Cinnamon Health Benefits: దాల్చిన చెక్క పొడి పాలల్లో వేసుకుని తాగుతున్నారా? సినామాల్డెహైడ్‌ అనే రసాయనం వల్ల

24 Nov, 2022 17:14 IST|Sakshi

Cinnamon- Health Benefits In Telugu: దాల్చినచెక్క.. భారతీయుల వంట గదిలో కనిపించే సుగంధ ద్రవ్యాల్లో ముందు వరుసలో ఉంటుంది. నిజానికి మసాలా వంటకాల్లో దాల్చిన చెక్క లేనిదే వాటికి రుచి, సువాసన రాదు. అయితే, కేవలం రుచికి మాత్రమే పరిమితం కాకుండా ఔషధపరంగానూ దాల్చిన చెక్క ఎంతో ఉపయోగకరం.

ముఖ్యంగా శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు.. ఇతరత్రా ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు దీని పొడిని పాలల్లో కలుపుకొని తాగితే మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ పాలను తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని న్యూట్రీషనిస్ట్‌ లోవనీత్‌ బాత్రా ఎన్డీటీవీతో పేర్కొన్నారు.

దాల్చిన చెక్క వల్ల కలిగే ఆరోగ్య లాభాలు
►మహిళల్లో రుతుస్రావ సమయంలో కలిగే నొప్పి తీవ్రత తగ్గుతుంది.
►ఇందులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలం. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.
►ఇందులోని యాంటీ- ఇన్‌ఫ్లామేటరీ గుణాలు మంట, వాపులను తగ్గించేందుకు దోహదపడతాయి.

►దాల్చిన చెక్క నోటి దుర్వాసనను నివారించడంలో తోడ్పడుతుంది.
►అదే విధంగా దగ్గు, పంటినొప్పులను తగ్గించడంలో దోహదపడుతుంది.
►గొంతు బొంగురు పోవడం, గొంతులో గురగురలు తదితర సమస్యలు ఉన్నవారు దాల్చిన చెక్క ముక్కను బుగ్గన పెట్టుకుని, ఆ ఊటను నమిగిలి మింగుతూ ఉంటే ఉపశమనం పొందవచ్చు.

►ఫుడ్‌పాయిజన్‌ అయిన సందర్భాల్లో దాల్చిన చెక్క రసాన్ని తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది.
►నిద్రలేమి సమస్యతో బాధపడే వారు.. అర టీ స్పూన్‌ దాల్చిన చెక్క పొడిని ఒక టీకప్పు నీటిలో వేసి, ఐదు నిమిషాలు మరిగించాలి. దీనిలో తేనె కలిపి తీసుకుంటే గాఢనిద్ర పడుతుంది.

సినామాల్డెహైడ్‌ అనే రసాయనం వల్ల
యూఎస్‌ నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ మెడిసిన్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాల్చిన చెక్క సువాసన, రంగుకు కారణమైన సినామాల్డెహైడ్‌ అనే రసాయనం హైపోగ్లైసెమిక్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని తగ్గించడంలో తోడ్పడుతుంది.

కాబట్టి షుగర్‌ పేషంట్లు దాల్చిన చెక్క పొడి కలిపిన పాలు తాగితే(చక్కెర లేకుండా) తాగితే ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇక సినామాల్డెహైడ్‌ యాంటీ ఫంగల్‌ ఏజెంట్‌గానూ  పనిచేస్తుంది. ఇన్‌ఫెక్షన్ల నివారణకు దోహదం చేస్తుంది. అదే విధంగా రక్తనాళాలు మూసుకుపోకుండా చేస్తుంది. 
నోట్‌: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే!

చదవండి: Health Tips: రక్తం పీల్చే జలగలతో వైద్యం! పైల్స్‌, షుగర్‌ పేషంట్లకు ఉపశమనం.. ఇంకా..
Health: తొడల మీద దద్దుర్లు.. ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలివే! కారణాలేంటి? రిస్క్‌ ఎవరికి ఎక్కువ?

మరిన్ని వార్తలు