Health Tips: ఈ పండ్ల గింజల్లో సైనైడ్‌ను విడుదల చేసే కారకాలు! తిన్నారంటే అంతే సంగతులు! జాగ్రత్త!

30 Aug, 2022 10:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఏది పడితే అది ఆర‘గింజ’కండి

Are These Seeds Poisonous: కొన్ని రకాల పండ్ల గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా విత్తనాలను తింటే శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి.

అయితే కొన్ని పండ్ల విత్తనాలను పొరపాటునో లేదంటే కావాలనో తరచూ తింటే.. అవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆపిల్‌ 
రోజుకు ఒక ఆపిల్‌ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతుంటారు. ఆపిల్‌ మంచిదే అయినా.. ఆపిల్‌ గింజలు మాత్రం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు.

ఎందుంటే వీటిలో ఉండే అమిగ్డాలన్.. సైనైడ్‌ను విడుదల చేస్తుంది. ఇది కడుపులోకి వెళ్లి విరేచనాలు, వికారం, కడుపు తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. నిజానికి సైనైడ్‌ మరణానికి కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఆపిల్‌ గింజల్లో ఇది తక్కువ స్థాయిలోనే ఉంటుంది.

చెర్రీ 
మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి చెర్రీ పండ్లు. కానీ చెర్రీ గింజల్లో హానికరమైన సైనైడ్‌ సమ్మేళనం ఉంటుంది. వీటిని ఎక్కువ మొత్తంలో తినడం వల్ల ఆపిల్‌ తినడం వల్ల కలిగే నష్టాలే కలుగుతాయి.

ఆప్రికాట్‌ 
ఆప్రికాట్‌ విత్తనాలలో విషపదార్థాలైన అమిగ్డాలన్, సైనోజెనిక్‌ గ్లైకోసైడ్లు ఉంటాయి. ఆప్రికాట్‌ విత్తనాలను తినడం వల్ల శరీరం బలహీనపడటమే కాదు.. ప్రాణాల మీదికి వస్తుంది. ఈ విత్తనాలు ఒక వ్యక్తిని కోమాలోకి తీసుకెళతాయి. 

పీచ్‌
పీచ్‌ విత్తనాల్లో అమిగ్డాలిన్, సైనోజెనిక్‌ గ్లైకోసైడ్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆప్రికాట్‌ విత్తనాల మాదిరిగానే లక్షణాలు కనిపిస్తాయి. దీనిని తినడం వల్ల పొత్తికడుపు నొప్పి, నెర్వస్‌ నెస్‌ సమస్య ఎక్కువగా ఉంటుంది. 

పియర్‌
విత్తనాల్లో  ప్రాణాంతకమైన  సైనైడ్‌ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వికారం, విరేచనాలు, పొత్తికడుపు నొప్పిని కలిగిస్తుంది. అలాగే చెమట, అలసట వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇది కోమాకు కూడా దారితీస్తుంది.  ఇంకా బొప్పాయి గింజలు కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

ముందు చెప్పినట్లుగా ఒకటీ రెండు సార్లు పొరపాటున అదీ ఒకటో రెండో గింజలు తింటే పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ.. తరచూ తింటే మాత్రం ప్రమాదం బారిన పడినట్లే పరిశోధకులు అంటున్నారు. 
చదవండి: Tips To Increase Platelet Count: ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో పాటు గుమ్మడి, గోధుమ గడ్డి.. ఇంకా ఇవి తింటే..
Mental Health: ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్నారా? ఆ మూడింటిపై నియంత్రణ లేకపోతే! అంతే ఇక..

మరిన్ని వార్తలు