Health Tips: రోజూ స్కిప్పింగ్‌ చేసే అలవాటుందా? ఎండార్ఫిన్ల ఉత్పత్తి పెరిగి..

25 Oct, 2022 09:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

Skipping- Health Benefits: వర్కవుట్స్‌ మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవే మనల్ని ఆరోగ్యంగా, ఫిట్‌ గా ఉంచుతాయి. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించగలవు. అయితే అందరూ వర్కవుట్స్‌ చేయలేరు. అలాగని వర్కవుట్స్‌ చేయకుంటే స్థూలకాయంతో సహా రకరకాల సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉంది. ఈ తలనొప్పంతా మాకెందుకులే అనుకుంటే మాత్రం రోజూ చిన్నవో పెద్దవో వ్యాయామాలు చేయాల్సిందేనంటున్నారు నిపుణులు.

అలాంటి వ్యాయామాలలో స్కిప్పింగ్‌ ఒకటి. దీనినే ఒకప్పుడు తాడాట అనేవాళ్లు. ఇప్పుడు స్కిప్పింగ్‌ అంటున్నారు. స్కిప్‌ చేయకుండా స్కిప్పింగ్‌  చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.

కొంతమంది జిమ్ములకు వెళ్లి వ్యాయామాలు చేస్తుంటారు. అయితే సమయం లేక కొంతమంది అవి కూడా చేయకుండా స్కిప్‌ చేస్తుంటారు. అయితే ఇలాంటి వారు ఎంచక్కా స్కిప్పింగ్‌ను చేయొచ్చు. చిన్న తాడుతో చేసే ఈ వ్యాయామం వల్ల మాకేంటి ప్రయోజనాలు అనేవారు... అనుకునేవారు కాస్త ఆగండి..

జిమ్ముల్లో చేసే వర్కవుట్స్‌లో కష్టపడి చెమటలు చిందించే వారు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో.. స్కిప్పింగ్‌ వల్ల కూడా అన్ని ప్రయోజనాలను పొందుతారని ఫిట్‌నెస్‌ నిపుణులంటున్నారు. స్కిప్పింగ్‌ను ఎంచక్కా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఇంట్లో చేసే స్కిప్పింగ్‌ వల్ల ఏం లాభాలుంటాయని తేలిగ్గా తీసిపారేయకండి.. ఇది ఎన్నో రోగాలను ఇట్టే తగ్గించేయగలదు.. 

సులువుగా బరువు తగ్గచ్చు
స్కిప్పింగ్‌ బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో ఉన్న అదనపు కేలరీలు కరిగిపోతాయి. స్కిప్పింగ్‌  కూడా ఒక లాంటి వ్యాయామమే. స్కిప్పింగ్‌ వల్ల నిమిషాలను 15 నుంచి  20 కేలరీలను బర్న్‌ చేస్తారు. సో వెయిట్‌ లాస్‌ అవ్వాలనుకునేవారు స్కిప్పింగ్‌ ను చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. 

గుండె బాగుంటుంది
స్కిప్పింగ్‌ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్కిప్పింగ్‌ వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. తద్వారా గుండె ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని  తగ్గించడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

మెదడు పనితీరు మెరుగు
స్కిప్పింగ్‌ మెదడుపై అనుకూల ప్రభావాన్ని చూపెడుతుంది. ఎందుకంటే మీరు జాగ్రత్తగా జంప్‌ చేసేలా మెదడు సంకేతాలను పంపిస్తుంది. ఈ శ్రద్ధ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

బద్దకాన్ని వదిలిస్తుంది
స్పిప్పింగ్‌ చేసే మొదట్లో బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ రోజూ స్కిప్పింగ్‌ చేయడం వల్ల శరీరం హుషారుగా మారుతుంది. ఇది మీ అలసటను పోగొట్టడమే కాదు.. మిమ్మల్ని రీఫ్రెష్‌ గా ఉంచుతుంది. అందుకు బద్దకంగా, ఎప్పుడూ విసుగ్గా ఉండేవారు స్కిప్పింగ్‌ ను రోజూ చేయండి.

స్ట్రెస్‌ను తగ్గిస్తుంది
ఈ రోజుల్లో ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువ అయ్యాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో స్కిప్పింగ్‌ ముందుంటుంది. ఎందుకంటే ఇది  మానసిక స్థితిని మెరుగుపరిచే  ఎండార్ఫిన్ల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది..

స్కిప్పింగ్‌ చేసే అలవాటు మీకు లేకపోతే వెంటనే అలవాటు చేసుకోండి. మీ పిల్లలకు కూడా స్కిప్పింగ్‌ చేయడాన్ని ప్రాక్టీస్‌ చేయించండి. వారితోపాటు మీరు కూడా పోటీ పడి స్కిప్పింగ్‌ చేస్తూ ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండండి. 
నోట్‌: ఈ కథనం కేవలం ఆరోగ్యం మీద అవగాహన కోసం మాత్రమే!

చదవండి: Health Tips: నీరసం.. నిస్సత్తువా? వీటిని ఆహారంలో చేర్చుకున్నారంటే..
రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన: కెఫిన్, శీతల పానీయాలు.. ఇంకా వీటికి దూరంగా ఉండకపోతే
  

మరిన్ని వార్తలు