Tips For Healthy Pregnancy: గర్భసంచి వదులుగా ఉంది.. కుట్లు వేయాలి? ఏమైనా ప్రమాదమా?

28 Jul, 2022 15:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

డాక్టర్‌ సలహా

నాకిప్పుడు మూడో నెల. గర్భసంచి వదులుగా ఉంది.. కుట్లు వేయాలి అంటున్నారు. దీనివల్ల ఏమైనా ప్రమాదమా? అందరికీ ఇలాగే ఉంటుందా? – ముంజుష కొండపాక, జహీరాబాద్‌

గర్భసంచి ముఖ ద్వారం చిన్నగా ఉన్నా, ముందుగానే తెరుచుకుంటున్నా (అంటే 34 వారాలకు ముందు) సర్వైకల్‌ స్టిచ్‌ వేస్తారు. ఈ పరిస్థితిని అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ ద్వారా గుర్తిస్తారు. గర్భస్రావం అవకుండా, సమయానికి ముందే కాన్పు కాకుండా ఈ సర్వైకల్‌ స్టిచ్‌ ఆపుతుంది. కొంతమందిలో ముందు ప్రెగ్నెన్సీలో సమస్యలు తలెత్తినా, సెర్విక్స్‌ చిన్నదైపోయి సమయానికి ముందే కాన్పు అయినా, లేదా సెర్విక్స్‌ పైన ఏదైనా ఆపరేషన్‌ చేసినా తర్వాత ప్రెగ్నెన్సీలో మూడవ నెలలోనే ఇలా కుట్లు వేస్తారు.

సర్వైకల్‌ స్టిచ్‌ను 12 – 24 వారాల్లోపు వేస్తారు. అవసరమైన కేసెస్‌లో మాత్రమే నెలలు నిండిన తరువాత అంటే 37 – 38 వారంలో ఓపీలోనే ఇంటర్నల్‌ ఎగ్జామ్‌ చేసి ఈ కుట్లను విడిచి.. నార్మల్‌ డెలివరీ కోసం వెయిట్‌ చేయొచ్చు. నొప్పులు వస్తే ఈ కుట్లను ముందుగానే తీసేస్తారు. ట్రాన్స్‌వెజైనల్‌ స్కాన్‌లో సెర్విక్స్‌ 25ఎమ్‌ఎమ్‌ కన్నా తక్కువ వస్తే స్టిచ్‌ వేస్తారు.

లో రిస్క్‌ కేసెస్‌లో కేవలం కొన్ని హార్మోన్‌ మాత్రలతో లేదా ఇంజెక్షన్స్‌తో సర్వైకల్‌ స్టిచ్‌ వేయకుండానే అబ్జర్వ్‌ చేయవచ్చు. దీనికి సంబంధించి  సీనియర్‌ డాక్టర్‌ పర్యవేక్షణలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టిచ్‌ వేసే ముందు యూరిన్, వెజైనాలో ఇన్‌ఫెక్షన్స్‌ ఏమీ లేవని టెస్టుల ద్వారా నిర్ధారిస్తారు. ఉమ్మనీరు పోయినా, బ్లీడింగ్‌ అవుతున్నా నొప్పులు  వస్తున్నా ఈ సర్వైకల్‌ స్టిచ్‌ వేయకూడదు.

అంటే డెలవరీ ప్రాసెస్‌ స్టార్ట్‌ అయిన తరువాత ఇలాంటి ప్రక్రియతో దాన్ని ఆపలేం. అందుకే హై రిస్క్‌ కేసెస్‌లో సెర్విక్స్‌ లెంగ్త్‌ ఎలా ఉంది అని 12వ వారం నుంచి 24వ వారం వరకు రెండు వారాలకొకసారి అల్ట్రాసౌండ్‌లో చెక్‌ చేసి సెర్విక్స్‌ చిన్నదవుతుంటే స్టిచ్‌ వేయడం జరుగుతుంది. తొలిచూలు కాన్పులో కొంతమందికి ఏవిధమైన స్పాటింగ్, బ్లీడింగ్‌ లేకున్నా కూడా హఠాత్తుగా గర్భసంచి ముఖద్వారం చిన్నదైపోవడం, తెరుచుకొని, సమయానికి కన్నా ముందే కాన్పు అవడం సంభవిస్తాయి.

దీనిని సర్వైకల్‌ ఇన్‌కాంపిటెన్స్‌ అంటారు. కొన్ని కేసెస్‌లో రెస్క్యూ స్టిచ్‌ వేసి కాన్పును తాత్కాలికంగా ఆపే ప్రయత్నం చేయగలం. కానీ నొప్పులు, బ్లీడింగ్‌ ఉంటే ఏమీ చేయలేం. ఇలాంటి కేసెస్‌లో తర్వాత ప్రెగ్నెన్సీలో మూడవ నెలలోనే స్టిచ్‌ వేసేస్తారు. సర్వైకల్‌ స్టిచ్‌ అనేది ఆసుపత్రిలో చేర్చుకుని, ఎనస్తీషియా ఇచ్చి చేసే ప్రక్రియ.

ఇందులో కొంత రిస్క్‌ కూడా ఉంటుంది. ఈ ప్రక్రియకు ముందు డాక్టర్‌ అన్నీ వివరిస్తారు. మీకు కచ్చితంగా సర్వైకల్‌ స్టిచ్‌ అవసరమైతేనే డాక్టర్‌ ఆ నిర్ణయం తీసుకుంటారు. ఈ స్టిచ్‌ వేసిన తరువాత అవసరమైనవారికి మాత్రమే బెడ్‌ రెస్ట్‌ సూచిస్తాం. చాలా మంది మామూలుగానే రోజూవారి పనులు చేసుకోవచ్చు. డాక్టర్‌ ఫాలో అప్‌లో మాత్రం ఉండాలి.  
- డా. భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌.

మరిన్ని వార్తలు