Eye Problems: ప్రమాద సంకేతాలు.. ఉబ్బిన కళ్లు, రెప్పల మీద కురుపులు.. ఇంకా ఇవి ఉన్నాయంటే

7 Nov, 2022 11:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

Health Tips In Telugu- Eye Care: కళ్లు.. మన ఆరోగ్యానికి వాకిళ్లు అని చెప్పచ్చు. విషప్రభావానికి గురైనప్పుడు కళ్లు మూతలు పడిపోతుంటాయి. అదేవిధంగా కొన్ని రకాల అనారోగ్యాలకు సూచనగా కళ్లు ఎర్రబడటం, మంటలు పుట్టడం, పుసికట్టడం జరుగుతుంటుంది. అందుకే చాలామంది వైద్యులు మనం ఏదైనా సమస్యతో వెళ్లినప్పుడు కళ్లను కూడా పరీక్ష చేయడం చూస్తుంటాం. ఇంతకీ కళ్లు ఎలా ఉంటే ఏ సమస్య ఉందో ఎలా నిర్ధారించవచ్చో తెలుసుకుందాం. 

అనారోగ్యాలను గుర్తించగలిగే పరిస్థితులు వస్తాయి. మన శరీరంలోని ఇతర అవయవాలు, భాగాలను పరీక్షించడానికి ఉపయోగించే పరికరాలు, టెక్నాలజీ, పద్ధతులకన్నా... కేవలం మన కళ్లలోకి చూసి అనేకరకాల ఆరోగ్య సమస్యలను గుర్తించటం సాధ్యమే. మన కళ్లు చూపే ప్రమాద సంకేతాల్లో కొన్ని ఇవి.

కనుపాప పరిమాణం
కనుపాప వెలుతురుకు తక్షణమే స్పందిస్తుంది. ప్రకాశవంతమైన వాతావరణంలో కనుపాప చిన్నదవుతుంది. వెలుతురు తగ్గే కొద్దీ కనుపాప పెద్దదవుతుంది. అయితే ఈ కనుపాప పరిమాణం హెచ్చుతగ్గుల ప్రతిస్పందన నెమ్మదిగా లేదా ఆలస్యంగా జరుగుతున్నట్లయితే దానిని పలు రకాల అనారోగ్యాలకు సూచనగా భావించవచ్చు.

అందులో అల్జీమర్స్‌ వంటి వ్యాధులు, మందుల ప్రభావాలు, మాదకద్రవ్యాల వినియోగించారనే దానికి ఆధారాల వంటివి ఉంటాయి. కొకెయిన్‌ వంటి మాదకద్రవ్యాలను ఉపయోగించే వారిలో కనుపాపలు ఉబ్బినట్లు కనిపిస్తే, హెరాయిన్‌ వాడేవారిలో కనుపాపలు చిన్నవిగా కనిపిస్తాయి.

ఎరుపు లేదా పసుపు కళ్లు
కంటిలోని తెల్లగుడ్డు రంగు మారటం మన శరీరంలో ఏదో తేడా ఉందనడానికి సంకేతం కావచ్చు. కళ్లు రక్తంతో ఎరుపెక్కిన రంగులో కనిపిస్తే.. అది అధికమోతాదులో మద్యం లేదా, మాదక ద్రవ్యాలను తీసుకున్నదానికి సంకేతం కావచ్చు. కళ్లలో నలత లేదా ఇన్ఫెక్షన్‌ కారణంగా కూడా కళ్లు ఎర్రగా మారవచ్చు. అయితే ఈ సమస్య చాలా వరకూ రోజుల్లోనే తగ్గిపోతుంది.

ఒకవేళ కళ్లు ఇలా రంగి మారి ఎక్కువ కాలం అలాగే ఉంటే మరింత తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ , వాపు లేదా కాంటాక్టు లెన్స్, సొల్యూషన్లకు రియాక్షన్‌కు సూచన కావచ్చు. మరీ తీవ్రమైన కేసుల్లో ఎరుపు కళ్లు గ్లుకోమాకు సూచనకావచ్చు. ఈ జబ్బు అంధత్వానికి దారితీయగలదు. ఇక తెల్లగుడ్డు పసుపు రంగులోకి మారితే అది జాండిస్‌ (కామెర్లు)కు గుర్తు. 

కురుపులు, గడ్డలు
కళ్లలో మనం చూడగానే చాలా భయపెట్టే సమస్యలు ఒక్కోసారి అతి నిరపాయకరమైన, చాలా సులభంగా చికిత్స చేయగలిగే సమస్యలు కావచ్చు. కంటి తెల్లగుడ్డు మీద పుట్టుకువచ్చే పసుపురంగులోని లావాటి గడ్డ ఉంటుంది. ఇది కొవ్వు, మాంసం ఒకచోట పేరుకుని ఏర్పడే గడ్డ. దీనిని చుక్కల మందుతో సులభంగా తగ్గించవచ్చు.

లేదంటే చిన్నపాటి శస్త్రచికిత్సతో తొలగించవచ్చు. నిజానికి ఈ గడ్డను అది కార్నియాను – అంటే నల్లగుడ్డును తాకకముందే తొలగించి తీరాలి. ఒకవేళ అది పెరుగుతూ పోయేదాకా అశ్రద్ధ చేస్తే.. నల్లగుడ్డు (శుక్ల పటలం) మీద పెట్రీజియం అనే ఒక తెరవంటిది ఏర్పడుతుంది. అది చూపును మసకబారుస్తుంది.

ఉబ్బిన కళ్లు
కళ్లు బయటకు పొడుచుకు వచ్చినట్లు ఉబ్బుగా ఉండటం మామూలు ముఖాకృతిలో భాగంగా ఉండవచ్చు. కానీ, మామూలుగా ఉబ్బెత్తు కళ్లు లేని వారికి.. కళ్లు ఉబ్బుతూ బయటకు పొంగుతున్నట్లుగా రావటం మొదలైతే.. అందుకు థైరాయిడ్‌ గ్రంథి సమస్య కారణం కావచ్చు. దీనికి వైద్యసాయం అవసరం.

ఒకటే కన్ను బయటకు పొడుచుకువచ్చినట్లు అయితే.. దానికి కారణం ఏదైనా గాయం కానీ, ఇన్ఫెక్షన్‌ కానీ కావచ్చు. అరుదైన కేసుల్లో కంటి వెనుక ట్యూమర్‌ (గడ్డ) ఏర్పడటం కారణం కావచ్చు.

రెప్పల మీద కురుపులు
కళ్లే కాదు, కనురెప్పలు కూడా చాలా అనారోగ్యాల గురించి సూచిస్తుంటాయి. ఇవి ప్రధానంగా కనురెప్పల గ్రంథులకు సంబంధించిన చిన్నపాటి అనారోగ్యాలకు గుర్తు. ఎక్కువగా పై కనురెప్ప మీద.. అరుదుగా కింది కనురెప్ప మీద ఒక ఎర్రటి గడ్డ ఏర్పడుతుంది. నూనె గ్రంథికి అడ్డంకులు తలెత్తటం వల్ల ఈ కురుపులు పుట్టుకొస్తాయి. ఈ కనురెప్పల కురుపులు మామూలుగా వాటికవే తగ్గిపోతాయి. లేదంటే కాపడం పెట్టటం ద్వారా తగ్గుతాయి. ఒకవేళ అలా తగ్గని పక్షంలో దీనిని చిన్నపాటి శస్త్రచికిత్సతో తొలగించాలి.

కళ్లు అదరటం
కళ్లు లేదా కనురెప్పలు అదరటం అనే ఈ పరిస్థితి చాలా వరకూ ఒత్తిడి వల్ల కానీ పోషకాహార సంతులనం లోపించటం వల్ల కానీ, అధిక మోతాదులో కెఫీన్‌ సేవించటం వల్ల కానీ తలెత్తే  సమస్య. దీనిని అంతగా పట్టించుకోనక్కరలేదు. వీటితో పాటు కళ్లలో ఎరుపు చార, కన్నులో బూడిద రంగు వలయం ఏర్పడినా అశ్రద్ధ చేయవద్దు. చూశారుగా... ఇప్పటికైనా అప్పుడప్పుడు కళ్ల మీద దృష్టి పెడతారు కదా...!
నోట్‌: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కలిగించడం కోసం మాత్రమే!

చదవండి: Diabetes: షుగర్‌ పేషెంట్లకు ఆరోగ్య ఫలం!.. ఒక్క గ్లాసు జ్యూస్‌ తాగితే 15 నిమిషాల్లో..
గర్భిణులు గ్రహణ సమయంలో బయట తిరగడం వల్లే అలా జరుగుతుందా?

మరిన్ని వార్తలు