గర్భవతులకు నోటి పరిశుభ్రత ముఖ్యం.. లేదంటే నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా గర్భసంచికి చేరి..

20 Jun, 2022 10:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

Importance Of Oral Health During Pregnancy: గర్భవతి తన నోటి ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడం ఎంతో అవసరం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. గర్భవతుల్లో సాధారణంగా ‘ప్రెగ్నెన్సీ జింజివైటిస్‌’ అనే చిగుర్ల వ్యాధి వస్తుంటుంది. ఇది గర్భధారణ జరిగిన రెండో నెలలో కనిపిస్తుంటుంది. ఒకవేళ ఆ మహిళకు ముందే చిగుర్ల సమస్య ఉంటే అది గర్భధారణ తర్వాత మరింత తీవ్రమవుతుంది.

ఇలాంటి సమయాల్లో నోటి శుభ్రతకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోతే చిగుర్లలో వాపురావడం లేదా నోటిలో కణుతులు, నాన్‌ ఇన్‌ఫ్లమేటరీ, నాన్‌ క్యాన్సరస్‌ వంటి గడ్డలు పెరగవచ్చు. అంతేకాదు... గర్భధారణ సమయంలో నోటి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోకపోతే నిర్ణీత వ్యవధి కంటే చాలా ముందుగానే ప్రసవం కావడం (నెల తక్కువ బిడ్డలు పుట్టడం), చాలా తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం వంటి సమస్యలు రావచ్చు.

నోటిశుభ్రత పరంగా దీనికి కారణాలూ ఉన్నాయి. నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా రక్త ప్రవాహంతో పాటు కలిసిపోయి గర్భసంచి (యుటెరస్‌)కి చేరి, ప్రోస్టాగ్లాండిన్‌ వంటి రసాయనాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి.

అదే గర్భధారణ వ్యవధికి ముందే ప్రసవానికి (ప్రీ–మెచ్యుర్‌ లేబర్‌కు) దారితీసే అవకాశం ఉంది. అందుకే గర్భవతులు నోటి ఆరోగ్యాన్ని, పరిశుభ్రతను (ఓరల్‌ హైజీన్‌ను) ఎంత బాగా పాటిస్తే... కాబోయే తల్లికే కాదు... పుట్టబోయే బిడ్డకూ మేలు చేస్తుంది. ఇదే విషయాన్ని ఇటీవలి కొన్ని పరిశోధన ఫలితాలూ వెల్లడిస్తున్నాయి.

చదవండి: Tamarind Leaves: చింత చిగురుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..

మరిన్ని వార్తలు