Health Tips: నోరు అపరిశుభ్రంగా ఉంటే క్యాన్సర్‌తోసహా.. ఎన్నో సమస్యలు..

1 Nov, 2021 13:03 IST|Sakshi

నోరు మంచిదైతే ఊరే కాదు... ఒళ్లూ మంచిదవుతుంది. ఈ కొత్త సామెత ఏమిటని ఆశ్చర్యపోనక్కర్లేదు. మీకు తెలుసా? అనేక అనారోగ్యాలకు మన నోరే రహదారి. అదెలాగంటే... ఎప్పుడూ నోరు శుభ్రంగా ఉంచుకుని, నోటి ఆరోగ్యం బాగుండేలా చూసుకుంటే గుండెజబ్బులూ, ఛాతీ ఇన్ఫెక్షన్ల వంటి అనేక జబ్బులను నివారించుకోవచ్చు. గుండెకు కీడు చేసే ఇన్ఫెక్షన్లు నోరు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు... అక్కడి నుంచి గుండెకు పాకి జబ్బును కలగజేస్తాయి. అంతేకాదు... నోరు పరిశుభ్రంగా లేకపోతే రోగనిరోధక వ్యవస్థ కూడా బలహీనమవుతుంది. ఫలితంగా అనేక జబ్బులకు అదే కారణమవుతుంది. 

అంతేకాదు... అపరిశుభ్రమైన నోరు లేదా అక్కడ చేరే సూక్ష్మక్రిములే ప్రత్యక్షంగా గుండెజబ్బులతో పాటు పరోక్షంగా డయాబెటిస్, ఆస్టియోపోరోసిస్, అనేక శ్వాసకోశ వ్యాధులతో పాటు అరుదుగా కొన్ని క్యాన్సర్లకూ కారణమవుతాయి.  ఎప్పటికప్పుడు నోటిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అక్కడ వచ్చే కొద్దిపాటి సమస్యలైన పళ్లలో రంధ్రాలు (క్యావిటీస్‌), చిగుర్ల సమస్యలు (జింజివైటిస్, పెరియోడాంటైటిస్‌) వంటి వాటికి తేలికపాటి చికిత్సలు తీసుకుంటూ ఉంటే... పెద్ద పెద్ద జబ్బులను చాలా చవగ్గా నివారించివచ్చు.

చదవండి: African Wild Dogs: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!!

అధ్యయనం తాలూకు కొన్ని గణాంకాలివి... 
ఇటీవలి కరోనా కారణంగా నోటి సమస్యలకు చికిత్స చేయించుకోవడం బాగా తగ్గిపోయింది. ఉదాహరణకు మొదటి లాక్‌డౌన్‌ దశలో దాదాపు 90 లక్షల మంది చిన్నారులు చిన్నపాటి దంతసమస్యల చికిత్సలకు సైతం పూర్తిగా దూరంగా ఉండిపోయారు. ఒక అధ్యయనం ప్రకారం... మన దేశంలో 2020 మార్చి నుంచి 2021 మార్చి నాటికి దంతవైద్యుల దగ్గరికి వచ్చే చిన్నారుల శాతం 34% నుంచి 10% కి పడిపోయింది. యుక్తవయస్కుల విషయానికి వస్తే... చికిత్సకు వచ్చే పెద్దవారి సంఖ్య గత రెండేళ్లలో 32.6% నుంచి 23.6%కు పడిపోయింది.

ఫలితంగా పెరుగుతున్న ముప్పు... దాంతో మునుపు తేలిగ్గా నివారితమైపోయే చాలా జబ్బుల ముప్పు ఇప్పుడు భారీగా పొంచి ఉన్నట్లు ఈ గణాంకాల వల్ల తేటతెల్లమవుతోంది. ప్రాథమికంగా చేసే స్క్రీనింగ్‌తో లేదా చిన్నపాటి సమస్య దశలోనే అంటే... పళ్లలోని రంధ్రా(క్యావిటీ)లకు చిన్నపాటి ఫిల్లింగులు, అరిగిన పళ్లకు క్రౌన్స్‌ అమర్చడం అనే కొద్దిపాటి చికిత్సలు, పళ్లను శుభ్రం చేసే స్కేలింగ్స్‌లతో తప్పిపోయే చాలా చాలా పెద్ద అనర్థాల ముప్పు ఇప్పుడు పొంచి ఉందని అర్థం. 

ఈ అధ్యయనాల ఆధారంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... నిన్నటి వరకు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ప్యాండమిక్‌ ముప్పు ఇప్పుడు కొద్దిగా ఉపశమించినందువల్ల ఎప్పటికప్పుడు నోటిని శుభ్రంగా ఉంచుకోవడం, చిగుర్ల సమస్యలు లేకుండా చూసుకోవడం, ఒకవేళ చిన్నపాటి సమస్యలు ఉంటే వాటిని మొగ్గ దశలోనే స్కేలింగ్, నోటి ఇన్ఫెక్షన్లకు సాధారణ చికిత్సతోనే కట్టడి చేస్తే ఎంతో పెద్ద జబ్బులనూ ముందే నివారించవచ్చన్న అవగాహనను పెంచుకోవడం  చాలా ముఖ్యం. 

- డాక్టర్‌ వికాస్‌ గౌడ్‌ 
సీనియర్‌ దంతవైద్యులు, ఈస్థటిక్‌ అండ్‌ ఇంప్లాంట్‌ స్పెషలిస్ట్‌ 

చదవండి: Health Tips: గుండె సమస్యలను పారదోలడంలో ఇది బెస్ట్‌!

మరిన్ని వార్తలు