అధిక ప్రొటీన్లు తీసుకుంటున్నారా? ఈ సమస్యలు రావొచ్చు

21 Jul, 2021 15:36 IST|Sakshi

జీర్ణకోశ సమస్యలకు దారితీసే ప్రమాదం

కరోనా చికిత్స అనంతరం పెరుగుతున్న సమస్యలు

మలబద్ధకం, కడుపులో ఇబ్బందులు తలెత్తుతున్న వైనం

ఫైబర్, ద్రవ పదార్థాలతో చెక్‌ పెట్టొచ్చని వైద్యుల సూచన

సాక్షి, హైదరాబాద్‌: అధిక ప్రొటీన్లు, తక్కువ ఫైబర్‌ తీసుకోవడం ద్వారా జీర్ణకోశ సంబంధ సమస్యలకు దారితీస్తుంది. కోవిడ్‌ సోకిన సమయంలో వైద్యంతో పాటు సూచిస్తున్న ఆహారం, పోషకాల్లోని వ్యత్యాసాల వల్ల పలువురికి ఇలాంటి సమస్యలే తలెత్తుతున్నట్లు వైద్యులు గుర్తిస్తున్నారు. సమతుల ఆహారంతో ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చని వారు సూచిస్తున్నారు.

కోవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత అనేక మందిలో మలబద్ధకం, కడుపులో ఇబ్బందులు సర్వసాధారణంగా మారాయని ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలోని యూరాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.ఆనంద్‌ పేర్కొన్నారు. దీనిద్వారా మలద్వారం దగ్గర పగుళ్లు, రక్తస్రావం వంటి సమస్యలతో కొందరు తమను సంప్రదిస్తున్నారని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్నవారు ఇతరత్రా తీవ్రమైన సమస్యలేవీ లేకుండా మలబద్ధకం మాత్రమే ఉంటే వంటింటి వైద్యం ద్వారా ఉపశమనం పొందుతున్నారని తెలిపారు. తాత్కాలిక ఉపశమనం సంగతెలా ఉన్నా ఆహారంలో మార్పు చేర్పులు అవసరం అని సూచిస్తున్నారు. 

లిక్విడ్‌ డైట్, వాకింగ్‌ బెస్ట్‌.. 
ఆహారం ద్వారా ఎక్కువ ప్రోటీన్‌ తీసుకుంటే మలబద్ధకం సమస్యలు రావడం సాధారణమే. దీనికి విరుగుడుగా ఫైబర్, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో రోజుకు కనీసం 30 గ్రాముల ఫైబర్‌ ఉండేలా చూసుకోవాలి. వాకింగ్‌ వంటి తేలికపాటి వ్యాయామాలు, శారీరక శ్రమ ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. 
– జి.సుష్మ, సీనియర్‌ క్లినికల్‌ డైటీషియన్, కేర్‌ హాస్పిటల్స్‌  

ఎక్కువైతే ముప్పే.. 
శరీరం సక్రమంగా తన విధులు నిర్వర్తించడానికి, వ్యాధి నిరోధక వ్యవస్థ పనితీరుకు రోజుకు ఒక వ్యక్తి తన శరీరం బరువులో ఒక కిలోకు 0.66 గ్రాముల ప్రొటీన్‌ అవసరం. అత్యధికంగా అది ఒక్క గ్రాము దాటకూడదు. రోజుకు 15 శాతం శక్తి (కేలరీలు)నిచ్చే హై ప్రొటీన్‌ ఆహారం సాధారణ పరిస్థితుల్లో వైద్యులు సూచించరు. అయితే కోవిడ్‌ చికిత్స సమయంలో తక్కువ ఫైబర్, అధిక ప్రోటీన్‌ ఉన్న ఆహారం చాలా మంది తీసుకున్నారు. దీంతో బాధాకరమైన మలవిసర్జన, పగుళ్లకు కారణమవుతుంది. ఎక్కువ రోజుల పాటు ఇలాగే ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, మలబద్ధకమే కాకుండా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడొచ్చని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌ డైరెక్టర్‌ ఆర్‌.హేమలత పేర్కొన్నారు. 

సమతుల ఆహారం క్షేమం 
ఎక్కువ ప్రోటీన్‌ కారణంగా వచి్చన సమస్యలను అధిగమించడానికి తగినంత ఫైబర్, తగినంత నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని స్టెరాయిడ్స్, యాంటీ బయాటిక్స్‌ సైతం ఆకలి పెరిగేందుకు కారణమవుతాయని పేర్కొంటున్నారు. దీంతో కోవిడ్‌ చికి త్స తర్వాత అధికంగా ఆహారం తీసుకునే అవకాశం లేకపోలేదు. అయితే ప్రొటీన్‌ ఎక్కువగా ఉన్నవి కాకుండా ఫైబర్, కార్బోహైడ్రేట్లు, యాం టీఆక్సిడెంట్లు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. ప్రోటీన్‌ అధికంగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు తప్పనిసరిగా దాన్ని బ్యాలెన్స్‌ చేసేందుకు తగినంత ఫైబర్‌ ఆహారం కూడా ఉండాలి. 

సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా కారణమే.. 
ఏ రకమైన ఔషధం వల్లనైనా ఎసిడిటీ, అజీర్తి తదితర జీర్ణకోశ సంబంధ సమస్యలు అత్యంత సాధారణ దుష్ప్రభావాలు. జీర్ణకోశ సమస్యలు, ఎసిడిటీని ఎదుర్కోవటానికి తాము సాధారణంగా యాంటీయాసిడ్స్‌ సూచిస్తామని వైద్యులు చెబుతున్నారు. అయితే ఖాళీ కడుపుతో లేదా ఆహారం తర్వాత మందులు తీసుకోవాలా అనే విషయంలో రోగులకు స్పష్టత ఉండాలంటున్నారు. ఆకుకూరలు, పండ్లు, సలా డ్స్, మొలకలు, చిక్కుళ్లు వంటివి అధికమైన పీచు పదార్ధాలను తినాలని ఉంటాయి. అలాగే తృణ/చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, బీన్స్, పండ్లు, కూరగాయలు ద్వారా కూడా ఫైబర్‌ను పొందవచ్చు. పీచు తగినంత ఉండేలా చూసుకుంటే మలబద్ధకాన్ని నివారించడానికి, హృద్రోగ, డయాబెటిస్, పెద్ద ప్రేగు కేన్సర్లను అడ్డుకుంటుంది.

మరిన్ని వార్తలు