాం? చెప్పండి. 

మరిన్ని వార్తలు