Sinusitis: సైనస్ ఇన్ఫెక్షన్ ఉందా? పెరుగు, వేరుశనగపప్పు, కాఫీ లాంటి వాటి వాడకం తగ్గించడం సహా..

20 Sep, 2022 12:15 IST|Sakshi

పక్కలో బళ్లెం సైనస్‌..!

మీకు సైనస్ ఇన్ఫెక్షన్ ఉందా? తలనొప్పి మరియు జలుబు తగ్గడం లేదా? ఆయుర్వేదంలో ఏం పరిష్కారాలున్నాయి? సైనస్‌ సమస్య ఉంటే ఏకాగ్రత ఉండదు. సరైన నిద్ర ఉండదు. కొన్ని సందర్భాల్లో అయితే సరిగా గాలి కూడా పీల్చుకోలేము. శాశ్వతంగా కాదు గానీ, కొన్ని పద్దతుల ద్వారా ఉపశమనం మాత్రమే లభిస్తుంది. 

సైనస్‌...
►తరచుగా పార్శ్య తలనొప్పి 
►ముక్కు కొద్దిగా వంకరగా ఉండటం 
►మన రెండు కళ్ళు చూసే రెండు వేర్వేరు విషయాలను కలపడంలో మెదడు ఇబ్బంది పడడం వల్ల నొప్పి
►ముక్కు దూలం కొంచెం వంగి ఉండటం
►ముక్కులో సైనస్ గ్రంధులు దుమ్ము వల్ల ఉబ్బడం

ఎలాంటి చికిత్సలున్నాయి? 
►ముక్కు శస్త్ర చికిత్స
►ముక్కులో సైనస్ గ్రంధులు తొలగింపు
►ప్రాణాయామంలో అనులోమ విలోమ పద్దతి
►హోమియో లో ఎస్‌ ఎస్‌ మిక్చర్‌ అనే మందు రోజూ రాత్రి పూట నిద్రపోయే ముందు తీసుకోవడం

ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
1. వీలైనంత వరకు ఘాటైన వాసనలకు, కాలుష్యానికి దూరంగా ఉండడం 
2. చలి గాలికి, వర్షంలో తడవకుండా జాగ్రత్త తీసుకోవడం
3. జీర్ణశక్తి మెరుగుపరచుకోవడం, మలమూత్రాదులు ఏ రోజుకా రోజు క్రమ పద్ధతిలో శరీరంనుంచి బయటకు పూర్తిగా వెడలిపోయేలా చూసుకోవడం. అంటే అజీర్తి అనే సమస్యను లేకుండా చేసుకోవడం.

ఆయుర్వేదంలో ఏం పరిష్కారాలున్నాయి?
1. వేపపొడి నీటిలో కలిపి పరగడుపున త్రాగడం వల్ల శరీర శుద్ధి జరుగుతుంది. తద్వారా ఇలాంటి సమస్యలు అదుపులో ఉంటాయి.
2. తుమ్ములు, జలుబు లాంటివి బాగా ఎక్కువగా ఉంటే ముక్కులో వేపనూనె ఓ రెండు చుక్కలు వేయడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది. (కానీ వేపనూనె వల్ల కలిగే మంట కొన్ని నిముషాలు నరకం చూపిస్తుంది.)
3. నీటిలో వేపనూనె లేదా పసుపు లాంటివి వేసి, బాగా మరగబెట్టాక వచ్చే ఆవిరిని పట్టడం. దీనికి మంచి వ్యాపరైజర్స్ కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

4. మందు బిళ్ళలు, యాంటీబయాటిక్ లాంటివి తక్కువగానే వాడడం మేలు. ఎందుకంటే అవి సమకూర్చే సౌకర్యాల కంటే తెచ్చిపెట్టే ఇబ్బందులే ఎక్కువ.
5. గొంతు గరగరలు ఎక్కువగా ఉంటే తేనె, కషాయం, గోరువెచ్చని నీటితో గార్గ్లింగ్ లాంటివి ఉపశమనం కలిగిస్తాయి.
6. సరిపడినంత నిద్ర, తగినంత నీరు త్రాగడం

7. పెరుగు, వేరుశనగపప్పు, కాఫీ లాంటి వాటి వాడకం తగ్గించడం
8. నిత్యం వ్యాయామం, నడక
9. సూర్యనమస్కారాలు, ప్రాణాయామం లాంటివి చేస్తే అధికంగా తయారయ్యే మ్యూకస్ తొలగిపోయే అవకాశం ఉంది.
10. జలనేతి కూడా మంచి సాధనమే. ఒక ముక్కులోనుంచి పంపిన ఉప్పు నీరు మరో ముక్కునుంచి బయటకు వచ్చేలా చేయడం. తదనంతరం గట్టిగా గాలి వదులుతూ ముక్కులు పొడిగా అయ్యేట్లు చేయడం.

ఇక్కడ ఉదహరించినవి అన్నీ స్వయంగా ప్రయత్నించి ఫలితాలను వరుసక్రమంలో బేరీజు వేసుకుని చెప్పినవే. మీరు వాడే ముందు మీ శరీర ధర్మాలను బట్టి అనుసరిస్తే మేలు. అందరికీ ఒకేలా పని చేస్తాయని చెప్పలేం కదా! 

ఇవేవీ శాశ్వతంగా సమస్యను దూరం చేయలేవు. కేవలం కాలంతోపాటు మన శరీర ధర్మాలు, రోగనిరోధకశక్తి మారే తీరు మాత్రమే ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించగలదు.
-డా.నవీన్‌ నడిమింటి, ప్రముఖ ఆయర్వేద వైద్యులు

చదవండి: Steamed Food- Health Benefits: ఆవిరిపై ఉడికించిన ఆహారం తరచుగా తిన్నారంటే!
How To Control BP: బీపీ పెరగడానికి కారణాలేంటి? ఎలా కంట్రోల్‌ చేసుకోవాలి? ఇవి తగ్గిస్తే..

మరిన్ని వార్తలు