Vitamin B12: విటమిన్‌ బి 12 లోపం లక్షణాలివే! వీటిని తిన్నారంటే..

30 Apr, 2022 14:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అలసట, కాళ్లు, చేతులు తిమ్మిర్లా?

విటమిన్‌ బి 12 లోపించి ఉండవచ్చు

శరీరానికి అత్యంత అవసరమైన సూక్ష్మ పోషకాల్లో విటమిన్‌ బి12 ఒకటి. ఇది నీటిలో కరిగే విటమిన్‌.  రక్తహీనత నుంచి మతిమరుపు వరకు.. నరాల బలహీనత నుంచి డిప్రెషన్‌ వరకు ఎన్నో రకాలుగా ఇది మనల్ని ప్రభావితం చేస్తుంది.

విటమిన్‌ బి 12 తగినంత లేకపోతే ముఖ్యంగా ఎదరయ్యే సమస్య అరికాళ్లు, అరచేతుల తిమ్మిర్లు. ఇది లోపించిందో, తగినంత ఉందో అని తెలుసుకునేందుకు చేసే పరీక్ష కాసింత ఖరీదైనదే. అయితే మనకు ఎదురయ్యే కొన్ని సమస్యల ద్వారా ఈ పోషక లోపం ఉన్నట్లు అర్థం చేసుకుని దీనిని భర్తీ చేసేందుకు తగిన ఆహారాన్ని తీసుకోవచ్చు. 

ఈ పోషకం సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలు తీసుకోకపోతే విటమిన్‌ బి12 లోపం ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. మన శరీరం దీన్ని సొంతంగా తయారు చేసుకోలేదు. అంతేకాదు.. ఇది శాకాహార పదార్థాల నుంచి పెద్దగా లభించదు కూడా. అందుకే దాదాపు 80 శాతం వీగన్లు, వెజిటేరియన్లకు విటమిన్‌ బి12 లోపం ఉంటుంది. విటమిన్‌ బి12 తక్కువగా ఉండడం వల్ల శరీరం వివిధ రకాలు గా ప్రభావితమవుతుంది.

విటమిన్‌ బీ 12 లోపం మూడ్‌ స్వింగ్స్‌కు కారణమైతే మరికొందరిలో డిప్రెషన్‌కు కూడా దారి తీస్తుంది. విటమిన్‌ బి12 సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఈ సమస్యను తగ్గించుకునే వీలుంటుంది.

ఇతర లక్షణాలు:
కళ్లు తిరగడం: విటమిన్‌ బి12 మన శరీరంలో ఆరోగ్యకరమైన రక్త కణాలను తయారుచేస్తుంది. బి12 లోపిస్తే.. రక్తకణాలు తక్కువగా ఉండడంతో శరీరంలోని అన్ని భాగాలకు ప్రాణవాయువు సరఫరా తగ్గుతుంది. తద్వారా అలసట ఎక్కువవుతుంది. మెదడుకు ఆక్సిజన్‌ తగ్గడం వల్ల కళ్లు తిరిగినట్లుగా అనిపించడంతో పాటు కంగారు, గజిబిజిగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

కారణాలు
విటమిన్‌ బి12 లోపానికి రెండు కారణాలు ఉంటాయి. మొదటిది పెర్నీషియస్‌ అనీమియా.. అంటే ఇందులో మన రోగ నిరోధక వ్యవస్థ మన శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను నాశనం చేస్తుంటుంది. జీర్ణాశయంలోని కణాలను ఇలా నాశనం చేయడం వల్ల శరీరం మనం తీసుకునే ఆహారంలోని విటమిన్‌ బి12 శరీరానికి అందదు.

ఇది చాలా తక్కువ మందిలో జరుగుతుంది. రెండోది మనం తీసుకునే ఆహారంలోనే సహజంగా విటమిన్‌ బి12 తక్కువగా ఉండడం.. సాధారణంగా వీగన్లు లేదా శాకాహారుల డైట్‌లో విటమిన్‌ బి12 తక్కువగానే లభిస్తుంది. ఇలాంటివారిలో ఈ లోపం కనిపించవచ్చు.

ఏకాగ్రత లేకపోవడం 
చాలామందిలో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. గతంలో మంచి జ్ఞాపకశక్తి ఉన్నవారిలో కూడా, బి12 లోపించినందువల్ల ఏకాగ్రత లేకపోవడం, విషయాలు తరచూ మర్చిపోతుండడం వంటి లక్షణాలు చోటు చేసుకుంటాయి. ఇది కొంత కాలానికి డిమెన్షియాకి దారి తీస్తుంది. అంటే వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోవడం, వ్యక్తులను గుర్తించడానికి సమయం పట్టడం వంటివి అన్నమాట.

బీ12 సమృద్ధిగా లభించే ఆహారం
గుడ్డు, పొట్టుతీయని ధాన్యం, పెరుగు, పాలు, చేపలు, నెయ్యి, బీట్రూట్, మష్రూమ్స్, ఆల్ఫాల్ఫా అనే ఒకరకమైన గోధుమ జాతికి చెందిన గడ్డి, జున్ను, ఈస్ట్, అరటి, యాపిల్, బెర్రీ జాతి పండ్లు. 
రోజుకు ఎంత మేర విటమిన్‌ బి12 కావాలో తెలుసుకొని ఆ మొత్తంలో ఈ పోషకాన్ని అందించే ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించడం.. వీలు కానప్పుడు డాక్టర్‌ సలహా మేరకు సప్లిమెంట్లు వాడటం మంచిది.

చదవండి👉🏾Patika Bellam Health Benefits: పటికబెల్లం ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? కానీ ఎక్కువ తిన్నారంటే

మరిన్ని వార్తలు