Diabetes- Best Diet: షుగర్‌ అదుపులో ఉండాలంటే ఏం చేయాలి? ఉత్తమమైన ఆహారం ఇదే!.. దేశీ ఫలాలు తింటే

3 Nov, 2022 10:05 IST|Sakshi

How To Control Diabetes- Tips In Telugu: డయాబెటిస్.. చిన్నా పెద్దా వయసు తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య. దీన్నే మధుమేహం, షుగర్, చక్కెర వ్యాధి అని పిలుస్తారు. డాక్టర్లు సూచించిన మందులతో పాటు సరైన ఆహార పద్ధతులను పాటిస్తే షుగర్ నియంత్రించవచ్చు. రక్తంలోని చక్కర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు అధిక రక్త పీడనం వంటి సమస్యలను అదుపులో పెట్టుకోవచ్చు.

షుగర్ పేషెంట్లకు ఉత్తమమైన ఆహారం


చేపలు
చేపలు తింటే చాలా మంచిది. హెర్రింగ్, సార్డైన్, సాల్మన్, అల్బకోర్ ట్యూనా, మాకేరాల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని పెంచుతాయి.

పప్పు దినుసులు
డైట్‌లో పప్పు దినుసులు ఎక్కువగా ఉండేలా చూడాలి. పప్పు దినుసుల నుండి లభించే ప్రోటీనులు, మాంసాహారం నుండి లభించే ప్రోటీనుల కంటే మేలైనవి.పప్పు దినుసులు ప్రోటీన్, ఫైబర్ అధికంగా కలిగి ఉంటాయి. ఈ మూలకాలు రక్తంలోని చక్కర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటాయి.

అన్నం వద్దా?
గోధుమ, రాగి తప్ప వరి అన్నము తినరాదు అన్నది తప్పు అభిప్రాయం. వరి, గోధుమ, రాగి జొన్నలు, సజ్జలు మొదలైన ధాన్యాలలోనూ 70 శాతం పిండి పదార్థం ఉంటుంది. అందుకే ఏ ధాన్యం తినాలన్నది ముఖ్యం కాదు. ఎంత పరిమాణంలో తింటున్నామన్నదే ముఖ్యం. 

కూరగాయలు
అన్ని రకాల ఆకుకూరలు, వంకాయ, బెండకాయ, ఉల్లి పాయలు, అరటి పువ్వు, బ్రాసెల్స్ మొలకలు, క్యాబేజి, కాలిఫ్లవర్ ,పుదీన, బొప్పాయి, కరివే పాకు, బ్రకోలి, దోసకాయ, టర్కిప్, ముల్లంగి, బెంగుళూరు వంకాయ, అరటిపువ్వు, ములగకాయ, గోరు చిక్కుడు, కొత్తిమీర, పొట్లకాయ, టమాట , బ్రాడ్బీన్స్, తెల్ల గుమ్మడి, సొరకాయ వంటివి తీసుకోవాలి.

డ్రై ఫ్రూట్స్‌
ఎక్కువ పోషకాలను అందించే స్నాక్స్ తినాలంటే బాదం చాలా మంచిది. భోజన సమయంలో కాకుండా.. స్నాక్స్‌గా అప్పుడప్పుడు బాదం ప్రయత్నించండి.

ఆరోగ్యవంతమైన ఫైబర్‌ కోసం
శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి, రక్తంలోని చక్కర స్థాయిలను సాధారణ స్థితిలో ఉంచే ఆరోగ్యవంతమైన ఫైబర్‌ను ఓట్స్ అందిస్తాయి. ప్లెయిన్ ఓట్స్ లేదా స్టీల్ కట్ ఓట్స్ తక్కువ చక్కెరను ఉత్పత్తి చేస్తాయి, నెమ్మదిగా జీర్ణం అవుతాయి.

బెర్రీస్
తక్కువగా కార్బోహైడ్రేట్స్ ను కలిగి ఉండటం వలన మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా మంచివి.

మధుమేహం రెండురకాలుగా సంక్రమిస్తుంది..
1. వారసత్వంగా వచ్చే మధుమేహం
2. మన అలవాట్ల వల్ల వచ్చే మధుమేహం
వారసత్వంగా వచ్చే ఆస్తులు వద్దు అనుకుంటే రాకపోవచ్చును కానీ, వారసత్వంగా వచ్చే వ్యాధులు అనివార్యం. కాబట్టి మనం రాకుండా చూసుకోలేము, కానీ వచ్చిన తరువాత మన కంట్రోల్ లో ఉంచుకోవడము మాత్రమే మన చేతిలో ఉన్న విషయం.

మధుమేహం రాకుండా ఉండేందుకు ఇవి పాటించండి
1. వీలైనంత వరకూ మన శరీరానికి వ్యాయామం ఇవ్వాలి
2. మీరు చేసే వృత్తి కి తగ్గట్టుగా మీ ఆహార అలవాట్లు చేసుకోవాలి. సిస్టమ్ వర్క్ అయితే వాకింగ్, రన్నింగ్ రెగ్యులర్ గా చేయండి. ఫిజికల్ వర్క్ అయితే కొద్దిగా యోగా చేయండి
3. రాగి సంగటి , అంబలి లాంటి ఫైబర్ ఫుడ్ ని వారానికి రెండుసార్లు కచ్చితంగా ఆహారంగా తీసుకోవాలీ.

4. దేశీయ ఫలాలు ఎక్కువ తినడం మంచిది.
5. ముఖ్యంగా నేరేడు, ఉసిరికాయ లాంటివి మన చుట్టున్న వాతావరణంలో సీజన్లో మాత్రమే దొరుకుతాయి, వాటిని తినడం మంచిది.
6. తెల్ల చక్కెర బదులు, బెల్లం, నాటు చక్కెర ఉపయోగించండి.

7. గోధుమ, వరి అన్నం, ఇడ్లీ, చపాతీ తినడం తగ్గించి, మొలకెత్తిన విత్తనాలు తినండి
8. వర్క్ టెన్షన్ వదిలేసి 6 నెలలకు ఒకసారి అయినా ఫ్యామిలీ టూర్ వెళ్లి సంతోషంగా ఉండండి
9. చాలా ముఖ్యమైన విషయం అనవసరంగా టెన్షన్ అవడం, భయపడటం అదుపులో ఉంచేందుకు ప్రయత్నం చేయాలి.
10. ఎందుకంటే మానసిక ప్రశాంతత లేకపోతే బిపి, షుగర్లు సులభంగా అటాక్ చేస్తుంది. బిపి, షుగర్లు కవల పిల్లలు. ఏ ఒకటి వచ్చినా, ఇంకొకటి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.

వీటితో పాటు నీళ్లు ఎక్కుగా తాగాలి. నిజానికి మధుమేహం విషయంలో ఆహార వ్యాయామాల వంటివి ముఖ్యమేగానీ వాటికంటే కూడా.. గ్లూకోజు నియంత్రణకు వైద్యులు చెప్పినట్టుగా మందులు వేసుకోవటం, క్రమం తప్పకుండా పరీక్షలు చేసుకోవటం మరింత ముఖ్యం.
-డాక్టర్ నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు

చదవండి: ఊపిరితిత్తులు భద్రం.. పోస్ట్‌ కోవిడ్‌తో ఎన్నో సమస్యలు.. వ్యాధులను గుర్తించడం ఎలా?
Custard Apple: సీజనల్‌ ఫ్రూట్‌ సీతాఫలం.. తరచూ తింటున్నారా? ఇందులోని బయోయాక్టివ్‌ అణువుల వల్ల

మరిన్ని వార్తలు