Steamed Food- Health Benefits: ఆవిరిపై ఉడికించిన ఆహారం తరచుగా తిన్నారంటే!

17 Sep, 2022 14:19 IST|Sakshi

ఆవిరితో వండితే... ఆరోగ్యం అదుర్స్‌

దాదాపు ఒక ఇరవై ఏళ్ల కిందటి వరకు జ్వరమొచ్చి తగ్గిన వాళ్లకి పొట్లకాయ, బీరకాయ, దొండకాయ, కాకరకాయ లాంటి కూరలు పథ్యం పెట్టేవాళ్లు పెద్దవాళ్లు. అదేవిధంగా నీరసంగా ఉన్న వాళ్లకి ఆవిరి కుడుముల లాంటివి పెట్టేవాళ్లు. ఇవి తేలికగా అరగడంతోపాటు వంటికి సత్తువనిచ్చేవి. ఇది ఒకప్పటి మాట కదా అని తేలిగ్గా తీసుకోవద్దు.

ఆధునిక వైద్యులు, ఆహార నిపుణులు కూడా ఆవిరితో తయారు చేసుకున్న ఆహార పదార్థాలనే తినమని సూచిస్తున్నారు చాలామందికి. ఎందుకో ఏమిటో తెలుసుకుందాం. 

ఇడ్లీలు ఆవిరితోనే తయారవుతాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఆవిరితో ఇడ్లీలతోపాటు ఎన్నో రకాల వంటకాలను తయారుచేసుకోవచ్చు. ఎందుకంటే ఆవిరితో వండిన వంటలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి.

తొందరగా జీర్ణం అవుతుంది
నూనెతో డీప్‌ ఫ్రై చేయడంతో పోలిస్తే ఆవిరితో వండటం వల్ల వాటిలో ఉండే పోషకాలు ఎక్కడికీ పోవు. కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. కేలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. ఇలాంటి ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమమైన ఆహారం.   

విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే సాధారణంగా చాలా మంది ఇలాంటి ఆహార పదార్థాలను ఉడకబెట్టి వండుతారు. దీంతో వాటిలో ఉండే పోషకాలు చాలా తగ్గిపోతాయి.

శక్తిని మరింత పెంచుతాయి
అలా కాకుండా ఆవిరిలో ఉడికించడం వల్ల నియాసిన్, విటమిన్‌ బి, థయామిన్, విటమిన్‌ సి వంటివి మన శక్తిని మరింత పెంచుతాయి. ఇవి తిన్నవారికి ఖనిజాలు, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, జింక్‌ వంటిపోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. 

బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్‌ ఫుడ్‌
సాధారణంగా ప్రతి వంటకు నూనెను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. కానీ ఆవిరితో తయారుచేసే ఆహారాలకు నూనె అవసరమే లేదు. అందుకే ఆవిరి పట్టిన ఆహారాల్లో కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్‌ ఫుడ్‌ అని నిపుణులు చెబుతున్నారు. 

ఆవిరితో వండిన ఆహార పదార్థాలలో కేలరీలు, కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి చాలా తొందరగా జీర్ణం అవుతాయి. ఈ ఆహారం బరువుతోపాటు ఎన్నోరకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.  

కూరగాయలు, పండ్లు తేలికగా జీర్ణం అవుతాయి. ఆవిరిలో వండిన ఆహారాలు చాలా మృదువుగా తయారవుతాయి. ఆవిరి పట్టిన ఆహారం చాలా తేలిగ్గా జీర్ణం అవుతుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.  

కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది!
ఆవిరిలో ఉడికించిన ఆహారం కొవ్వులను నియంత్రణలో ఉంచుతుంది. ఎందుకంటే ఈ వంటలో నూనెను ఉపయోగించకపోవడమే దీనికి కారణం. వంటల్లో నూనెవల్లే చాలా బరువు పెరుగుతారు. అందుకే ఎక్కువ కొవ్వు లేదా నూనెను తినకూడదు. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది.

రంగు, రుచి మారదు
ఆవిరితో వండిన కూరగాయల రంగు అస్సలు మారదు. రుచి కూడా బాగుంటుంది. మరింత రుచికరంగా కొన్ని రకాల మసాలా దినుసులను ఉపయోగించవచ్చు. 
కాబట్టి ఆరోగ్యం బాగుండాలంటే ఆవిరి మీద తయారు చేసే ఆహార పదార్థాలేమిటో తెలుసుకుని వాటి మీద దృష్టి పెట్టాల్సిందే మరి! 

చదవండి: Health Tips: షుగర్‌ పేషెంట్లకు ఈ పండ్లు అస్సలు మంచివి కావు! వీటిని తింటే..
Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్‌ వల్ల..

మరిన్ని వార్తలు