నడవండి.. చిన్న వయసులో తొడలు 800 కిలోల కారును ఎత్తడానికి తగ్గ బలం కలిగి ఉంటాయి తెలుసా! 

13 Nov, 2021 10:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

Health Benefits Of Walking- Interesting Facts: వృద్ధాప్యంలో భాగంగా  మన జుట్టు బూడిదరంగులోకి మారడం, ముఖంపై ముడతలు పడటం, చర్మం పొడిగా మారడం వంటి సంకేతాలు సర్వసాధారణం. అయితే వాటి గురించి మనం భయపడకూడదు.

కానీ మనం కేవలం రెండు వారాల పాటు కాళ్ళను కదపకపోతే, కాళ్ళ బలం 10 సంవత్సరాలు తగ్గుతుంది. అది అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. అందుకే నడవడం అనే తేలికపాటి వ్యాయామాన్ని అలవాటు చేసుకుంటే వృద్ధాప్యాన్ని వాయిదా వేయవచ్చు. వృద్ధులయితే, వారి వృద్ధాప్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. 

రోజూ 30 నిమిషాలు లేదంటే..
నడక అనేది.. తీవ్రత మధ్యస్థంగా ఉండే వ్యాయామం కిందకు వస్తుంది. వారానికి కనీసం 150 నిమిషాలు చురుకైన నడక వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం పెద్దగా ప్రయాస పడవలసిన అవసరం లేదు. మొదట సాధారణ నడకతో ప్రారంభించి, క్రమంగా నడిచే సమయాన్ని, తీవ్రతను పెంచుకోవచ్చు.

ఒక వ్యక్తి వారానికి ఐదు రోజుల పాటు.. రోజూ 30 నిమిషాలు లేదా ఖాళీ సమయాల్లో 10 నిమిషాల చొప్పున నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చునని క్లినిక్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే సాధారణ వ్యక్తులు ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాల నడక ద్వారా మంచి వ్యాయామ ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

నిమిషానికి 80 అడుగుల నడకను సాధారణ వేగంగా.. నిమిషానికి వంద అడుగులను మధ్యస్థం నుంచి చురుకైన వేగంగా పరిగణించాలి. నిమిషానికి 120 అడుగులను ఎక్కువ వేగంగా గుర్తించవచ్చు. అయితే అసలు ఇలాంటి లెక్కలతో సంబంధం లేకుండా, చురుగ్గా నడవడంపై దృష్టి పెట్టడం మంచిది.

నడక .. పగటిపూట ఎక్కువగా కూర్చోవడం వల్ల కలిగే సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. స్నేహితులతో కలిసి వాకింగ్‌కు వెళ్లడం, లేదా పెంపుడు కుక్కలను పక్కన తీసుకెళ్లడం వల్ల ఎక్కువ దూరం నడవగలుగుతారు. 

డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌ విశ్వవిద్యాలయం వారు జరిపిన ఒక అధ్యయనంలో వృద్ధులు – యువకులు, రెండు వారాల పాటు నడవకుండా ఉండటం వల్ల వారి కాళ్ల కండరాలు బలహీనపడ్డట్లు తెలిసింది.

మన వయస్సు పెరుగుతున్నప్పుడు, వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నప్పుడు మన పాదాలు ఎల్లప్పుడూ చురుకుగా – బలంగా ఉండాలి.

మీకు తెలుసా?  
వృద్ధాప్యం పాదాల నుండి పైకి మొదలవుతుంది!
పాదాలు ఒక రకమైన స్తంభాలు. అవి మానవ శరీరం మొత్తం బరువును భరిస్తూ ఉంటాయి.
ఒక వ్యక్తి చిన్న వయస్సులో ఉన్నప్పుడు, అతని/ఆమె తొడలు 800 కిలోల చిన్న కారును ఎత్తడానికి తగినంత బలాన్ని కలిగి ఉంటాయి! 
పాదాలు శరీరాన్ని కలిపే అతి పెద్ద ప్రసరణ నెట్‌వర్క్‌. నడక వల్ల నెట్‌వర్క్‌ బాగా పని చేస్తుంది. కాబట్టి నడవండి.
ఒకవేళ మీ పాదాలు ఆరోగ్యంగానే ఉన్నాయనుకోండి... నడవడం వల్ల పాదాల నుంచి శరీరానికి రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది, 
కాళ్లను బలోపేతం చేయడం ద్వారా, వృద్ధాప్యాన్ని కొంత కాలం వాయిదా వేయవచ్చు. కాలి కండరాలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడానికి రోజూ కనీసం 30–40 నిమిషాలు నడిస్తే చాలు. 

చదవండి: Flax Seeds: కాయగూరలు, చేపలతోపాటు అవిసె గింజలు కలిపి తింటే..

మరిన్ని వార్తలు