Thyroid Cancer: థైరాయిడ్‌ క్యాన్సర్‌.. మహిళలతో పోలిస్తే పురుషులకే ముప్పు ఎక్కువ! లక్షణాలివే

22 Sep, 2022 10:21 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలకూ, మరణాలకు గల ప్రధాన కారణాలలో క్యాన్సర్‌ ఒకటి. 2020లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి తొంభై లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని అంచనా. ప్రపంచమంతటి మరణాల్లో రెండో అతి ప్రధాన కారణం క్యాన్సర్‌. ఈ ప్రాణాంతక వ్యాధి వల్ల 2020లో దాదాపు 99 లక్షల మంది చనిపోయారు. 

ఈ కేసుల విషయంలో భారతదేశమూ మినహాయింపు కాదు. మన దేశంలోనూ ప్రతి ఏటా 13 లక్షల కొత్త క్యాన్సర్‌ కేసులు నమోదవుతుండగా, వీళ్లలో దాదాపు ఎనిమిది లక్షల మంది మరణిస్తున్నారు. 

క్యాన్సర్‌ కేవలం ఆరోగ్యానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇందులో సామాజిక, ఆర్థిక, మానవ హక్కులతో కూడిన సంక్లిష్టమైన అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి. 

ఇతర క్యాన్సర్లతో పోలిస్తే థైరాయిడ్‌ క్యాన్సర్‌ ఇటీవల చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. మన దేశంలో ఏటా 20,000 కంటే ఎక్కువగా థైరాయిడ్‌ కేసులు నమోదవుతుండగా... వీళ్లలో దాదాపు 4,000 మంది మృతిచెందుతున్నారు. సెప్టెంబరు నెల ‘థైరాయిడ్‌ క్యాన్సర్‌ అవగాహన మాసం’ కావడం వల్ల దీని గురించి అవగాహన పెంచుకోవడం మనందరి విధి.  

థైరాయిడ్‌ క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే శస్త్రచికిత్స, రేడియేషన్, అయోడిన్‌ వంటి చికిత్సలతో దీన్ని దాదాపుగా పూర్తిగా నయం చేయవచ్చు. ఇది మరీ ముదిరితే మరింత అధునాతనమైన, ప్రభావవంతమైన చికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. ఈ సరికొత్త చికిత్స ప్రక్రియలన్నీ నిర్దిష్టంగా థైరాయిడ్‌ క్యాన్సర్‌నే లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయి. 

కారణాలు:
వంశపారంపర్యం అనే అంశం, కుటుంబ చరిత్ర, వయసు, లింగభేదం... వంటివి థైరాయిడ్‌ క్యాన్సర్‌కు కారణాల్లో కొన్ని. మార్చేందుకు వీలు కాని అంశాలివి. ఏ వయసువారికైనా థైరాయిడ్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలుంటాయి. అయితే మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఈ క్యాన్సర్‌ ముప్పు ఎక్కువ.

మరీ ముఖ్యంగా 60 నుంచి 70 ఏళ్ల వయసులో ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. (రోగ నిర్ధారణ సమయంలో దాదాపు 40 – 50 ఏళ్లవారిలో ఇదెక్కువగా కనిపించడం వైద్యులు చూస్తుంటారు). 

రేడియేషన్‌కు ఎక్స్‌పోజ్‌ కావడం, ఊబకాయం, ఆహారంలో అయోడిన్‌ మోతాదులు ఎక్కువగా ఉండటం వంటి అంశాలూ ఈ క్యాన్సర్‌కు కారణమని నిపుణుల అభిప్రాయం. 

లక్షణాలు:
మెడ వద్ద బొడిపెలా కనిపించడం, కొన్ని సందర్భాల్లో అది వేగంగా పెరగడం, మెడ దగ్గర వాపు, మెడ ముందు భాగంలో నొప్పి, ఇది కొన్నిసార్లు చెవుల వద్దకు పాకడం, గొంతు బొంగురుబోవడం లేదా స్వరంలో రావడం, మింగడం కష్టంగా మారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జలుబు వంటి లక్షణాలే ఏమీ లేకుండా ఎడతెరపి లేకుండా దగ్గు రావడం వంటివి దీని లక్షణాల్లో కొన్ని.

ఈ లక్షణాలు కేవలం థైరాయిడ్‌ క్యాన్సర్‌లోనే కాకుండా... గొంతు ప్రాంతంలో కనిపించే ఇతర క్యాన్సర్లలోనూ కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవడం అవసరం.  

చికిత్స:
థైరాయిడ్‌ క్యాన్సర్‌ కనిపించినప్పుడు ప్రధానంగా థైరాయిడెక్టమీ శస్త్రచికిత్సతో థైరాయిడ్‌ గ్రంథిని తొలగిస్తారు. కణితి ఉన్నవైపు థైరాయిడ్‌ గ్రంథి భాగాన్ని తొలగించడంతో పాటు ఈ గ్రంథి వెలుపలి భాగంలో ఉన్న కణుతులకూ చికిత్స చేస్తారు. ఇది లింఫ్‌నోడ్స్‌కు విస్తరించినట్లు గమనిస్తే, అది విస్తరించిందని అనుమానించిన భాగాలన్నింటినీ శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు.

అటు తర్వాత చికిత్సలు క్యాన్సర్‌ దశ మీద ఆధారపడి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రారంభ (టీ1 లేదా టీ2) దశల్లో... థైరాయిడెక్టమీ తర్వాత రేడియోధార్మిక అయోడిన్‌ (ఆర్‌ఏఐ) చికిత్స చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. చికిత్స తర్వాత మళ్లీ ఇదే క్యాన్సర్‌ పునరావృతమైన సందర్భాల్లో ‘రేడియో అయోడిన్‌’ చికిత్స ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలను రాబడతారు.

‘ఆర్‌ఏఐ’ చికిత్సను తరచుగా టీ3 లేదా టీ4 ట్యూమర్లకూ, అలాగే లింఫ్‌నోడ్స్‌ మీద కణుపులకూ, లేదా ప్రధాన ప్రాంతం నుంచి దూరంగా విస్తరించిన క్యాన్సర్‌లలోనూ ఇస్తుంటారు. శస్త్రచికిత్స ద్వారా తొలగింపునకు సాధ్యం కాని క్యాన్సర్‌ కణజాలాన్ని పూర్తిగా నాశనం చేయడమే ఈ చికిత్స లక్ష్యం. ఒకవేళ బాధితులు ‘ఆర్‌ఏఐ’కి ప్రతిస్పందించకపోతే... వెలుపలకు వ్యాధి వ్యాప్తిచెందిన భాగాలకు ‘బీమ్‌ రేడియేషన్‌ థెరపీ’, ‘టార్గెటెడ్‌ థెరపీ’ లేదా ‘కీమోథెరపీ’లతో చికిత్స చేయాల్సి ఉంటుంది. 

థైరాయిడ్‌ క్యాన్సర్‌ బాధితులు తమ వ్యక్తిగత ప్రొఫైల్‌ను, వ్యాధి సంబంధిత అంశాలను ఎప్పటికప్పుడు తమకు చికిత్స అందించే డాక్టర్‌కు తెలుపుతూ ఉండాలి. చికిత్స పూర్తయ్యాక కూడా దాదాపు జీవిత కాలమంతా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అవసరం. 

మొదట్లోనే క్యాన్సర్‌ లక్షణాలను గుర్తించి, సకాలంలో చికిత్స అందించడం అన్నది ఏ క్యాన్సర్‌లోనైనా మంచి ఫలితాలను ఇచ్చే అంశం. అందుకే క్యాన్సర్ల్‌పై పోరాటంలో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని, మంచి సమన్వయంతో పనిచేస్తే ఫలితాలు కూడా అంతే బాగుంటాయి. బాధితుల ఆరోగ్యంలోనూ మంచి పురోగతి కనిపిస్తుంది.

– డాక్టర్‌ పాలంకి సత్య దత్తాత్రేయ, 
డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ ఆఫ్‌ మెడికల్‌ ఆంకాలజీ సర్వీసెస్, 
రెనోవా సౌమ్య క్యాన్సర్‌ సెంటర్, 
కార్ఖానా, సికింద్రాబాద్‌

చదవండి: Alzheimer: నాన్నల కంటే అమ్మల్లోనే ఈ సమస్య ఎక్కువ.. స్త్రీలలో రెండు ‘ఎక్స్‌’ క్రోమోజోములు! అందుకేనా ఇలా?

మరిన్ని వార్తలు