తరచుగా హై బీపీ వస్తోందా? కంట్రోల్‌ చేయలేకపోతున్నారా? ఇవి తింటే..

23 Sep, 2022 15:18 IST|Sakshi

హై బీపీ.. హెవీ బ్లడ్‌ ప్రెషర్‌.. అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? అధిక రక్తపోటును నిశ్శబ్ద కిల్లర్‌గా సూచిస్తారు. ఇది తరచుగా ఎలాంటి సంకేతాలు, హెచ్చరికలు, లక్షణాలు లేకుండా వస్తుంది కాబట్టి చాలామందికి రక్త పోటు యొక్క ప్రమాద సూచిక అసలు అర్థం కాదు. బీపీ తరచుగా పెరుగుతున్నా.., తరచుగా తట్టుకోలేనంత కోపం వచ్చినా, శరీరంలో తేడా అనిపించినా.. కొన్ని జాగ్రతలు తీసుకుంటే మంచిది.

సోడియం లెవల్‌ సాధారణంగా ఒక లీటర్‌ రక్తంలో 135 నుంచి 145 మిల్లీ ఈక్వెలంట్స్‌ మధ్య ఉంటుంది. రక్తపోటు అధికంగా ఉన్నవారు రోజువారీ సోడియం 1,500 మిల్లీగ్రాములకు పరిమితం చేయాలి, ఇది తప్పకుండా పాటించాల్సిన మొదటి జాగ్రత్త. ఒక టీస్పూన్ ఉప్పులో సుమారు 2,400 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. ఆ మేరకు అంచనా వేసుకోవాలి. వెంటనే ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి.

కారంతోపాటు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆహారంలో సోడియం తగ్గడం వల్ల రక్తపోటు నార్మల్‌కు వస్తుంది. ఎందుకంటే, సోడియం అధికంగా తీసుకోవడం వల్ల శరీర అసమతుల్యతతోపాటు ఉబ్బరం ఏర్పడుతుంది.

ఎందుకంటే శరీరం ఉప్పును బయటకు పంపడానికి అదనపు నీటిని నిల్వ చేస్తుంది. ఇది తరచుగా శరీరంలో రక్తపోటును ప్రేరేపిస్తుంది. దీంతో అరోగ్య సమస్యలు మొదలువుతాయి. అందుకే ఉప్పును ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. అందువల్ల రక్తపోటును తగ్గించే ఏకైక మార్గం ఆహారంలో ఉప్పును తగ్గించడమే. 

రక్తపోటు స్థాయిలను తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడే ఆహార పదార్థాలు ఇవి.

అరటిపండ్లు 
ఇవి పొటాషియానికి గొప్ప మూలంగా ఉంటాయి. రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడే ఖనిజంగా పొటాషియం పనిచేస్తుంది. పొటాషియం, సోడియం 2:1 నిష్పత్తిగా ఉంటేనే శరీరంలో రక్తపోటు స్థాయి సమతుల్యంగా ఉంటుంది. అరటిపండ్లను తీసుకుంటే ఎటువంటి సమస్యలు రావు. నేరుగా తినవచ్చు లేదా బనానా షేక్, స్మూతీని తయారు చేసుకోని తిన్నా ఫరావాలేదు.

మెగ్నీషియం కోసం
బియ్యం, వేరుశెనగ, గుమ్మడి గింజలు, జీడిపప్పు, బాదం, వోట్స్ లాంటివి మెగ్నీషియంకు మంచి వనరులు. మెగ్నీషియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది సహజంగా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే మెగ్నీషియం నైట్రిక్ ఆక్సైడ్ ధమని గోడలను సడలించి, రక్తం సాఫీగా ప్రవహించేలా చేయడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, 500 మిల్లీగ్రామ్‌ నుంచి 1,000 మిల్లీగ్రామ్‌ వరకు మెగ్నీషియం తీసుకోవడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

పాల ఉత్పత్తులు
తాజా లేదా ఇంట్లో తయారుచేసిన పాల ఉత్పత్తులను చేర్చడం వల్ల రక్తపోటు స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. మన శరీరంలోని ఎముకలు, దంతాలలో భారీ మొత్తంలో కాల్షియం నిల్వ ఉంటుంది.

ఇది గుండెను  ఆరోగ్యంగా ఉంచుతుంది. కాల్షియం రక్త నాళాలు విస్తరించడానికి, సంకోచించడంలో సహాయపడుతుంది. అయితే కాల్షియం తగ్గితే హృదయనాళ వ్యవస్థ ద్వారా రక్తాన్ని పంప్ చేయడం కష్టతరం అవుతుంది. దీంతో కాల్షియం పొందేందుకు శరీరం ఇతర వనరుల కోసం వెతకడం మొదలవుతుంది. ఈ పరిస్థితి ఎముకల వ్యాధులకు దారితీస్తుంది. 

మీ ఆహారంలో పాలు, జున్ను, పెరుగు, మజ్జిగ వంటి కాల్షియం అధికంగా ఉండే వాటిని ఉండేలా చూసుకుంటే, ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు.

40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కనీసం సంవత్సరానికి ఒకసారి సోడియం పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. లెవల్స్‌లో తేడా ఉంటే డాక్టర్‌ను కలిసి ఆహార అలవాట్లను క్రమబద్ధీకరించుకోవడంతో పాటు ధ్యానం, యోగా లేదా వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి.
-డా.నవీన్‌ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు

చదవండి: Thyroid Cancer: థైరాయిడ్‌ క్యాన్సర్‌.. మహిళలతో పోలిస్తే పురుషులకే ముప్పు ఎక్కువ! లక్షణాలివే

మరిన్ని వార్తలు