Solution For Vaginal Boil: ఏడాదిగా అక్కడ సెగ గడ్డలు.. ఏ ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి?

2 Aug, 2022 14:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

డాక్టర్‌ సలహా

నా వయసు 25 సంవత్సరాలు. నాకు ఏడాదిగా వజైనా దగ్గర బయట భాగంలో సెగ్గడ్డలు వస్తున్నాయి. డాక్టర్‌ని సంప్రదిస్తే యాంటీబయోటిక్స్‌ ఇచ్చారు. కానీ మూడు నెలల్లోనే మళ్లీ వస్తున్నాయి. ఏ ట్రీట్మెంట్‌ తీసుకోవాలో చెప్పగలరు. చాలా నొప్పిగా, ఇబ్బందిగా ఉంటోంది. – స్వర్ణ, కర్నూలు

దీనిని ‘బార్తోలిన్‌ అబ్సెస్‌’ అంటారు. చాలామందికి మీ ఏజ్‌ గ్రూప్‌లో వస్తుంది. ‘బార్తోలిన్‌ సిస్ట్స్‌’ అని వజైనా ఎంట్రన్స్‌లో రెండువైపులా ఉంటాయి. ఇవి కొంత డిశ్చార్జ్‌ చేసి, వజైనాని తేమగా ఉంచుతాయి. ఈ సిస్ట్స్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్‌తో బ్లాక్‌ అయితే, చీము పట్టి, వాపు వచ్చి, నొప్పిగా ఉంటాయి. మూత్రవిసర్జన కూడా కష్టంగా ఉంటుంది.

చాలామందికి ఏ కారణంగా ఇన్ఫెక్షన్‌ వచ్చిందో చెప్పడం కూడా కష్టమే! బ్యాక్టీరియా, క్లామిడియా, గనేరియా వంటి ఇన్ఫెక్షన్లు వజైనాలో ఉంటే, ఈ సిస్ట్స్‌ బ్లాక్‌ అయి, గడ్డలు కడతాయి. వజైనల్‌ స్వాబ్‌ టెస్ట్‌ చేసి, ఏ బ్యాక్టీరియా ఉందో పరీక్షించాల్సి ఉంటుంది. ట్రీట్‌మెంట్‌ తీసుకోకపోతే ఇన్ఫెక్షన్‌తో సిస్ట్స్‌ పగిలి, చీము బయటకు వచ్చి విపరీతమైన నొప్పి ఉంటుంది. మళ్లీ గడ్డ వచ్చే అవకాశం ఉంటుంది.

యాంటీబయోటిక్స్‌ ఇచ్చినా మళ్లీ గడ్డలు వస్తున్నాయంటే, సిస్ట్స్‌ని ఆపరేషన్‌ థియేటర్‌లో పూర్తిగా డ్రెయిన్‌ చేయాల్సి ఉంటుంది. అబ్జార్బబుల్‌ మత్తు ఇచ్చి, ఈ శస్త్రచికిత్స చేస్తారు. సిస్ట్స్‌ డ్రెయిన్‌ చేశాక, కుట్లు వేస్తారు. వారం రోజుల పాటు పెయిన్‌ కిల్లర్స్, యాంటీబయోటిక్స్‌ డాక్టర్‌ సూచన మేరకు వాడుకోవాల్సి ఉంటుంది. దీనికి డాక్టర్‌తో రెగ్యులర్‌ ఫాలోఅప్‌తో ఉండాలి. 

ఈ మైనర్‌ ప్రొసీజర్‌ మీకు డేకేర్‌లో అవుతుంది. ఆపరేషన్‌ తర్వాత మళ్లీ ఇన్ఫెక్షన్‌ రాకుండా, వజైనా భాగాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. పొడిగా ఉంచుకోవాలి. కొన్ని రోజులు బరువులు ఎత్తడం, వ్యాయామాలు మానుకోవాలి. దీనికి ముందు డయాబెటిస్, రక్తహీనత ఉంటే వాటిని పరీక్షించి, తగిన మందులు సూచిస్తారు. యూరిన్‌ ఇన్ఫెక్షన్‌ రాకుండా ఎక్కువ నీరు తాగాలి. జ్వరం, బ్లీడింగ్, చీము ఉన్నట్లయితే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
- డా. భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌.
చదవండి: Tips For Healthy Pregnancy: గర్భసంచి వదులుగా ఉంది.. కుట్లు వేయాలి? ఏమైనా ప్రమాదమా?

మరిన్ని వార్తలు