Patika Bellam Health Benefits: పటికబెల్లం ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? కానీ ఎక్కువ తిన్నారంటే

30 Apr, 2022 11:59 IST|Sakshi

Patika Bellam Health Benefits: పటికబెల్లం అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది తియ్యటి రుచిని కలిగి ఉంటుంది. పటికబెల్లం శరీరానికి చలువ చేస్తుంది, జీర్ణశక్తిని పెంచి దేహానికి బలాన్ని, వీర్యపుష్టిని ఇస్తుంది. వాత, పిత్త , కఫ దోషాల వల్ల కలిగే అనేక రోగాలకు ఔషధంగా పనిచేస్తుంది.

అయితే తియ్యగా ఉంది కదా అని ఎక్కువ తింటే మాత్రం మలబద్ధకం తప్పదు. ఈ క్రమంలోనే పటిక బెల్లంతో మనకు కలిగే ఇతర ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం.

పటికబెల్లం ఆరోగ్య ప్రయోజనాలు
పంచదారను ప్రాసెస్‌ చెయ్యడానికి ముందు రూపమే పటికబెల్లం. దీనిని కలకండ అని కూడా అంటారు. మిశ్రీ అంటారు. పటికబెల్లం పంచదార కన్నా మంచిది. 
మూడు, లేదా నాలుగు దొండ పండ్లను పటికబెల్లం పొడిలో అద్దుకొని తింటూ ఉంటే దగ్గు తొందరగా తగ్గిపోతుంది.
చెంచాడు పటికబెల్లం పొడి, చెంచాడు పచ్చి లేదా ఎండు కొబ్బరి కోరు కలిపి పిల్లలకు తినిపిస్తే ఎక్కిళ్లు తగ్గుతాయి.
వేడివేడి పాలల్లో పటికబెల్లం పొడి కలిపి రెండు లేక మూడు పూటలు తాగితే స్వరపేటికను ఎక్కువగా ఉపయోగించడం వల్ల వచ్చే గొంతు బొంగురు తగ్గిపోతుంది. ముఖ్యంగా ఇది అధ్యాపక, ఉపన్యాస వృత్తిలో ఉండే వారికి, పాటలు పాడే వారికి బాగా ఉపకరిస్తుంది. 

రెండు టేబుల్‌ స్పూన్ల పటికబెల్లం పొడి, టేబుల్‌ స్పూన్ల గసగసాలు తీసుకుని ఈ రెండింటినీ కలిపి మెత్తగా నూరి గాలి చొరని గాజు సీసాలో నిల్వ ఉంచుకుని పూటకు చెంచా చొప్పున వెన్నతో కలుపుకుని రెండు పూటలా తింటే గర్భిణులలో వచ్చే పొత్తి కడుపు నొప్పి, కండరాలు బిగదియ్యడం, రక్త విరేచనాలు, జిగట విరేచనాలు వంటివి తగ్గిపోతాయి.
పటికబెల్లాన్ని, మంచిగంధాన్ని సాన మీద అరగదీసి.. అంతే మొత్తంలో తేనెను తీసుకుని ఈ మూడింటినీ అరగ్లాసు బియ్యం కడిగిన నీటిలో కలిపి పూటకు ఒకసారి తీసుకుంటే రక్తవిరేచనాలు, జిగట విరేచనాలు తగ్గుతాయి. దీంతో శరీరంలో ఏర్పడే మంటలు కుడా తగ్గుతాయి.
పటికబెల్లం 20 గ్రాములు, ఆవువెన్న 20 గ్రాములు, పొట్టు తీసిన బాదం పప్పులు 7 తీసుకుని ఈ మూడింటినీ కలిపి ఉదయం పూట ఒకేసారి తీసుకుంటే ఉంటే దగ్గు తగ్గుతుంది.

కనుచూపు మెరుగవుతుంది. 
పాలల్లో పటికబెల్లం పొడి వేసి కలిపి తాగితే దాహం తగ్గుతుంది.
పటికబెల్లం పొడి అరస్పూను, టీ స్పూన్‌ పుదీనా ఆకుల రసం కలిపి రోజూ రెండు లేక మూడు పూటలు సేవిస్తూ ఉంటే దద్దుర్లు తగ్గుతాయి. 
వేసవిలో పిల్లలకు వడదెబ్బ తగలకుండా ఉండాలంటే, పటికబెల్లం పొడి కలిపిన నీటిలో గింజలు తీసేసిన ఎండు కర్జూరాలను వేసి ఉంచాలి. మధ్యాన్నం ఎండగా ఉన్నప్పుడు ఈ నీటిని వడకట్టి పిల్లలకు తాగిస్తే చాలా మంచిది. 

చదవండి👉🏾Maredu Juice: మారేడు జ్యూస్‌ తాగుతున్నారా.. ఇందులోని టానిన్, పెక్టిన్‌ల వల్ల..
  

మరిన్ని వార్తలు