Heart Healthy Foods: గుండెకు మేలు చేసే ఆహార పదార్థాలు ఇవే! అయితే ప్రతి రోజూ ఓట్స్‌ తినడం వల్ల..

26 Nov, 2022 10:01 IST|Sakshi

Heart Healthy Foods- Diet Tips In Telugu: అప్పటిదాకా నచ్చిన రుచులన్నీ కడుపునిండా తిన్న వారికి ఏ డయాబెటిస్సో, గుండెజబ్బో, కొలెస్టరాలో వచ్చిందంటే పాపం! వారి బాధ చెప్పనలవి కాదు. ఎందుకంటే అటు నోరుకట్టుకోనూలేరు, ఇటు ఇష్టం వచ్చినవన్నీ తినడానికీ లేదు. అలాగని పూర్తిగా చప్పిడి తిండే తినమంటే మరీ నీరసించి పోతారు.

ఇంతకీ మీరు చెప్పేదేమిటీ అనుకుంటున్నారా? కాస్త ఓపిక పట్టండి మరి! నోటికి రుచికరంగా ఉంటూనే, గుండెకు బలం చేకూరేలా, ఆరోగ్యానికి ఏమాత్రం హాని కలగకుండా కాపాడుకునేలా కొన్ని రకాలైన ఆహార పదార్థాలను సూచిస్తున్నారు వైద్యులూ, పోషకాహారనిపుణులూ. అవేమిటో తెలుసుకుందామా?

ఆకుపచ్చని కూరలు
ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలన్నీ గుండెకు బలాన్నిఇస్తాయి. ముఖ్యంగా బచ్చలి కూర గుండెకు చాలా మంచిది. బచ్చలికూరతో పప్పు వండుకోవచ్చు. సెనగపప్పు వేసి పప్పు కూర చేసుకోవచ్చు. పచ్చడి కూడా చేసుకోవచ్చు. అయితే నూనె, ఉప్పు, కారం పరిమితంగానే వాడాలి. 

టొమాటల్లోని లైకోపిన్‌ వల్ల
టొమాటోలలో ఉండే లైకోపిన్‌ అనే పోషకం గుండెకు చాలా మంచిది. టొమాటోలలో రక్తపోటును నియంత్రించే పొటాషియం కూడా ఉంటుంది. కాబట్టి పుల్లపుల్లగా, తియ తియ్యగా ఉండే టొమాటోలను విరివిగా తినచ్చు. 

చేపలు తింటే
చేపలు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. సాల్మన్‌ ఫిష్‌ లాంటివి మరింత ఆరోగ్యకరం. గుండె కొట్టుకోవడంలో తేడానీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నీ, ట్రై గ్లిజరైడ్స్‌నూ తగ్గించే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ వీటిలో ఎక్కువ. అందుకే వారానికి కనీసం రెండు సార్లయినా చేపలు తింటే మేలు అని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ సిఫార్సు చేస్తోంది. 

 స్ట్రా బెర్రీలతో
 స్ట్రా బెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక అధ్యయనంలో తేలింది. 

డ్రై ఫ్రూట్స్‌
కిస్మిస్, బాదం, ఎండు ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌ గుప్పెడు తింటే గుండెకు చాలా మంచిది. అలాగే ద్రాక్షపండ్లు కూడా గుండెకు సత్తువనిస్తాయి. అయితే ద్రాక్షను రసం తీసి కాకుండా నేరుగా తినడం మేలు. ఎందుకంటే ద్రాక్షరసంలో చక్కెర కలుపుకోవడం అనివార్యం కదా!

డార్క్‌ చాక్లెట్లు తింటే
డార్క్‌ చాక్లెట్లు గుండెకు మేలు. కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన డార్క్‌ చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు తగ్గడంతో పాటు రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. అయితే, మామూలు మిల్క్‌ చాక్లెట్లు, క్యాండీ బార్‌ల వల్ల మాత్రం గుండెకు మేలు చేకూరకపోగా ముప్పే. అలాగని డార్క్‌ చాక్లెట్లను కూడా మితిమీరి తినకూడదు.

గుండెకు మేలు చేసే 5 ఆహార పదార్థాలు
వేరుశెనగ
గుండెకు వేరుశెనగ ఎంతో మంచిది. మంచి కొవ్వును కలిగి ఉన్న వేరుశెనగలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నాయి. అవి గుండె భేషుగ్గా ఉండటానికి సహకరిస్తాయి. అలాగే వేరుశెనగలో ఉండే ఖనిజాలు గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడతాయి.

నారింజ
గుండె ఆరోగ్యానికి నారింజ పండు చాలా మంచిది. పొటాషియం అధికంగా ఉండే నారింజలో ఎలక్ట్రోలైట్‌ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. విటమిన్‌ సి అధికంగా ఉండే సిట్రస్‌ పండ్లు కూడా గుండె జబ్బులను నివారించడంలో తోడ్పడతాయి.

అవకాడో
విటమిన్‌–ఈతో పాటు అనేక ఇతర పోషకాలు అవకాడోలో సమృద్ధిగా లభిస్తాయి. దీనికితోడు మోనో అన్‌ –శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉండటం వల్ల ఈ పండు గుండెకు చాలా మంచిది. అవకాడోను రోజూ తినడం ద్వారా మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది.. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. తద్వారా గుండెపోటుతో సహా గుండె సంబంధిత వ్యాధులు నుంచి బయటపడవచ్చు.

వాల్‌నట్స్‌
రోజూ క్రమం తప్పకుండా కాసిని వాల్‌నట్స్‌ను తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌ పెట్టొచ్చు. అలాగే గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉండే వాల్‌నట్స్‌ హృదయ సంబంధిత వ్యాధులను నివారించడంతోపాటు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

ఓట్స్‌
ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఓట్స్‌ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఓట్స్‌లో ఒమేగా 3 ఆమ్లాలు కూడా ఉన్నాయి, ఇవి గుండెకు చాలా ప్రయోజనకరం. ప్రతీ రోజూ ఓట్స్‌ తినడం గుండెకు ఆరోగ్యాన్నిస్తుంది. 

నోట్‌: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! ఆరోగ్య సమస్యలను బట్టి వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సరైన పరిష్కారం పొందవచ్చు.

చదవండి: Lady Finger Health Benefits: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్‌.. ఇంకా మెదడు..
Cinnamon Health Benefits: దాల్చిన చెక్క పొడి పాలల్లో వేసుకుని తాగుతున్నారా? అయితే
Health Tips: రక్తం పీల్చే జలగలతో వైద్యం! పైల్స్‌, షుగర్‌ పేషంట్లకు ఉపశమనం.. ఇంకా..

మరిన్ని వార్తలు