మా నాన్నను ధర్మేంద్ర ఏడిపించారు..

11 Mar, 2021 00:03 IST|Sakshi

‘ఒక విదేశీ షూటింగ్‌కు నాతోపాటు మా నాన్న వచ్చారు. ధర్మేంద్రతో పాటలో యాక్ట్‌ చేయాలి. నాన్నకు అప్పటికే ధర్మేంద్ర నా వెంట పడటం తెలుసు. అందుకని నాన్న ప్రతిసారి మా కారు ధర్మేంద్ర ఎక్కకుండా అడ్డుకునేవారు. అయినా సరే ధర్మేంద్ర మా కారులోనే వస్తానని అనేవారు. నేను బ్యాక్‌సీట్‌లో కూచోగానే మా నాన్న వెంటనే డోర్‌ తీసుకుని నా పక్కన కూచునేవారు. ధర్మేంద్ర చాలా క్లవర్‌. ఇంకో డోర్‌ నుంచి ఆయన ఎక్కి నా పక్కన కూచునేవారు. వాళ్లు ఇలా నా కోసం ప్లాన్లు వేయడం సరదాగా అనిపించేది’ అన్నారు హేమమాలిని. 

72 సంవత్సరాల హేమమాలిని నేటికి బాలీవుడ్‌ ‘డ్రీమ్‌గర్ల్‌’గా ఉన్నారు. అందుకే మొన్నటి ఆదివారం (మార్చి 7) విమెన్స్‌ డే సందర్భంగా ఇండియన్‌ ఐడెల్‌ ఎపిసోడ్‌ను ఆమె పేరున నిర్వహించారు. హేమమాలిని ఆ ఎపిసోడ్‌కు హాజరయ్యి ఆ సందర్భంగా చాలా విశేషాలు చెప్పారు హేమ మాలిని. అంతేకాదు, అందరినీ ఆశ్చర్యపరుస్తూ డాన్స్‌ చేశారు. ఆమె స్టెప్పులేసిన పాటల్లో ‘షోలే’లోని ‘జబ్‌ తక్‌ హై జాన్‌’ పాట ఒకటి. ‘షోలే’లో ఈ పాట క్లయిమాక్స్‌ లో వస్తుంది. గబ్బర్‌ సింగ్‌ ముందు మండుటెండలో బండరాళ్ల మీద పగిలిన గాజుపెంకులపై డాన్స్‌ చేస్తుంది హేమ మాలిని, ధరేంద్రను విడిపించుకోవడానికి. ఆ పాట వెనుక ఉన్న విశేషాలను కూడా ఆమె చెప్పారు–

‘ఆ పాట ఇలా ఉంటుందని దర్శకుడు రమేశ్‌ సిప్పి చెప్పారు. చేద్దాం... కాని షూటింగ్‌ నవంబర్, డిసెంబర్‌లో పెట్టుకోండి. అప్పుడు మైసూరు (షూటింగ్‌ జరుగుతున్న ప్రాంతం) చల్లగా ఉంటుంది అన్నాను. కాని రమేశ్‌ సిప్పీ వినలేదు. ఏప్రిల్‌ నెలఖారున షూటింగ్‌ పెట్టారు. అంత ఎండ లో రాళ్ల మీద డాన్స్‌ చేయడం ఎలా అనుకున్నాను. మా అమ్మ పాదాలకు ప్రత్యేకమైన సాక్సులు తయారు చేయించింది. అవి వేసుకుంటే కాళ్లు కాలవు.. సాక్సులు వేసుకున్నట్టు తెలియదు కూడా. వాటిని తొడుక్కుంటుంటే రమేశ్‌ సిప్పీ దూరం నుంచి చూసి ‘వద్దొద్దు్ద అవి వేయకండి’ అని వార్నింగ్‌ ఇచ్చారు. సరే... రాళ్ల మీద కాసిన్ని నీళ్లైనా పోయండి చల్లబడతాయి అన్నాను. దానికీ ఒప్పుకోలేదు. చివరకు పాటను అలాగే చేశాను. మొత్తం పాట తీయడానికి పది రోజులు పట్టింది. కాని ఫలితం ఎలా ఉందో మీరే చూశారుగా’ అన్నారామె.

‘జానీ మేరా నామ్‌ సినిమా సమయానికి నేను ఇంకా ఫీల్డుకి కొత్త. ఆ సినిమాలో వాదా తూ నిభాయా... పాట దేవ్‌ ఆనంద్‌ గారితో చేయాలి. రోప్‌ వేలో ఒక చైర్‌లో దేవ్‌ ఆనంద్‌ కూచుంటే ఆయన వొడిలో నేను కూచోవాలి. సరే.. సినిమాల్లో ఇవన్నీ తప్పవు. నేను దేవ్‌ గారి వొడిలో కూచున్నాక ప్రతిసారీ కరెంటు పోయేది. నేను అలాగే కూచుని ఉండాల్సి వచ్చేది. ఏమిటా అని చూస్తే తర్వాత తెలిసింది... కావాలనే కరెంట్‌ తీసేస్తున్నారని. ఇలాంటివి కూడా షూటింగ్‌లలో జరుగుతుంటాయి’ అన్నారామె. తను ఇంట్లో మూడో సంతానమని, తను గర్భంలో ఉండగానే ఈసారి పుట్టేది ఆడపిల్లే.. దానికి హేమ మాలిని అని పేరు పెట్టాలి అని తన తల్లి అనుకుందని ఆమె చెప్పారు. పుట్టక ముందే పేరు రెడీ చేసుకున్న ఆమె పుట్టాక ఆ పేరును డ్రీమ్‌ గర్ల్‌ హేమమాలినిగా నిలబెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు