Kidney Stones Health Tips: నీటితో పోయేది రాయి దాకా వస్తే...

23 Jan, 2022 12:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కిడ్నీ స్టోన్‌ 

రీనల్‌ కాల్‌కులీ, నెఫ్రోలిథియాసిస్, యురోలిథియాసిస్‌... ఇవన్నీ మనం వాడుక భాషలో కిడ్నీ స్టోన్స్‌గా వ్యవహరించే వ్యాధుల వైద్యపరిభాష పదాలు. ఆహారంలో దేహానికి అందిన మినరల్స్, సాల్ట్స్‌ మూత్రం ద్వారా విసర్జితం కాకుండా ఒకచోట కేంద్రీకృతం కావడం ద్వారా ఏర్పడుతాయి. కాంపౌండ్స్‌ను బట్టి వీటిని కాల్షియం స్టోన్స్, స్ట్రక్టివ్‌ స్టోన్స్, యూరిక్‌ యాసిడ్‌స్టోన్స్, క్రిస్టైన్‌ స్టోన్స్‌గా వర్గీకరిస్తారు.

ఎందుకు వస్తాయి?
కొందరిలో ఫ్యామిలీ హెల్త్‌ హిస్టరీ కారణమవుతుంది. దేహం డీ హైడ్రేషన్‌కు గురికావడంతోపాటు ప్రోటీన్, సోడియం, షుగర్స్‌ మితిమీరి తీసుకోవడం స్వీయ తప్పిదాల వల్ల ఈ సమస్య వస్తుంది. కొన్ని రకాల ఆపరేషన్‌ల సైడ్‌ ఎఫెక్ట్‌గా కూడా కిడ్నీ రాళ్లు ఏర్పడుతుంటాయి. దేహం అధిక బరువు, కొన్ని రకాల అనారోగ్యాలు, ఆ అనారోగ్యం తగ్గడానికి తీసుకునే మందులు కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి పరోక్షంగా కారణమవుతుంటాయి.

ఇలా ఇబ్బంది పెడతాయి
కిడ్నీలో రాళ్లు మూత్రపిండాల నుంచి మూత్రాశయానికి మధ్యలో ఏదో ఒక చోట యూరినరీ ట్రాక్ట్‌ను ఇబ్బందికి గురిచేస్తుంటాయి.
ఈ రాళ్లు సైజును బట్టి మూత్ర విసర్జన సమయంలో కొద్దిపాటి అసౌకర్యం నుంచి తీవ్రమైన నొప్పి కలిగిస్తుంటాయి.
రాయి ఒరుసుకుపోవడంతో మూత్రవిసర్జన మార్గంలో గాయమవుతుంటుంది.
మూత్రాశయం, మూత్రనాళాల్లో ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంటాయి. నాళం ద్వారా బయటకు రాలేనంత పెద్ద రాళ్లు ఆ మార్గంలో ఏదో ఒక చోట స్థిరపడిపోతాయి. 
నిజానికి కిడ్నీలో రాళ్లు ఏర్పడిన వెంటనే వాటి లక్షణాలు బయటకు తెలియవు.
కొంతకాలం పాటు అవి స్వేచ్ఛగా మూత్రాశయం, మూత్రనాళాల మధ్య సంచరిస్తుంటాయి. మూత్రనాళం సైజ్‌ కంటే చిన్నవిగా ఉన్న రాళ్లు మూత్రంతోపాటు బయటకు వెళ్లిపోతుంటాయి.

అంతకంటే పెద్దవైన తర్వాత మాత్రమే లక్షణాలు బహిర్గతమవుతాయి. మూత్రనాళం వాపుకు లోనవడం, కండరాన్ని పట్టినట్లు నొప్పి రావడం తొలి లక్షణాలు.
పక్కటెముకల కింద ఒక పక్క నుంచి వెనుక వైపుకు తీవ్రమైన నొప్పి, ఒక్కోసారి నొప్పి షాక్‌ కొట్టినట్లు ఉంటుంది.
పొత్తి కడుపు కింద నుంచి పాకినట్లు నొప్పి
నొప్పి తీవ్రత పెరుగుతూ – తగ్గుతూ అలలు అలలుగా రావడం

మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి, మంట
వీటితోపాటు మూత్రం రంగు మారడం (రక్తం కలిసినట్లు), దుర్వాసన, తరచూ విసర్జనకు వెళ్లాల్సి రావడం, విసర్జన తర్వాత కూడా వెళ్లాల్సిన అవసరం ఉన్నట్లు అనిపించడం, మూత్రాశయం నిండిపోయినట్లు అనిపిస్తున్నప్పటికీ కొద్దిమోతాదులో మాత్రమే విడుదల కావడం, తల తిరగడం– వాంతులు, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమై చలిజ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

రాయిని బట్టి చికిత్స
మూత్రం పలుచగా ఉన్నప్పుడు మినరల్స్, సాల్ట్స్‌ అన్నీ సులువుగా బయటకు వెళ్లిపోతాయి. కానీ మూత్రం చిక్కబడినప్పుడు ఇవి ఒక చోట కేంద్రీకృతమవుతుంటాయి. కాబట్టి దేహం డీహైడ్రేట్‌ కాకుండా తగినంత నీటిని తీసుకోవడం ప్రధానమైన జాగ్రత్త. చికిత విషయానికి వస్తే... రాయి కాంపౌండ్స్, సైజ్‌ను బట్టి కరిగించడం, శస్త్ర చికిత్స చేసి తొలగించడంతోపాటు లేజర్‌ కిరణాల ద్వారా రాయిని పలుకులుగా చేయడం అనే నొప్పి లేని పద్ధతులు కూడా పాటిస్తారు.

తక్షణ వైద్యం
కిడ్నీలో రాళ్లు ఏర్పడినట్లు సందేహం కలిగిన వెంటనే డాక్టర్‌ని సంప్రదించి తీరాలి. ఎందుకంటే కొంతకాలం సొంత వైద్యం చేసుకుని వేచి చూసే పరిస్థితి కాదు. లక్షణాలు బయటపడేటప్పటికే వ్యాధి తక్షణ వైద్యం అందాల్సిన స్థితికి చేరి ఉంటుంది. ఆలస్యం చేస్తే ఎదురయ్యే పరిణామాలు ఇలా ఉంటాయి.
∙నొప్పి తీవ్రమవడంతోపాటు కనీసం కూర్చోలేకపోతారు. ఈ భంగిమలో కూర్చుంటే కొంచెం ఉపశమనంగా, సౌకర్యంగా ఉంది అనడం కూడా సాధ్యం కాని స్థితి ∙నొప్పితోపాటు చలిజ్వరం ∙మూత్రంలో రక్తం పడడం, మూత్ర విసర్జన కష్టం కావడంతోపాటు నొప్పి, తలతిరగడం, వాంతులు కావడం అన్నీ ఏకకాలంలో సంభవిస్తాయి.

మరిన్ని వార్తలు