Tips To Increase Platelet Count: ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో పాటు గుమ్మడి, గోధుమ గడ్డి.. ఇంకా ఇవి తింటే..

27 Aug, 2022 09:57 IST|Sakshi

Super Foods To Increase Platelet Count: ప్రస్తుత కాలంలో డెంగ్యూ జ్వరాలు, వైరల్‌ ఫీవర్ల మూలాన ప్లేట్‌లెట్ల కౌంట్‌ విపరీతంగా పడిపోతూ రోగులను, వారి సంబంధీకులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అయితే, ప్లేట్‌లెట్ల కౌంట్‌ పడిపోయిన తర్వాత చేయగలిగిందేమీ లేదు, దాతలనుంచి సేకరించిన ప్లేట్‌లెట్లను రోగులకు ఎక్కించడం మినహా.

అలా కాకుండా, మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే రోగ నిరోధకత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోగనిరోధకతను పెంచే ఆహారం ఏమిటో తెలుసుకుందాం. 

రక్తాన్ని పెంచే క్యారట్‌..
ప్లేట్‌లెట్‌ కౌంట్‌ని కూడా పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆ సమస్యతో బాధపడేవారు త్వరగా ఉపశమనం పొందారని సర్వేలో తేలింది. క్యారెట్‌ని నేరుగానైనా, సలాడ్‌ రూపంలోనైనా ఎలా తీసుకున్నా ఫలితం ఉంటుంది.

గుమ్మడికాయ..
ఎక్కువగా వంటల్లో ఉపయోగించే గుమ్మడిలో విటమిన్‌ ఏ ఎక్కువగా ఉంటుంది. అంతేనా.. ఇందులో ప్లేట్‌లెట్లని పెంచడమే కాదు, వాటి సంఖ్యను అదుపులో ఉంచే లక్షణాలు కూడా ఉన్నాయి. దీన్ని క్రమబద్ధంగా తీసుకోవడం వల్ల కణాల్లో ప్రోటీన్‌ ఉత్పత్తి అవుతుంది. ఇలా ప్రోటీన్‌ ఉత్పత్తి అవడమంటే ప్లేట్‌లెట్స్‌కౌంట్‌ పెరిగినట్లే. 

బొప్పాయి
బొప్పాయి పండు ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి చాలా మంచిదని తెలుసు. అయితే, కేవలం పండులో మాత్రమే కాదు.. ఈ ఆకుల్లోనూ బోలెడు ఆరోగ్యానికి సంబంధించిన గుణాలున్నాయి. ముఖ్యంగా ఇందులో ఫ్లేవనాయిడ్స్, అల్కాలాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి.

వీటిని తినడం వల్ల 24 గంటల్లోనే ప్లేట్‌లెట్‌ పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ ఆకు రుచి మాత్రం కాస్త చేదుగానే ఉంటుంది. కానీ, ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోకతప్పదు.

గోధుమగడ్డి..
ఈ మధ్యకాలంలో చాలామందికి ఆరోగ్యంపై పెరిగిన అవగాహన కారణంగా.. గోధుమగడ్డి గురించి అందరూ ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇందులోని ఎన్నో ప్రత్యేక గుణాలు ఆరోగ్యానికి చాలా మంచిది.

కాబట్టి.. ఈ గడ్డిని రసంగా చేసుకుని వడపోసి అందులో కాస్త నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సులభంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

బీ 12 ఫుడ్‌..
►పాలు, గుడ్లు, చీజ్‌లో బీ 12 ఎక్కువగా ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ బాగా పెరుగుతుందని తేలింది.
►బీట్‌ రూట్‌.. ఎరుపు రంగులో ఉండే బీట్‌రూట్‌.. శరీరంలో రక్త శాతాన్ని పెంచుతుంది. దీనిని ఎలా తీసుకున్నా మంచిదే. దీని వల్ల ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పెరుగుతుంది. ►క్యారట్, బీట్‌రూట్‌ని కలిపి జ్యూస్‌ చేసుకుని తాగినా మంచి ఫలితమే ఉంటుంది.

విటమిన్‌ కె ఫుడ్‌..
విటమిన్‌ కె ఉన్న ఫుడ్‌ కూడా ప్లేట్‌లెట్స్‌ సంఖ్యని పెంచుతుందని తేలింది. కేల్, గుడ్లు, ఆకుకూరలు, లివర్, మాంసం, క్యాబేజీ తినడం వల్ల కూడా ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పెరుగుతుంది.

విటమిన్‌ సి ఫుడ్‌..
►ఆరోగ్యానికి విటమిన్‌ సి చాలా అవసరం.
►విటమిన్‌ సి ఎక్కువగా ఉన్న నిమ్మ, కమలాఫలం, కివీ, పాలకూర, ఉసిరి, బ్రొకోలీ, టమాట, అడవి ఉసిరి, కాలీఫ్లవర్‌ తినడం వల్ల ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ పెరుగుతుందని తేలింది.
►ఫ్రీ రాడికల్స్‌ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి కౌంట్‌ని పెంచడంలో ఈ ఆహారపదార్థాలు బాగా ఉపయోగపడతాయి.

►ప్లేట్‌లెట్స్‌ పడిపోయిన వారు సమస్యని పరిష్కరించుకునేందుకు వీటిని ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
►ఒకవేళ తినడం కష్టం అనుకుంటే వీటితో సలాడ్‌ చేసి భోజనానికి ముందుగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక కమలాఫలాల్ని జ్యూస్‌లా చేసుకోని ►తాగేయొచ్చు. 

ముఖ్య విషయం ఏమిటంటే.. పైన చెప్పిన ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల కేవలం ప్లేట్‌లెట్స్‌ సంఖ్య ఒక్కటే పెరగదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటిలో వ్యాధి నిరోధకత ఒకటి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 

మరిన్ని వార్తలు