Birth Control Methods: ఇప్పుడే ఇంకో బిడ్డ వద్దు! మధుమేహం, మూర్చ వ్యాధికి మందులు వాడుతున్నా.. ఇలా చేశారంటే!

6 Dec, 2022 17:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

డాక్టర్‌ సలహా

Health- Safest Contraceptive Methods: నాకు మూడేళ్ల బాబు ఉన్నాడు. ఇంకో బిడ్డను కనడానికి రెండు మూడేళ్ల సమయం ఉంచాలనుకుంటున్నాం. ప్రస్తుతం సేఫ్టీ మెథడ్స్‌ వాడుతున్నాం కాని ఎటువంటి టెన్షన్‌ లేని, ఎక్కువ కాలం ఉండే సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేని కాంట్రాసెప్టివ్‌ పద్ధతి ఏదైనా ఉంటే సూచించండి. లక్ష్మీ వాసంతి, కడప

ప్రెగ్నెన్సీని దీర్ఘకాలం వాయిదా వేసుకునే సురక్షితమైన పద్ధతులు ఇప్పుడు చాలానే వచ్చాయి. తొలి కాన్పు తర్వాత .. రెండో బిడ్డ కోసం మూడు నుంచి అయిదేళ్ల పాటు గ్యాప్‌ ఇవ్వాలనుకునే వారు.. ఇంట్రాయుటెరిన్‌ డివైజ్‌ (ఐయూడీ) కాపర్‌ టీ కాయిల్, ఇంట్రాయుటెరిన్‌ సిస్టమ్‌ మరేనా కాయిల్, కాంట్రాసెప్టివ్‌ ఇంప్లాంట్‌ వంటి పద్ధతులను అవలంబించవచ్చు.

సమస్యలు ఉండవు
అవి శరీరంలోకి ఇన్‌సెర్ట్‌ చేసేవి. ఒక్కసారి శరీరంలో అమర్చితే ఆటోమేటిగ్గా వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. వీటిని డాక్టర్‌ పర్యవేక్షణలోనే అమర్చాలి. ఈ పద్ధతుల వల్ల గర్భం రాకపోవడమే కాదు.. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, కడుపునొప్పి వంటివీ తగ్గుతాయి. అంతేకాదు బరువు పెరగడమనే సమస్యా ఉండదు. వీటిని స్థూలకాయులూ వాడొచ్చు.

మధుమేహం, మూర్చ వ్యాధికి మందులు వాడుతున్నా ఈ పైన చెప్పిన గర్భనిరోధక పద్ధతులను అవలంబించవచ్చు. మళ్లీ గర్భం దాల్చాలనుకున్నప్పుడు డాక్టర్‌ దగ్గరకు వెళితే లోపల అమర్చిన ఈ డివైజ్‌ను తీసేస్తారు. నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడుతూ, పిల్లల్ని కూడా వద్దు అనుకునేవాళ్లు ఈ మరేనా కాయిల్‌ను వాడొచ్చు. దీనికి హార్మోన్‌ కాయిల్‌ ఉంటుంది. అది రోజు కొంచెం హార్మోన్‌ను విడుదల చేస్తూ బ్లీడింగ్‌ని తగ్గిస్తుంది.

కాపర్‌ టీ కాయిల్‌ ఎందుకంటే!
ఆ హార్మోన్‌ వల్ల గర్భధారణ కూడా జరగదు. కాపర్‌ టీ కాయిల్‌ను గర్భాన్ని నిరోధించడానికి వేస్తాం. ఈ పద్ధతుల గురించి డాక్టర్‌తో డిస్కస్‌ చేస్తే.. పరీక్షించి.. మీకు సూటయ్యే మెథడ్‌ను సూచిస్తారు. అవుట్‌ పేషంట్‌గానే ఈ ప్రక్రియను పూర్తిచేస్తారు. పీరియడ్స్‌ అయిన వెంటనే ఈ డివైజ్‌ను అమరుస్తారు. ఒకసారి వేసిన తర్వాత అయిదేళ్ల వరకు మార్చాల్సిన అవసరం ఉండదు. మీరు డాక్టర్‌ను సంప్రదిస్తే ఏ డివైజ్‌ వెయ్యాలి అనేది డాక్టర్‌ మీతో డిస్కస్‌ చేస్తారు.
-డా. భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌ 
చదవండి:  Essential Bath Rules: స్నానానికి వేణ్ణీళ్లా? చన్నీళ్లా? కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు!

మరిన్ని వార్తలు