Breast Cancer Screening: అవివాహిత మహిళలు, పిల్లలు కలగని స్త్రీలు! ఇంకా వీరికి

28 Sep, 2022 17:11 IST|Sakshi

3డీ మామోగ్రామ్‌ (టోమోసింథసిస్‌) 

బ్రెస్ట్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షల్లో సందేహాలకు చెక్‌

Breast Cancer Screening- 3D Mammography: మనలో చాలామందికి హెల్త్‌ చెకప్స్‌ చేయించుకోవాలంటేనే భయం. ఎక్కడ ఆ రిపోర్ట్‌లలో తప్పుడు రిజల్ట్స్‌ వచ్చి అనవసర భయాలకు గురిచేస్తాయేమోనని ఓ ఆందోళన. అంతేకాకుండా ఏ రెండు లాబ్స్‌లోనూ ఒకేలాంటి రిపోర్ట్స్‌ రావనే అభిప్రాయం మరింత ఎక్కువ అనుమానాలకు తావిస్తుంటుంది. 

టెస్ట్‌ చేయించుకునేటప్పుడు మంచి ప్రమాణాలతో కూడిన అధునాతన ల్యాబ్‌ను ఎంపిక చేసుకోవడమే కాకుండా, వారు నిర్ధారణ చేసే పద్ధతులను కూడా తెలుసుకుంటే ఈ తేడాలు అంతగా ఉండకపోవచ్చు. ఇక మరీ ముఖ్యంగా క్యాన్సర్‌ను తొలిదశలోనే పసిగట్టే స్క్రీనింగ్‌ టెస్ట్‌లంటే మనలో చాలామందికి భయం, అనుమానం. 

నేటి స్త్రీని ఎక్కువగా బాధిస్తున్న రొమ్ముక్యాన్సర్‌ను ముందే పసిగట్టడానికి స్క్రీనింగ్‌ టెస్టుల్లో ఎన్నో ఆధునికతలు చోటుచేసుకున్నాయి. వీటిలో ఖచ్చితత్వం మరింతగా పెరిగింది. కాబట్టి స్త్రీలు అనవసర భయాందోళనకు గురికావాల్సిన అవసరం అస్సలు లేదు. 

రొమ్ముక్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షల్లో... సాంకేతిక విప్లవం... టోమోసింథసిస్‌ 3డి మామోగ్రఫీ రొమ్ముక్యాన్సర్‌ను తొలిదశలోనే పసిగడితే కణితి వరకు మాత్రమే తొలగించగలిగే లంపెక్టమీతో పూర్తిగా నయం చేయడం సాధ్యమే. రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవడంతో పాటు డాక్టర్‌ సలహా మేరకు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మంచిది. వాటిల్లో ఇప్పటివరకు ఉన్న 2డి డిజిటల్‌ మామోగ్రామ్‌ స్థానంలో ఇప్పుడు 3డి మామోగ్రామ్‌ అందుబాటులోకి రావడం స్త్రీలకు ఒక వరం అనేది నిస్సందేహం.

2డి మామోగ్రామ్‌ వర్సెస్‌ 3డి మామోగ్రామ్‌...
►3డి మామోగ్రామ్‌లో రొమ్ముక్యాన్సర్‌ నిర్ధారణ... 2డి మామోగ్రామ్‌తో పోలిస్తే 40% మరింత ఖచ్చితంగా జరుగుతుంది
►క్యాన్సర్‌ కాని కణుతులను క్యాన్సర్‌గా చూపించడం, క్యాన్సర్‌ కణుతులను పసిగట్టలేకపోవడం 3డి మామోగ్రామ్‌లో జరగవు
►2డి మామోగ్రామ్‌తో పోలిస్తే ఫాల్స్‌ నెగెటివ్, పాజిటివ్‌లకు అవకాశం తక్కువ
►2డి మామోగ్రామ్‌ రొమ్ము పై నుంచి / పక్క నుంచి పరీక్షిస్తే... 3డి మామోగ్రామ్‌లో రొమ్మును పుస్తకంలోని పేజీల మాదిరిగా ఒక మిల్లీమీటరు స్లైస్‌గా విభజించి, పరిశీలించి ఇమేజ్‌లు పంపుతుంది

►2డి లో మామూలు కణితి వెనక ఉండే క్యాన్సర్‌ కణితిని పసిగట్టలేకపోవచ్చు. కానీ 3డి మామోగ్రామ్‌లో అలాంటి పొరపాట్లకు తావు లేదు
►రొమ్ము కణజాలం గట్టిగా (డెన్స్‌గా) ఉన్నవారికి, చిన్నవయసు స్త్రీలకు 3డి మామోగ్రామ్‌తో నిర్ధారణ సాధ్యం.
►2డి లో 40 ఏళ్లు పైబడిన స్త్రీలను మాత్రమే  పరీక్షించగలం

►3డి మామోగ్రామ్‌ ఏ వయసు స్త్రీలైనా చేయించుకోవచ్చు. రేడియేషన్‌ కూడా చాలా తక్కువ
►3డి మామోగ్రామ్‌ యూఎస్‌ఎఫ్‌డిఏ ఆమోదం పొందింది
►క్యాన్సర్‌ కణితిని మామూలు కణితిగా చూపించడం... దాంతో రొమ్ముక్యాన్సర్‌ లేటు దశకు చేరుకోవడం, మామూలు కణితిని క్యాన్సర్‌గా చూపించడం... దాంతో  బయాప్సీ చేయాల్సిరావడం, ఆందోళన–అనుమానం ఎక్కువకావడం లాంటి సందర్భాలు 3డి మామోగ్రామ్‌లో గణనీయంగా తగ్గుతాయి

►క్యాన్సర్‌ నిర్ధారణ ఖచ్చితంగా జరగడం వల్ల 2డి మామోగ్రామ్‌తో పోలిస్తే 3డి మామోగ్రామ్‌లో బయాప్సీ చేయాల్సిన సందర్భాలు గణనీయంగా తగ్గుతాయి
►స్క్రీనింగ్‌ టెస్ట్‌ సమయం 2డి మామోగ్రామ్‌ కంటే... 3డిలో కొంచెం ఎక్కువ
►రొమ్ముని నొక్కి (కంప్రెస్‌) పరీక్షించాల్సిన అవసరం లేదు కాబట్టి 2డి మామోగ్రామ్‌లోలా స్త్రీలకు అసౌకర్యం, నొప్పి వంటివి 3డి మామోగ్రామ్‌లో ఉండవు.

ఎవరికి అవసరం ఈ 3డి మామోగ్రామ్‌ (టోమోసింథసిస్‌) 
రొమ్ములో కణితి చేతికి తగలడం, చనుమొన, రొమ్ముసైజు, చర్మంలో మార్పులు, రొమ్ముమీద నయం కాని పుండు, చనుమొన నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపించేసరికి రొమ్ముక్యాన్సర్‌ లేటు దశకు చేరుతుందని అర్థం. ఎలాంటి లక్షణాలు కనిపించినా, కనిపించకపోయినా, రిస్క్‌ఫ్యాక్టర్స్‌ ఉన్నా, లేకపోయినా ప్రతి స్త్రీ 40 ఏళ్లు పైబడ్డాక పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.

అందునా...
►అవివాహిత మహిళలు, పిల్లలు కలగని స్త్రీలు
►దీర్ఘకాలం పాటు సంతానలేమికి మందులు వాడినవారు
►తల్లిపాలు ఇవ్వని స్త్రీలు
►పదేళ్లలోపు రజస్వల అయినవారు
►యాభైఐదేళ్ల తర్వాత కూడా నెలసర్లు వచ్చేవారు

►దీర్ఘకాలం పాటు హార్మోన్ల మీద ప్రభావం చూపే మందులు వాడినవారు
►గర్భాశయం, అండాశయాల క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకున్న స్త్రీలు
►స్మోకింగ్, ఆల్కహాల్‌ అలవాట్లు ఉన్నవారు
►సాధారణ మహిళలతో పోలిస్తే... దగ్గర బంధువులు, రక్తసంబంధీకుల్లో బ్రెస్ట్‌క్యాన్సర్‌ ఉన్న స్త్రీలలో ఈ క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఎక్కువ కాబట్టి డాక్టర్‌ సలహా మేరకు వీరు ముందుగానే స్క్రీనింగ్‌ టెస్ట్‌లు చేయించుకుంటే మంచిది.

తమకు ఎలాంటి లక్షణాలూ, ఇబ్బందీ లేవు కాబట్టి ఎక్కడో టెస్ట్‌లో తప్పుడు నిర్ధారణ జరిగి తమలో అనవసర ఆందోళన కలుగుతుందేమో అని భయపడి స్క్రీనింగ్‌ టెస్ట్‌లకు దూరంగా ఉండే మహిళలకు ఖచ్చితమైన రిపోర్టును ఇచ్చే 3డి మామోగ్రామ్‌ ఓ మంచి ప్రత్యామ్నాయం.
-డా. సీహెచ్‌. మోహన వంశీ, చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్‌. ఫోన్‌ నంబరు 98490 22121 

చదవండి: High Uric Acid Level: యూరిక్‌ యాసిడ్‌ మోతాదులు పెరిగితే అంతే సంగతులు! వీరికే ముప్పు ఎక్కువ! లక్షణాలివే! ఇలా చేస్తే..

మరిన్ని వార్తలు