Health Tips: నట్స్‌, డార్క్‌ చాక్లెట్స్‌, అరటి పండ్లు తరచూ తింటున్నారా? డోపమైన్‌ అనే హార్మోన్‌ విడుదల చేసి..

17 Oct, 2022 15:50 IST|Sakshi

Health Tips In Telugu: ఒక్కోసారి కారణమేమీ లేకుండానే దిగులుగా అనిపిస్తుంది. విలువైన వస్తువులేవో పోగొట్టుకున్నట్లు ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా చికాకు వేస్తుంటుంది.ఆ తర్వాత కాసేపటికి ఇష్టమైన వారెవరో కనిపిస్తేనో, ఏదైనా మంచి వార్తలు వింటేనో, ఏమయినా మంచి ఆహారం తింటేనో మూడ్‌ సరి అయిపోతుంది. ఇది మనసు చేసే మాయాజాలం.

ఇదంతా జరగడానికి మన శరీరంలో ఉండే డోపమైన్‌ అనే హార్మోన్‌ విడుదలలో తేడాలు రావడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే అలా కారణం మాత్రమే చెప్పి ఊరుకోకుండా మంచి మూడ్‌లోకి తీసుకొచ్చే కొన్ని ఆహార పానీయాల గురించి కూడా చెప్పారు. వీటిని కేవలం మూడ్‌ బాగోలేనప్పుడే కాదు, రోజువారీ  తీసుకుంటే ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండవచ్చు కదా.. ఇంతకూ అలాంటి ఆహార పానీయాలేమిటా అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వెళ్దాం...  

వీటితోబాటు ఆకుకూరలు, కాలీఫ్లవర్, బ్రోకలీ కూడా డోపమైన్‌ బూస్టర్‌గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు కాబట్టి అప్పుడప్పుడు వీటిని కూడా ఆహారంలో చేర్చుకుంటే సరి.

నట్స్‌
నట్స్‌లో అమైనో యాసిడ్స్‌ సమృద్ధిగా ఉంటాయి. అమైనో యాసిడ్‌కు డోపమైన్‌ విడుదలను పెంచే సామర్థ్యం ఉంది. ఒక అధ్యయనం ప్రకారం... నట్స్‌లో టైరోసిన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది.

ఈ టైరోసిన్‌ విచ్ఛిన్నమైతే.. డోపమైన్‌గా తయారవుతుంది. వేరుశెనగలు, బాదం, గుమ్మడి గింజలు, నువ్వులలో టైరోసిన్‌ పుష్కలంగా ఉంటుంది. వీటిని స్నాక్స్‌గా తీసుకుంటే ఉల్లాసంగా, ఆనందంగా ఉంటారు.

కాఫీ
సాధారణంగా చాలామందికి మూడ్‌ బాగోలేనప్పుడు లేదా తలనొప్పిగా అనిపించినప్పుడు మంచి ఫిల్టర్‌ కాఫీ తాగుతుంటారు. దాంతో శాడ్‌ మూడ్‌ కాస్తా తిరిగి హ్యాపీ మూడ్‌గా మారిపోతుంటుంది. ఒక పరిశోధన ప్రకారం రోజూ సుమారు బిలియన్‌ మందికి పైగా కాఫీ తాగుతుంటారు.

రోజూ కాఫీ తాగేవారికి డిప్రెషన్‌ కూడా కాస్త దూరంలోనే ఉంటుందని కొన్ని సర్వేలలో తేలింది కాబట్టి నిద్రలేచి బ్రష్‌ చేసిన వెంటనే కాఫీ తాగే అలవాటున్నవారు దానిని కొనసాగించడం మంచిది. ఈసారెప్పుడైనా మూడ్‌ బాగోలేప్పుడు ఒక కప్పు కాఫీ తాగి చూస్తే సరి.

కొబ్బరి
పచ్చి కొబ్బరిలో మీడియం లెవెల్‌లో ట్రై గ్లిజరైడ్లు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని, మెదడుకు చైతన్యాన్ని ఇస్తాయి. కొబ్బరి పాలు, కొబ్బరితో చేసిన తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల ఒత్తిడి మటుమాయం అవుతుంది. అందుకే కొబ్బరికి మూడ్‌ ఫుడ్‌ అనే పేరుంది.

బెర్రీలు...
సాధారణంగా పండ్లు, కూరగాయలు బాగా తీసుకునేవారి మానసిక ఆరోగ్యం బాగానే ఉంటుంది. వాటిలోనూ ప్రత్యేకించి బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల బెర్రీలు తీసుకునే వారికి కుంగుబాటు, ఆందోళన ఆమడదూరంలో ఉంటాయి. బ్లూ బెర్రీలు అంటే నేరేడు పండ్ల వంటివి తీసుకోవడం వల్ల మూడ్‌ బాగుంటుంది.

అవకాడో
ఒకప్పుడు ఇది కాస్తంత ఖరీదైన ఆహారాల జాబితాలో ఉండేది కానీ ఇప్పుడు మాత్రం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ పండులో ఉండే మెత్తటి గుజ్జు అనేక రకాల పోషకాలకు నిలయం. దీనిలోని కొలీన్‌కు నాడీ వ్యవస్థను నియంత్రించడంతోపాటు మూడ్‌ను సంతోషంగా మార్చే లక్షణాలు ఉన్నాయి.

ఒక సర్వే మేరకు అవకాడో తినే మహిళలలో ఆందోళన ఉండదట. వీటిలో సమృద్ధిగా ఉండే విటమిన్‌ బి శరీరంలోని ఒత్తిడి స్థాయులను అదుపు చేస్తుంది. అందువల్ల వీలయినప్పుడలా అవకాడో తింటూ ఉండటం ఎంతో ప్రయోజనకరం.

డార్క్‌ చాక్లెట్స్‌
ఇవి తినడానికి రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపే వాటిలో డార్క్‌ చాక్లెట్స్‌ ఎప్పుడూ ముందుంటాయి. వీటిలో ఉండే ఉండే ఫినైల్‌థైలమైన్‌ అనే రసాయనం డోపమైన్‌ను కొద్ది కొద్దిగా విడుదల చే స్తుంటుంది.

అంతే కాదు, డార్క్‌ చాక్లెట్స్‌లో ఉండే కొన్ని రకాల రసాయనాల వల్ల ఎండార్ఫిన్‌ హార్మోన్, సెరోటోనిన్‌ అనే మోనోఅమైన్‌ న్యూరోట్రాన్స్‌మీటర్‌ విడుదలవుతాయి. వీటివల్ల మానసిక ఉల్లాసం, సంతోషం కలుగుతాయి. 

అరటిపండు
అరటిపండ్లలో విటమిన్‌ బి6 ఉంటుంది. ఇది శరీరంలో డోపమైన్, సెరోటోనిన్‌ న్యూరో టాన్స్‌మీటర్ల విడుదలకు ఉపకరిస్తుంది. మెదడు, శరీరం చురుగ్గా ఉండేలా చేయడానికి ఈ రసాయనాలు తోడ్పడడంతోపాటు మానసిక స్థితిని నియంత్రణలో ఉంచి.. కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి.

అరటిపండ్లు రక్తంలోని షుగర్‌ నిల్వలను సైతం నియంత్రించగలవు. అలాగని షుగర్‌ ఉన్నవారు ఒకేసారి రెండు మూడు అరటిపళ్లు లాగించేయకూడదు. మూడ్‌ సరిగా లేదనిపిస్తే మాత్రం ఒక అరటిపండు తింటే సరి. 

డెయిరీ ఉత్పత్తులు
ఒత్తిడిలో ఉన్నప్పుడు డెయిరీ ఉత్పత్తులు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. చీజ్, పాలు, పెరుగు తీసుకుంటే.. శరీరంలో హ్యాపీ లెవల్స్‌ పెరుగుతాయి. చీజ్‌లో టైరమైన్‌ ఉంటుంది, ఇది మానవ శరీరంలో డోపమైన్‌గా మారుతుంది.

పెరుగులో ప్రోబయోటిక్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు పాలు, చీజ్, పెరుగు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాదు, పుల్లట్లు తిన్నా, పులి బొంగరాలు తిన్నా మంచిదే. కాకపోతే అవి సిద్ధంగా ఉండవు కాబట్టి వీలయినప్పుడల్లా తింటూ ఉంటే మంచిది. 
నోట్‌: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే!

చదవండి: Health Tips: పదే పదే గర్భస్రావం కావడానికి అది కూడా ఓ కారణమే! పార్ట్‌నర్‌కు సంబంధించి
Beauty Tips: ట్యాన్‌, నల్ల మచ్చల సమస్యా? బియ్యం, రోజ్‌వాటర్‌.. ఇలా చేశారంటే

మరిన్ని వార్తలు