Health Tips: బరువు తగ్గాలని బ్రేక్‌ఫాస్ట్‌ మానేస్తున్నారా.. అయితే..

27 Feb, 2022 13:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతోపాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు తలెత్తే ప్రమాదం తగ్గుతుంది. అధిక బరువు... టైప్‌ 2 డయాబెటిస్, కొన్ని క్యాన్సర్లు, గుండె జబ్బులు వంటి అనారోగ్య పరిస్థితులకు దారితీస్తుంది.

అలాగే, తక్కువ బరువు ఉండటం కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం తగినంత బరువుతో ఆరోగ్యకరంగా జీవించడానికి సహాయపడుతుంది. 

ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను ఎంత చిన్న వయసులో ఆరంభిస్తే అంత మంచిది. అయితే, అలా ఆరంభించలేకపోయినందుకు విచారించవద్దు. మీరు ఇప్పుడు నలభైలలో ఉన్నారనుకోండి, ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను, జీవన శైలిని ఇప్పటినుంచి ఆరంభించినా, కనీసం అయిదారేళ్లకుపైగా జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చు. అదే అరవైలలో అయితే నాలుగయిదేళ్లు అదనంగా ఆరోగ్యకరంగా జీవించవచ్చు. 

అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు ఆరోగ్యకరమైన ఆలోచనలు కూడా అలవరచుకోవాలి. సానుకూలమైన ఆలోచనలు, స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణం కూడా అవసరం. కనీసం ఇప్పుడైనా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే జీవిత కాలాన్ని పొడిగించుకుని ఆరోగ్యంగా... ఆనందంగా జీవించవచ్చు.
 
అల్పాహారం మానద్దు 
కొంతమంది అల్పాహారం తినడం తగ్గిస్తే బరువు తగ్గుతామని భావిస్తారు. కానీ ఫైబర్‌ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన అల్పాహారం సమతుల్య ఆహారంలో భాగం అవుతుంది. మంచి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను పొందడానికి సహాయపడుతుంది కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌కు బ్రేక్‌ వేయకూడదు. 

తక్కువ ఉప్పు... తక్కువ ముప్పు!
ఎక్కువ ఉప్పు తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు గుండె వ్యాధులకు దారితీస్తుంది కాబట్టి రుచి కోసం అదనపు ఉప్పును తీసుకోవడం తగ్గించాలి.  

చదవండి: అదుపు చేసుకోలేకపోతున్నాను.. నాకేమైనా సమస్య ఉందంటారా?

మరిన్ని వార్తలు