యూట్యూబ్‌ ‘ఫన్‌’- 2020

30 Dec, 2020 09:22 IST|Sakshi

కరోనాతో యావత్‌ ప్రపంచం మూగబోయిన వేళ...తమ వీడియోలతో సందడి చేశారు. లాక్‌డౌన్‌ బోర్‌డమ్‌ను బ్రేక్‌ చేసి ప్రేక్షకుల్లో హుషారు నింపారు.యూత్‌ఫుల్‌ సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ శక్తి ఏమిటో చెప్పకనే చెప్పారు. ‘హైయెస్ట్‌ పెయిడ్‌ యూట్యూబ్‌ స్టార్స్‌–2020’గా ఫోర్బ్స్‌ జాబితాలో నిలిచిన శ్రీమంతుల చిరు పరిచయం...

తొమ్మిది సంవత్సరాల కోటీశ్వరుడు!

చానల్‌: రెయాన్‌ వరల్డ్‌    ఎర్నింగ్స్‌: 29.5 మిలియన్‌  
సబ్‌స్క్రైబర్స్‌: 41.7 మిలియన్‌


బొమ్మలపై రివ్యూలు ఇచ్చే చానల్స్‌ తెగచూసే రెయాన్‌ కాజీ(టెక్సాస్‌) ఒకరోజు తల్లితో కలిసి సొంతంగా యూట్యూబ్‌ చానల్‌ మొదలుపెట్టాడు. అబ్బాయి కోరిక నెరవేర్చడానికి, అతడిలోని టాలెంట్‌ను బయటికి తీసుకురావడానికి ఏకంగా హైస్కూల్‌లో తాను చేస్తున్న కెమిస్ట్రీ టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసింది లోన్‌ కాజీ. 2015లో మొదలైన ‘రెయాన్‌ వరల్డ్‌’ యూట్యూబ్‌ చానల్‌కు అనూహ్యస్పందన లభించింది. విద్యను వినోదంతో కలిపి మిక్స్‌ చేసిన వీడియోలకు మంచి ఆదరణ లభించింది. 

► హాస్యం, సాహసం సేయరా డింభకా!

చానల్‌: మిస్టర్‌ బీస్ట్‌   ఎర్నింగ్స్‌: 24 మిలియన్‌     
సబ్‌స్క్రైబర్స్‌:   47.8 మిలియన్‌

నార్త్‌ కరోలిన(యూఎస్‌)లోని ఒక రెస్టారెంట్‌. సర్వర్‌ ఆర్డర్‌ అడిగింది. ‘రెండు గ్లాసుల మంచినీళ్లు చాలు’ అన్నాడు ఆ యువకుడు. తాగి వెళ్లిపోయాడు. అతడు కూర్చున్న టేబులపై ఒక చీటి ఉంది. ‘కమ్మని మంచినీళ్లు ఇచ్చినందుకు–థ్యాంక్స్‌’ చీటి పక్కనే టిప్‌. అంత పెద్ద మొత్తంలో టిప్‌ చూడడంతో ఆమెకు కళ్లు తిరిగినంత పనైంది. ‘ఎవరీ టిప్పర్‌?’ అని ఆరాతీస్తే ‘యూట్యూబ్‌స్టార్‌ మిస్టర్‌ బీస్ట్‌’ అని చెప్పారు. 22 సంవత్సరాల జిమ్మి డొనాల్డ్‌సన్‌ ‘మిస్టర్‌ బీస్ట్‌’ యూట్యూబ్‌ చానల్‌తో ఫేమస్‌ అయ్యాడు. 13 సంవత్సరాల వయసు నుంచే యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్‌ చేయడం మొదలుపెట్టాడు. ఒళ్లు గగుర్పొడిచే సాహసకృత్యాలకు హాస్యం జోడిస్తే...ఆ ఫలితమే మిస్టర్‌ బీస్ట్‌.

► ఆడుతా తీయగా హాయిగా!

చానల్‌: ప్రెస్టెన్‌    ఎర్నింగ్స్‌: 19 మిలియన్‌    
సబ్‌స్క్రైబర్స్‌: 33.4 మిలియన్‌

తన సమీపబంధువు ఒకరు లండన్‌లో ‘లండన్‌’ పేరుతో యూట్యూబ్‌ చానల్‌ మొదలుపెట్టాడు. ఆ స్ఫూర్తితో డల్లాస్‌(యూఎస్‌)లో సొంతంగా యూట్యూబ్‌ చానల్‌ స్టార్ట్‌ చేశాడు ప్రెస్టెన్‌ అర్స్‌మెన్‌. ప్రధాన చానల్‌తో పాటు  మరోఅయిదు చానల్స్‌ ఉన్నాయి. గేమింగ్‌ వీడియోలు అతడి చానల్స్‌కు ముడిసరుకు. పిల్లలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన వీడియోలు రూపొందిస్తుంటాడు. ఛాలెంజ్‌ వీడియోలు, ప్రాంక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు 26 సంవత్సరాల ప్రెస్టెన్‌.

► చిన్నారి కాదు చిచ్చర పిడుగు

చానల్‌: నస్ట్యా  ఎర్నింగ్స్‌:  18.5 మిలియన్‌  
సబ్‌స్క్రైబర్స్‌: 190.6 మిలియన్‌

టిక్‌ టాక్‌ పాప్‌లర్‌ కిడ్‌గా ఫేమస్‌ అయిన రష్యన్‌ చిన్నారి అనస్టాసియ ‘నస్ట్యా’ చానల్‌కు పిల్లల్లో అనూహ్యమైన ఆదరణ ఉంది. ఊహాత్మకమైన వీడియోలు, విజ్ఞానం, వినోదం మిళితమైన వీడియోలతో ‘నస్ట్యా’తో బ్రహ్మాండమైన పేరు సాధించింది. యూట్యూబ్‌ సెన్సేషనల్‌గా నిలిచిన ఆరేళ్ల అనస్టాసియ పేరు బ్రాండ్‌గా మారింది. ప్రసిద్ధ కంపెనీలు తమ ఉత్పత్తులు అనస్టాసియ పేరు వాడుకుంటున్నాయి. ‘జాజ్‌వేర్‌’ అనే బొమ్మల కంపెనీ ఈ చిన్నారి పేరుతో ఒక బొమ్మను కూడా తయారుచేసింది.

ఇన్‌స్టంట్‌ ఫీడ్‌బ్యాక్‌లో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. మనల్ని మెచ్చుకునేవాటితో పాటు నొచ్చుకునేలా చేసేవి కూడా ఉంటాయి. ‘ఫీడ్‌బ్యాక్‌’ను గైడ్‌లైన్‌గానే తీసుకోవాలి తప్ప ప్రశంసలకు అతిగా పొంగిపోవడం, విమర్శలకు మరింత అతిగా కృంగిపోకూడదు. పనికి ఎంత న్యాయం చేస్తున్నామనేదే ముఖ్యం. –విద్య అయ్యర్‌ (విద్య వోక్స్‌ యూట్యూబ్‌ చానల్‌)

మనవాళ్ల విషయానికి వస్తే భువన్‌ బామ్‌ (19.8 మిలియన్‌ సబ్‌స్క్రైబర్స్‌), ఆశిష్‌ చంచలని వైన్‌ (18.7 మిలియన్‌ సబ్‌స్క్రైబర్స్‌) గౌరవ్‌ –టెక్నికల్‌ గురూజీ (18.8 మిలియన్‌ సబ్‌స్క్రైబర్స్‌), విద్య–అయ్యర్‌ విద్య వోక్స్‌ (7 మిలియన్‌ ), సనమ్‌ పాప్‌–రాక్‌ బ్యాండ్‌(7 మిలియన్‌ సబ్‌స్క్రైబర్స్‌), శృతి అర్జున్‌ ఆనంద్‌ (8 మిలియన్‌ సబ్‌స్క్రైబర్స్‌)....మొదలైవారు ప్రేక్షక ఆదరణతో పాటు ఆర్థికవిజయం అందుకుంటున్నారు.

కంటెంట్‌ గురించి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటాను. యూత్‌ మా ప్రధాన టార్గెట్‌. వీడియోలపై కుబుంబసభ్యుల నుంచి స్నేహితుల వరకు అందరి అభిప్రాయాలు తీసుకుంటాను. మార్పులుచేర్పులు చేస్తుంటాను. ‘నాకు నచ్చితే అందరికీ నచ్చినట్లే’ అనే భావనలో నుంచి బయటికి రావాలి.
– శృతి అర్జున్‌ ఆనంద్, ఫేమస్‌ యూట్యూబర్‌

మరిన్ని వార్తలు