What Is Menstrual Cramps: భరించలేని నొప్పి.. ప్రోస్టాగ్లాండిన్‌ అనే హార్మోన్‌ వల్ల! ఇలా చేస్తే!

13 Jun, 2022 14:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మెనుస్ట్రువల్‌ క్రాంప్స్‌ 

What Is Menstrual Cramps: యువతులకు నెలసరి ఎంతోకొంత ఇబ్బందికరమైనదే. ఒకవేళ దాంతోపాటు మెనుస్ట్రువల్‌ క్రాంప్స్‌ గనక తోడైతే మరెంతో బాధకారం. ఉన్న ఇబ్బందికి తోడు, బాధ,  వీపు, పొత్తికడుపు భాగాల్లో కండరాలు బిగుసుకుపోయి తీవ్రమైన నొప్పితో చెప్పుకోలేని విధంగా వేదనకు గురవుతుంటారు.

ఇటీవలే చైనాకు చెందిన  ప్రముఖ టెన్నిస్‌ ప్లేయర్‌ జెంగ్‌ క్విన్‌వెన్, న్యూజీలాండ్‌కు చెందిన గోల్ఫ్‌ ప్లేయర్‌  లైడియా కో వంటి క్రీడాకారిణులు ఈ సమస్యతో బాగా ఇబ్బంది పడ్డారు. జెంగ్‌ క్విన్‌వెన్‌ అయితే... ‘నేనో యువకుణ్ణయితే బాగుండేదేమో’’ అని కూడా వ్యాఖ్యానించింది. చాలామంది యువతులను బాధపెట్టే ఈ ‘మెనుస్ట్రువల్‌ క్రాంప్స్‌’పై అవగాహన కోసం ఈ కథనం.

ఓ బాలిక యుక్తవయస్కురాలయ్యాక దాదాపు మొదటి ఏడాదీ, రెండేళ్లు లేదా ఒక్కోసారి మొదటిబిడ్డ పుట్టే వరకు ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. వైద్యపరిభాషలో డిస్‌మెనూరియా అని పిలిచే ఈ సమస్య వల్ల... నొప్పితో పాటు పొత్తికడుపు, వీపు కింది భాగం కండరాలు కదలనివ్వనంతగా బిగుసుకుపోయి ఇబ్బంది పెడతాయి.

ఈ ఇబ్బంది ఎంతగా ఉంటుందంటే... ఆ రోజుల్లో వారి జీవననాణ్యత పూర్తిగా దెబ్బతినడంతో...  ప్రతినెలా వారి అమూల్యమైన రోజుల్లో కొన్ని ఈ బాధల వల్లనే పూర్తిగా వృథా అవుతాయి. 

ఎందుకిలా జరుగుతుంది...?
ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయం తెలుసుకోవాలంటే... ముందుగా నెలసరి ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. మహిళల్లో ప్రతినెలా ఒక అండం విడుదలవుతుంది. ఒకవేళ అది ఫలదీకరణ చెందితే... దాని ఎదుగుదలకు తోడ్పడేందుకు గర్భసంచిలో ఎండోమెట్రియమ్‌ అనే పొర మందంగా మారుతుంది.

ఒకవేళ అండం ఫలదీకరణ చెంది పిండంగా మారితే... మందంగా మారిన ఈ ఎండోమెట్రియమ్‌ పొరలోనే అది ఎదుగుతుంది. ఫలదీకరణం జరగనప్పుడు... ఈ పొర రాలిపోతుంది. అలా ఇది ఊడి బయటకు వచ్చే సమయంలో రక్తస్రావం జరుగుతుంది.

కొందరిలో ఈ పొర ఊడిపోయేందుకు వీలుగా బిగుసుకుపోయేందుకు ప్రోస్టాగ్లాండిన్‌ అనే హార్మోన్‌ లాంటి జీవరసాయనం కారణమవుతుంది. ఇదే యువతుల్లో తీవ్రమైన నొప్పి, బాధతో పాటు కొన్నిసార్లు ఇన్‌ఫ్లమేషన్‌ పుట్టేలా (ట్రిగర్‌) చేస్తుంది. ఫలితంగా చుట్టుపక్కల కండరాలూ బిగుసుకుపోయి తీవ్రమైన బాధకు గురిచేస్తాయి. అందుకే రుతుస్రావం సమయంలో ఈ బాధ, నొప్పి, కండరాల బిగుతు అన్నమాట. 

పై సమస్యతో మాత్రమే కాకుండా మెనుస్ట్రువల్‌ క్రాంప్స్‌కు మరికొన్ని కారణాలూ ఉన్నాయి. ఉదాహరణకు... 
ఎండోమెట్రియాసిస్‌ : ఎండోమెట్రియమ్‌ అనే పొరకు కలిగే ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల.
యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ : యుటెరస్‌లో పుట్టే కొన్ని క్యాన్సర్‌ రకానికి చెందని (నాన్‌క్యాన్సరస్‌) గడ్డల వంటి వాటి వల్ల. 
అడెనోమయోసిస్‌ : యుటెరస్‌ చుట్టూ న్న పొర పొరుగున ఉన్న ఇతర కండరాల్లోకి చొచ్చుకుపోవడం వల్ల. 
పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌ : ఏవైనా కారణాల వల్ల మహిళల్లో పునరుత్పత్తికి చెందిన అవయవాలకు హానికరమైన బ్యాక్టీరియా సోకడం వల్ల వచ్చే జబ్బుల కారణంగా. 
సర్వైకల్‌ స్టెనోసిస్‌ : కొంతమంది మహిళల్లో వారి గర్భాశయ ముఖద్వారం ఎంత సన్నగా ఉంటుందంటే... అది రుతుస్రావాలను, రక్తస్రావాలను సాఫీగా పోనివ్వదు. దాంతో వ్యర్థాలు అక్కడ పేరుకుపోవడం వల్ల తీవ్రమైన నొప్పి రావచ్చు. 

ఎప్పుడు సాధారణం... ఎప్పుడెప్పుడు హానికరం...
సాధారణంగా మెనుస్ట్రువల్‌ క్రాంప్స్‌ వల్ల ఆరోగ్యానికీ లేదా ఇతరత్రా ఎలాంటి హానీ, ముప్పూ ఉండవు. తీవ్రమైన బాధ మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో వీటిపై సీరియస్‌గా దృష్టిసారించాల్సి ఉంటుంది.

అదెప్పుడంటే... 
30 ఏళ్లు పైబడ్డాకా ఈ సమస్య వస్తుంటే. 
పదకొండు లేదా అంతకంటే చిన్న వయసులోనే యుక్తవయస్కురాలైతే. ∙ïపీరియడ్స్‌ సమయంలో రక్తస్రావం చాలా ఎక్కువగా ఉంటే (మెనొరేజియా)  
రక్తస్రావం/రుతుస్రావం ఒక క్రమపద్ధతిలో కాకుండా ఎలా పడితే అలా అవుతుంటే (మెట్రోరేజియా) ∙కుటుంబంలో మెనుస్ట్రువల్‌ క్రాంప్స్‌ (డిస్‌మెనూరియా) ఆరోగ్య చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) ఉంటే. 

ఏదైనా ప్రమాదమా : ఈ నొప్పి వల్ల ఎలాంటి పనులూ చేయలేకపోవడం, యుక్తవయసులోని పిల్లలు స్కూల్‌/కాలేజీకి వెళ్లలేకపోవడం, యువతులు ఆఫీసుకు వెళ్లడం కష్టమై... వారి పనులకు అంతరాయం కలగడం వంటి సాధారణ సమస్యలే తప్ప ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. 
అయితే కొన్ని సందర్భాల్లో అంటే... అధికరక్తస్రావం లేదా సంతానలేమి వంటి సమస్యలతో పాటు ఈ కండిషన్‌ కూడా ఉన్నప్పుడు దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

ఉదాహరణకు పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌ కారణంగా ఫెలోపియన్‌ ట్యూబ్స్‌ దెబ్బతినడం, ఫలదీకరణం చెందిన అండం గర్భసంచి (యుటెరస్‌)లో చక్కగా ఒదగలేకపోవడం వంటి సమస్యలు రావచ్చు. అవి మినహా మరే రకమైన ఇబ్బందీ ఉండదు. చాలా సందర్భాల్లో వయసు పెరగుతుండటంతోనూ, బిడ్డ పుట్టిన తర్వాతనో ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. 

ఇవీ లక్షణాలు  
నెలసరి సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, బాధ.  
పొత్తికడుపులో ఎంతో ఒత్తిడి ఉన్న ఫీలింగ్‌. 
వీపు వెనక, నడుము, తొడ భాగంలో తీవ్రమైన నొప్పి (పొత్తికడుపు నుంచి బయలుదేరే ఇదే నొప్పి రేడియేటింగ్‌ పెయిన్‌ రూపంలో ఈ భాగాలకు విస్తరిస్తుంటుంది. 
కడుపులో వికారంగా ఉండటం. ఒక్కోసారి వాంతులు కావడం. 
కొంతమందిలో నీళ్లవిరేచనాలు, తలనొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. 

చికిత్స : అయితే చికిత్సలోనూ నేరుగా మందులు వాడకుండా కొన్ని ప్రత్యామ్నాయ ప్రక్రియలు అవలంబిస్తారు. ఉదాహరణకు తొలుత... 
వ్యాయామం (ఎక్సర్‌సైజ్‌)
హీట్‌ థెరపీ
వార్మ్‌ బాత్‌
మసాజ్‌
కంటినిండా తగినంత నిద్ర
ద్యానం, యోగా వంటి ప్రక్రియలతో చాలావరకు ఉపశమనం ఉంటుంది.
వీటితోనూ తగినంత ఫలితం లేనప్పుడు కొన్ని నొప్పి నివారణ మందులు, హార్మోన్‌ ట్యాబ్లెట్లు, లోపల ఏదైనా ఇన్ఫెక్షన్‌ ఉంటే యాంటీబయాటిక్స్‌ వాడటం వంటివి.

ఒకవేళ ఈ సమస్యతో పాటు ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్, ఎడినోమయోసిస్‌ (గర్భసంచి పొర దాని తాలుకు కండరాల్లోకి లోపలికి పెరగడం) వంటి సమస్యలు ఉంటే నొప్పికి వాడే మందులతో పాటు అరుదుగా ఆపరేషన్‌ కూడా అవసరం పడవచ్చు.

పరీక్షలు : సాధారణ నొప్పి నివారణ మందులు వాడాక కూడా నొప్పి, క్రాంప్స్‌ సమస్యకు ఉపశమనం దొరకకపోతే అప్పుడు అల్ట్రాసౌండ్‌ స్కాన్స్‌ పరీక్ష అవసరం కావచ్చు. ఈ సమస్యకు అరుదుగా లాపరోస్కోపీ అవసరం కావచ్చు.

సూచన... 
నిర్దిష్టంగా నివారణ పూర్తిగా సాధ్యం కాకపోయినప్పటికీ... యువతులు రుతుస్రావం సమయంలో తాము కోల్పోయే ఐరన్‌ భర్తీ అయ్యేందుకు ఐరన్‌ పుష్కలంగా ఉండే ముదురాకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు, ఖర్జూరాలు, పల్టీపట్టి (చిక్కీ) వంటి తినే పదార్థాలు తింటూ,  ఖనిజలవణాలు భర్తీ అయ్యేందుకు ఆరోగ్యకరమైన ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవడం చాలావరకు మేలు చేస్తుంది. 

-డాక్టర్‌ శిరీష ప్రమథ, సీనియర్‌ గైనకాలజిస్ట్, లాపరోస్కోపిక్‌ సర్జన్‌ అండ్‌ ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌  

మరిన్ని వార్తలు