Health Tips: ఎంత సంపాదిస్తే ఏం లాభం? ఆరోగ్యం లేకుంటే.. ఈ చిట్కాలు పాటిస్తే

29 Apr, 2022 13:48 IST|Sakshi

మిమ్మల్ని మీరు పట్టించుకోండి

Healthy Lifestyle Tips: ప్రస్తుత పోటీ ప్రపంచంలో రోజువారీ జీవితంలో క్షణం తీరిక లేకుండా బిజీగా  గడిపేస్తున్నారు చాలామంది. కొంత మంది అయితే మాడిపోతున్న పొట్టను పిజ్జా,  బర్గర్లతోనో, బిస్కెట్లతోనో మాయ చేస్తూ, కూరుకుపోతున్న కళ్లను టీ చుక్కలతో బలవంతంగా తెరిపి'స్తూ నిద్రాహారాలు మాని మరీ పని చేస్తుంటారు. ఇలా బిజీ లైఫ్‌లో పడి చాలా మంది తమ ఆరోగ్యం పట్ల కనీస శ్రద్ధ చూపించడం కూడా మరచిపోతున్నారు. 

ఫలితంగా కడుపులో అల్సర్లు, గ్యాస్‌... లావుపాటి కళ్లద్దాలు, ఊబకాయాలతో రకరకాల రోగాల బారిన పడుతున్నారు. ఎంత సంపాదిస్తే ఏం లాభం? వేళకు తిండి, కంటినిండా నిద్రా, ఆ సంపాదనను అనుభవించేందుకు తగిన ఆరోగ్యం లేకపోతే! పరుగులు పెట్టడం తప్పదు, సంపాదించడమూ తప్పదు. అయితే జీవనశైలిలో తగిన మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా... ఆనందంగా జీవించవచ్చు. అందుకు తగిన మార్గాలివిగో...

ప్రపంచంతో పాటు పోటీ పడి ముందుకు సాగటం అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన విషయం. ఇది కాదనలేని సత్యం. అయితే ఇదే సమయంలో ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపడం అత్యవసరం. ఇందుకోసం ప్రతి ఒక్కరు తమ కోసం తాము రోజూ కొంత సమయాన్ని విధిగా కేటాయించాలని, లేదంటే చిక్కుల్లో పడతారని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

వ్యాయామంతో మొదలు పెట్టాలి
కరోనా ప్రభావం వల్ల మొన్నటి దాకా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేశారు చాలా మంది. కొంతమంది ఇప్పటికీ  అదే పద్ధతిలో ఉన్నారు. కొన్ని సంస్థలలో మాత్రం వారానికి ఒకటి రెండు రోజులు మాత్రమే ఆఫీసుకు వచ్చేలా, మిగిలిన రోజులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కొనసాగించమని ఉద్యోగులకు చెబుతున్నారు.

దీనితో కనీసం బయటకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే.. తినడం, పనిచేయడం, పడుకోవడం వంటివి చేస్తున్నారు. దీనిమూలంగా ఒకవిధమైన లేజీనెస్, ఏదో పోగొట్టుకున్నట్లు అనిపించడం, ఇంటిలో చిన్న చిన్న కీచులాటలు తప్పడం లేదు. 

ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ప్రతి రోజు ఉదయం లేవగానే రన్నింగ్, జాగింగ్‌ వంటివి చేయడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటే.. ఇంట్లోనే వీలైన వ్యాయామాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా చిన్న చిన్న వ్యాయామాలు లేదా యోగా చేయడం ద్వారా.. పని ఒత్తిడి దూరమై, ప్రతి రోజూ కొత్తగా ప్రారంభించేందుకు వీలవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. 

బ్రేక్‌ఫాస్ట్‌ను బ్రేక్‌ చేయొద్దు:
వ్యాయామం చేసిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌ చేయడానికి బద్ధకించవద్దు. ఇడ్లీ, దోసె, ఉప్మా, చపాతి, మొలకలు, పండ్ల ముక్కలు, కీరా ముక్కలు... ఇలా ఏదైనా సరే మీకు ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌ తప్పకుండా చేయండి. టిఫిన్‌ తినకుండా పని చేయడం వల్ల నిస్సత్తువగా ఉండటం, పని మీద ఏకాగ్రత లేకపోవడం, పని చేయడానికి తగిన శక్తి లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన తర్వాతే మీ పనిలోకి దిగండి. 

మంచి నీళ్లు తాగటం మంచిది
శరీరంలో అన్ని క్రియలు సరిగ్గా జరగాలంటే నీరు చాలా అవసరం. అందుకే తరచూ నీళ్లు తాగటం మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. సమృద్ధిగా నీళ్లు తాగడం వల్ల చర్మం నిగ నిగలాడుతూ.. ఆరోగ్యంగా ఉంటుంది. దాహం అయితేనే నీళ్లు తాగడం అనేది కాకుండా...  కనీసం గుక్కెడు నీళ్లతో గొంతు తడుపుకోవడమూ మంచిది. 

ఆహారంపై దృష్టి తప్పనిసరి
ఇంట్లోనే ఉంటున్నాం కదా అని చాలామంది ఒక సమయం అంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటుంటారు. అంతే కాదు, టైమ్‌ పాస్‌ కోసం స్నాక్స్‌ అంటూ జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.

రోజు టైమ్‌ టేబుల్‌ ఫిక్స్‌ చేసుకుని.. బ్రేక్‌ ఫాస్ట్, లంచ్, డిన్నర్‌ మధ్యలో స్నాక్స్‌ వంటివి తీసుకోవడం వల్ల ఆహారంలో రుచితో పాటు పోషకాలు కూడా ఉండేలా చూసుకోవడం అవసరం.

రిలాక్సేషన్‌కు రిలాక్సేషన్‌ ఇవ్వకండి
ఎంత పని చేసినా, మధ్య మధ్యలో కాసేపు సేదతీరడం అవసరం. లేదంటే మెదడు వేడెక్కి పనిమీద ధ్యాస తగ్గిపోతుంది. ఫలితంగా ఎక్కువ గంటలు పని చేసిన ట్లు అనిపిస్తుంది కానీ చేసిన పని కనిపించదు. 

ఒత్తిడి వద్దే వద్దు
ఇంట్లోనే ఉండటం వల్ల చాలా మందికి ఒత్తిడి, ఆందోళన వంటివి పెరుగుతుండటం సాధారణ సమస్యగా మారింది. ఇందుకోసం ఒత్తిడిగా అనిపించినప్పుడు కాసేపు పనిని పక్కన పెట్టి.. ఇంట్లో వాళ్లతో మాట్లాడటం కాసేపు ప్రకృతిని ఆస్వాదించడం వంటివి చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

స్మార్ట్‌గా పక్కన పెట్టేయండి
అన్నింటికీ మించి స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువగా వాడకపోవడమే మంచిది. ఎందుకంటే, చాలా మంది ఫోన్‌ వాడుతూ టైమ్‌ ఎంతసేపు గడిచించో కూడా పట్టించుకోరు. అందుకే స్మార్ట్‌ ఫోన్‌ను స్మార్ట్‌గా వాడటం అలవాటు చేసుకోవాలి. ఎంతసేపు వాడుతున్నాం అనే విషయంపై దృష్టి సారించాలి.

నిద్రను జోకొట్టకండి
రోజంతా చురుకుగా ఉండాలంటే కంటినిండా నిద్ర పోవడం చాలా అవసరం. రోజూ 8 గంటలు నిద్రపోవడం వల్ల శరీరానికి కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. దీని ద్వారా మరుసటి రోజును తాజాగా, నూతనోత్సాహంతో ఆరంభించవచ్చు. 

మనం పైన చెప్పుకున్నవన్నీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ జాబ్‌లో ఉన్నవారికే అనిపించవచ్చు కానీ, రిటైర్‌ అయి విశ్రాంత జీవితం గడిపేవారు అయినా, ఇంటి వద్దే ఉండి కుటుంబ సభ్యుల కోసం పనులు చేస్తూ పనిలోనే లీనమైపోయే గృహిణులు అయినా... ఇలా ఎవరూ మినహాయింపు కాదు.  

చదవండి👉🏾 Vimala Reddy: టైమ్‌పాస్‌ కోసం బ్యూటీ కోర్స్‌ చేశా.. 2 గంటలకు ఆరున్నర వేలు వచ్చాయి.. ఆ తర్వాత..

మరిన్ని వార్తలు