Hypothyroidism During Pregnancy: రెండో నెల.. హైపో థైరాయిడ్‌! డైట్‌తో కంట్రోల్‌ చెయ్యొచ్చా?

21 Aug, 2022 17:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

డాక్టర్‌ సలహా

Hypothyroidism During 2nd month Pregnancy: నాకిప్పుడు రెండవ నెల. నాకు హైపో థైరాయిడ్‌ ఉందని డాక్టర్‌ చెప్పారు. దీనికి ట్రీట్‌మెంట్‌ స్టార్ట్‌ చెయ్యమన్నారు. దీన్ని డైట్‌తో కంట్రోల్‌ చెయ్యొచ్చా? మందులు తప్పనిసరిగా వేసుకోవాలా? – ఎన్‌. సీతాలక్ష్మి, గణపవరం

థైరాయిడ్‌ గ్రంథి కొన్ని హార్మోన్స్‌ను విడుదల చేస్తుంది. ఈ గ్రంథి రిలీజ్‌ చేయవలసిన దానికన్నా తక్కువ విడుదల చేస్తుంది అని గ్రహించగానే దానికి బ్రెయిన్‌ సిగ్నల్స్‌ ఇస్తుంది ఎక్కువ విడుదల చేయమని. అందుకే టీఎస్‌హెచ్‌ అనేది పెరుగుతుంది. ఈ గ్రంథి నుంచి వచ్చే థైరోక్సిన్‌ హార్మోన్‌ బాగా పనిచెయ్యాలంటే మీరు తినే ఆహారంలో అయోడిన్‌ ఎక్కువ ఉండే ఫుడ్‌ తీసుకోవాలి.

తొలి పన్నెండు వారాల ప్రెగ్నెన్సీలో..
టీఎస్‌హెచ్‌ ఎక్కువ అయితే హైపోథైరాయిడిజం అంటారు. బిడ్డకు తల్లి నుంచే థైరాయిడ్‌ హార్మోన్స్‌ వెళ్తాయి. మీకు హార్మోన్స్‌ తక్కువ ఉంటే అది బిడ్డ మీద కూడా ప్రభావం చూపుతుంది. తొలి పన్నెండు వారాల ప్రెగ్నెన్సీలో బిడ్డ థైరాయిడ్‌ గ్రంథి ఇంకా వృద్ధి చెందదు. ఈ థైరాయిడ్‌.. బిడ్డ మెదడు ఎదుగుదలకు చాలా అవసరం. అందుకే మీకు థైరాయిడ్‌ డెఫిషియెన్సీ ఉంటే వెంటనే మెడికేషన్‌ తీసుకోవాలి.

డాక్టర్‌ తొలి పన్నెండు వారాల్లో టీఎస్‌హెచ్‌ హార్మోన్‌ 2–5 కన్నా ఎక్కువ ఉంటే థైరాయిడ్‌ ట్రీట్‌మెంట్‌ను సూచిస్తారు. ప్రతి నెల లేదా మూడు నెలలకు ఒకసారి టీఎస్‌హెచ్‌ చెక్‌ చేస్తారు. థైరాయిడ్‌ యాంటీబాడీస్‌ బ్లడ్‌ టెస్ట్‌ కూడా చేస్తారు. మూడవ నెల తరువాత టీఎస్‌హెచ్‌ మూడు కన్నా తక్కువ ఉండాలి. ఆ విధంగా మందుల మోతాదును నిర్ణయిస్తారు.

కొన్నిసార్లు తల్లికి ఏ సింప్టమ్స్‌ ఉండవు కానీ టీఎస్‌హెచ్‌ ఎక్కువ అవుతుంది. దీనిని సబ్‌కెమికల్‌ థైరాయిడ్‌ అంటారు. వీళ్లకు యాంటీబాడీస్‌ ఫర్‌ థైరాయిడ్‌ చెక్‌ చేస్తారు. టీపీఓ యాంటీబాడీస్‌ నెగెటివ్‌ ఉంటే ట్రీట్‌మెంట్‌ అవసరం లేదు. క్రమం తప్పకుండా టీఎస్‌హెచ్‌ చెక్‌ చేసుకోవాలి. ప్రసవం అయిన ఆరువారాలకు  తల్లికి మళ్లీ టీఎస్‌హెచ్‌ చెక్‌ చేసి మందులు  కొనసాగించాలా.. వద్దా అనేది  చెప్తారు.
-  డా.  భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌.

చదవండి: Pregnancy- Iron Rich Foods: ఏడో నెల.. ఐరన్‌ మాత్రలు వేసుకుంటే వాంతులు! ఇవి తిన్నారంటే..
Pregnancy 1st Trimester: మూడో నెల.. ప్రెగ్నెన్సీలో ఇవి చేయాల్సిన అవసరం ఉంటుందా?
 

మరిన్ని వార్తలు