ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోవడం ఎలా? 

11 Feb, 2021 08:59 IST|Sakshi

హలో డాక్టర్‌

ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే కొంత శారీరక వ్యాయామం అవసరం. బరువు తగ్గాల్సిన ప్రక్రియలో లయబద్ధమైన శాస్వప్రక్రియతో పాటు గుండెవేగం, రక్తనాళాల్లో రక్తప్రసరణ పెరగడం, కండరాలకు తగిన పని... ఈ అన్ని కార్యక్రమాలు సరైన సమన్వయంతో జరిగినప్పుడే కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. ఇలా కొవ్వును తగ్గించే వ్యాయామాల్నే ఏరోబిక్స్‌ అంటారు. 

ఏరోబిక్స్‌ చేస్తున్నప్పుడు కొవ్వు ఎలా కరుగుతుందో తెలుసుకుందాం. 
ఊపిరితిత్తులు – శ్వాసించడం ద్వారా ప్రాణవాయువు ఊపిరితిత్తులను చేరుతుంది. సరిగా శ్వాసించడం వల్ల బయటి వాయువుల నుంచి ఆక్సిజన్‌ను ఎక్కువ గ్రహించగలుగుతాం.
గుండె, రక్తనాళాలు  –ఈ సిస్టమ్‌ శరీరంలో ఓ రవాణ వ్యవస్థలా పనిచేస్తుంది. గుండె, రక్తనాళాలు  ఆక్సిజన్‌ను, పోషక పదార్థాలను  శరీరంలోని కణజాలలకు  అందచేస్తాయి. ఎరోబిక్‌ ద్వారా (ఓ నిర్ణీత పరిమితిలో) ఎంతగా గుండె కొట్టుకునేలా చేయగలిగితే అంత సమర్థంగా ఈ రవాణాను మెరుగుపరచవచ్చు. 
పనిచేసె కండరాలు – ఇవి ఆక్సిజన్‌ను, పోషక పదార్థాలను గ్రహిస్తాయి. 
చక్కగా శ్వాసించడం, గుండె అధికంగా కొట్టుకోవటం, కండరాల పనితీరు– ఇవన్నీ శరీరంలో కొవ్వు కరిగేందుకు ఉపకరిస్తాయని తెలుసుకున్నాం కదా! ఈ మూడు పద్దతులను ఏకకాలంలో చేసినప్పుడు  దీని వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఈ రకమైన వ్యాయామాలనే ఎరోబిక్‌ ఎక్సర్‌సైజ్‌లు అని అంటారు. ఉదా. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్‌ లాంటి వ్యాయామాలు కొవ్వుని తగ్గించటంలో బాగా ఉపయోగపడతాయి.

ఆల్కహాల్‌ను వదిలించే డీ–అడిక్షన్‌ ఎలా చేస్తారు?
ఆల్కహాల్‌ సమాజంలో చాలా మంది జీవితాలను నాశనం చేస్తోంది. అయితే ఇది పరిష్కారం లేని సమస్యేమీ కాదు. ఆల్కహాల్‌కు అలవాటు పడినవారిని స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటి రకానికి చెందిన వారిలో... తమ సమస్య గురించి వారికి ఏమీ తెలియదు. తాము ఎప్పుడు మానాలంటే అప్పుడు మానేయగలమని భావించి, చికిత్సకు రారు. ఇలాంటివారి విషయంలోనూ కుటుంబానికి చేరువై సైకియాట్రిస్ట్‌లు వాళ్ల అలవాటు మాన్పించడానికి ఏదో ఒకటి చేయగలరు. ఇక రెండో రకానికి చెందిన వారికి తమ సమస్య ఎంత తీవ్రమైనదో వాళ్లకు అవగాహన ఉంటుంది. కానీ అలవాటు వారిని మద్యానికి బానిసలుగా మార్చేయడం వల్ల కోరికను జయించలేకపోతుంటారు. కాబట్టి ఈ రెండు రకాల వారికి ఏది అవసరమో ఆ చికిత్స చేయాల్సి ఉంటుంది. అంతేగాని... అందరినీ ఒకేగాటన గట్టి రీహాబ్‌ క్యాంప్‌లో చేర్చడం వల్ల ప్రయోజనం ఉండదు. పైగా దాని ప్రభావం తాత్కాలికం మాత్రమే. 

మొదట వారి సమస్య ఎంత తీవ్రమైనదన్న విషయంపై సైకియాట్రిస్ట్‌లు కౌన్సెలింగ్‌ ద్వారా పేషెంట్‌కు తెలియజెపుతారు. ఆ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో సైకియాట్రిస్టులకు పేషెంట్‌ సహకారించాల్సి ఉంటుంది. పేషెంట్‌ సహకారం లేకుండా ఆ అలవాటు మాన్పించడం కష్టం. ఆల్కహాలిజమ్‌ అన్నది ఒక అలవాటు కాదనీ... అది ఒక వ్యాధి అని వాళ్లలో బలంగా నాటుకుపోయేలా చేయాలి. ఆ తర్వాత ఆల్కహాల్‌ వల్ల వాళ్ల ఒంటిలో పేరుకున్న విషాలను క్రమంగా తొలగించే మందులు ఇవ్వాలి. ఇలా చేసే క్రమంలో ఫిట్స్‌ రావడం లేదా వాళ్లు తీవ్రమైన కోపోద్రేకాలకు లోనుకావడం వంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తున్నాయేమో చూసి... వాటిని రాకుండా మందులు మారుస్తూ పోవాలి.

గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే.. ఈ సమస్యకు ఒక రోజులో మంత్రం వేసినట్లుగా చికిత్స సాధ్యం కాదు. అలా చేయగలమంటూ వచ్చే అడ్వర్టయిజ్‌మెంట్లను నమ్మవద్దు. ఎందుకంటే అలాంటి మందులతో కాలేయం, గుండె వంటివి పాడయ్యే అవకాశం ఉంది. అందుకే దీన్ని ఒక మానసిక సమస్యలా పరిగణించి నిద్రసంబంధ వ్యాధినీ, డిప్రెషన్‌నూ, వివాహబంధాన్నీ, సామాజిక సంబంధాలనూ, యాంగై్జటీనీ, ఫోబియాలను, ఇతర భయాలనూ పరిగణనలోకి తీసుకుని చికిత్స చేస్తే ఈ అలవాటునుంచి బయటపడగలడు.

మరిన్ని వార్తలు