Health Tips: పచ్చళ్లు అతిగా తింటే అనర్థమే! ముఖ్యంగా పురుషులకు..! పైల్స్‌ సహా..

1 Aug, 2022 09:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

What Happens If We Eat Pickles Everyday: వేడి వేడి అన్నంలో ఎర్రెర్రగా ఇంత ఆవకాయో, మాగాయో, ఇతర ఊరగాయ పచ్చళ్లో రోటిపచ్చళ్లో  వేసుకుని తింటే వచ్చే రుచే వేరు. అందుకే అందరూ పచ్చళ్లకోసం నాలుక తెంపుకుంటూ ఉంటారు.

అయితే రుచిగా ఉందని పచ్చడే పరమాన్నంలా రోజూ తింటూ ఉంటే ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులోనూ మహిళల కంటే మగవాళ్లకు ఈ ముప్పు మరికాస్త ఎక్కువ ఉంటుందంటున్నారు. ఇంతకూ ఆ ముప్పు ఎందుకో, ఏమిటో చూద్దాం... 

తక్కువగా తినండి!
నవకాయ పిండి వంటలు చేసి నిండుగా విస్తరిలో వడ్డించినా పచ్చడికోసం వెతుక్కోవడం తెలుగు వారి స్వభావం. అన్నంలోనే కాదు, వేడివేడి ఉప్మా, దోసె, వడ, ఇడ్లీ.. ఇలా ఒకటేమిటి ప్రతిదానినీ పచ్చడితో లాగిస్తుంటారు. పచ్చళ్లు అతిగా తింటే అనర్థాలూ ఎక్కువేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేమిటో తెలుసుకుందాం... పచ్చళ్లను తక్కువగా తీసుకునే ప్రయత్నం చేద్దాం.

బీపీ అమాంతం పెరిగితే!
పచ్చళ్లు ఎక్కువగా తినడం వల్ల అవి నిల్వ ఉండటం కోసం వేసే ఉప్పు వల్ల ముప్పు పొంచి ఉంటుంది. బీపి ఉన్న వారికి అమాంతం పెరిగిపోతే, ఇంతవరకూ ఆ సమస్యే లేని వారికి అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది.

ప్రిజర్వేటివ్స్‌ వల్ల
హైపర్‌ టెన్షన్‌ రోగులకు కూడా ప్రమాదకరమే. ముఖ్యంగా మార్కెట్‌లో కొనుగోలు చేసే పచ్చళ్లలో ప్రిజర్వేటివ్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అదేవిధంగా పచ్చళ్లు ఎక్కువగా తింటే కడుపులో పుళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

పొట్టలో, పేగుల్లో పొంచి ఉండే కొవ్వు.. గుండెజబ్బులు
మార్కెట్‌లో విక్రయించే పచ్చళ్లకు రుచి కోసం నూనె, మసాలా ఎక్కువగా వాడుతారు. ఇవి ఆరోగ్యానికి హాని చేకూరుస్తాయి. ఎక్కువ ఆయిల్‌ తీసుకోవడం వల్ల.. మసాలాల కారణంగా.. పైల్స్‌ వచ్చే ప్రమాదం ఉంది. వాటితోపాటు కొలెస్ట్రాల్‌ వంటి ఇతర అనారోగ్య సమస్యలూ తలెత్తుతాయి.

తద్వారా గుండెజబ్బులు కాచుకుని ఉంటాయి. అందువల్ల పచ్చడి అంటే ఎంత ఇష్టం ఉన్నా, పరిమితంగానే పుచ్చుకోవడం మంచిది. మరీ తినాలనిపిస్తే సాధ్యమైనంతవరకూ ఇంట్లో చేసిన పచ్చళ్లను.. అది కూడా నూనె, ఉప్పు, కారం తక్కువ పాళ్లలో కలిపిన వాటిని... అదీ కొద్ది కొద్దిగానే తీసుకోవడం మంచిది. 

చదవండి: Pachi Batani Health Benefits: పురుషులు పచ్చి బఠానీలు ఎక్కువగా తిన్నారంటే..
Potassium Deficiency Symptoms: పొటాషియం లోపిస్తే జరిగేది ఇదే! వీటిని తింటే మేలు..
 

మరిన్ని వార్తలు